Shane Warne: లెజెండరీ క్రికెటర్, ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ షేన్ వార్న్ ఈనెల 4వ తేదీన హఠాన్మరణం చెందాడు. క్రికెట్ ప్రపంచాన్ని, తన అభిమానులను శోకసంద్రంలో ముంచేసి కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు. షేన్ వార్న్ మరణ వార్త విని అతని అభిమానులతో పాటు, క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. థాయిలాండ్ విహారంలో ఉన్న షేన్ వార్న్ తన విల్లా గదిలో విగత జీవిగా పడి ఉండడాన్ని గమనించి అతని మేనేజర్ ఆసుపత్రికి తరలించారు.

ఈ క్రమంలో మార్గమధ్యంలో మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. కాగా అతని మరణవార్త తెలిసిన తర్వాత ప్రజలు వార్న్‌కు ఇష్టమైన సిగరేట్లు, బీర్లు, పూలు, క్రికెట్ బంతులను ఎంసీజీ మైదానం బయటగల విగ్రహం దగ్గర ఉంచి నివాళులు అర్పించారు. అయితే అతని మృతికి గల కారణాలపై పలు అనుమానాలు తలెత్తాయి. ఉన్నట్టుండి షేన్ వార్న్ మృతి చెందడంతో అతని మృతిపై అనుమానాలున్నాయని పలువురు చెప్పడం ఆసక్తికరంగా మారింది.

షేన్ వార్న్ మందు తాగాడని వస్తున్న కథనాలపై, షేన్ వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్‌కిన్ స్పందించారు. షేన్ వార్న్ అసలు మందు తీసుకోలేదని, పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టును టీవీలో చూసాడని తెలిపాడు. అతడు బరువు తగ్గేందుకు డైటింగ్ చేస్తున్నాడని తెలిపాడు. అతని స్నేహితుడితో కలిసి భోజనం కూడా చేశాడని, తరువాత ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని తెలిపారు. తాను, తన స్నేహితుడు వచ్చి చూసేసరికి విగత జీవిగా పడి ఉన్నాడని వెల్లడించారు.
Also Read: చంద్రబాబు రాకున్నా.. తెలుగు తమ్ముళ్ల క్లారిటీ!
ఎన్నో గొప్ప గొప్ప విజయాలు అందించిన షేన్ వార్న్ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరు. అతని ఆట చూసి ముగ్దులు కానివారుండరు. అయితే అతని అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు. ‘మా దేశ అత్యుత్తమ వ్యక్తుల్లో వార్న్ ఒకరు, అతని అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తాం. ఈ బాధ్యతనంతా విక్టోరియా ప్రభుత్వం తీసుకుంటుంది’ అని పేర్కొన్నారు. కానీ అంత్యక్రియలు ఎక్కడ ఎప్పుడు నిర్వహిస్తారనేది మాత్రం వెల్లడించలేదు.
ఈ లెజెండరీ క్రికెటర్‌కు గౌరవార్థంగా అతను 700వ టెస్టు వికెట్‌తో పాటు ఓ యాషెస్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ తీసుకున్న ఎంసీజీ మైదానంలోని ది గ్రేట్ సదర్న్ స్టాండ్‌కు అతని పేరు పెట్టనున్నట్లు విక్టోరియా క్రీడల మంత్రి మార్టిన్ ప్రకటించారు. ఇప్పటికే ఆ మైదానం బయట అతని విగ్రహం ఉంది.