T20 World Cup 2022 India vs Netherlands: టీ20 ప్రపంచ కప్ లో ఇండియా జోరు కొనసాగుతోంది. గత ఆదివారం పాకిస్తాన్ మట్టి కరిపించిన టీమిండియా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను చిత్తు చేసి భారీ గెలుపును దక్కించుకుంది. నెదర్లాండ్స్ పై 56 పరుగుల తేడాతో విజయం దక్కించుకుని అభిమానులకు కనువిందు చూపింది. రెండు విజయాలతో మంచి ఊపు మీద ఉంది. సూపర్ 12 స్టేజ్ లో ఆదివారం ఇండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

ఈ నేపథ్యంలో టీమిండియాపై భారీ ఆశలే ఉన్నాయి. సఫారీలను ఎలాగైనా ఓడించాలనే తాపత్రయంతో టీమిండియా వ్యూహాలు ఖరారు చేస్తోంది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. లక్ష్య సాధనలో నెదర్లాండ్స్ ఘోరంగా విఫలమైంది. 123 పరుగులకే తొమ్మిది వికెట్టు కోల్పోయి ఓటమిని మూటగట్టుకుంది. ఆ జట్టులో టిమ్ ప్రింగ్లే ఒక్కడే 20 స్కోరు చేయడం గమనార్హం. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2, అక్షర్ పటేల్ 2, అశ్విన్ 2, షమి ఒక వికెట్ తీశారు.దీంతో టీమిండియా విక్టరీ సాధ్యమైంది. నెదర్లాండ్స్ ఓటమి ఖాయమైంది.
ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి నిరాశ పరచినా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం సంయమనంతో ఆడాడు. స్కోరు బోర్డును పరుగెత్తించాడు. రాహుల్ స్థానంలో వచ్చిన విరాట్ కోహ్లితో కలిసి రోహిత్ వీరోచితంగా బ్యాటింగ్ చేశాడు. దీంతో 62 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ వెనుదిరగడంతో భువనేశ్వర్ కుమార్ కూడా ధాటిగానే ఆడాడు. విరాట్ తో కలిసి మూడో వికెట్ కు 96 పరుగులు జోడించాడు. దీంతో ఇండియా ఘనవిజయం సాధించింది. రెండు మ్యాచ్ ల్లో వరుస విజయాలు సాధించడంతో అభిమానులకు భలే సంబరం ఏర్పడింది.

ముందుంది ముసళ్ల పండగ. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించి అభిమానుల కలలను నిజం చేయాలి. ఇదే స్ఫూర్తితో ఇండియా ఆటగాళ్లుగా సమష్టిగా ఆడి విజయాలు సొంతం చేసుకుంటే అభిమానులకు పండగే పండగ. టీ20 ప్రపంచ కప్ ను గెలవాలనే ఆకాంక్ష అందరిలో కలుగుతోంది. దీనికి ఆటగాళ్లే మంచి ప్రదర్శన చేయాలి. లేదంటే ఇబ్బందులు రావచ్చు. భవిష్యత్ లో విమర్శలు రాకుండా ఉండాలంటే ఆటగాళ్లు బాగా ఆడి తమ ప్రతాపం చూపించాల్సిందిగా అభిమానులు కోరుతున్నారు.