Sandhya Devanathan: యుద్ధం ఎంత చెడ్డదో.. ఆర్థిక మాంద్యం కూడా అంతే ప్రమాదకరమైనది. అందుకే కదా 2008 యాదికి వస్తే కార్పొరేట్లు ఉలిక్కిపడేది. అంతటి చరిత్ర ఉన్న లేమాన్ బ్రదర్స్ తుడిచి పెట్టుకుపోయింది.. 14 ఏళ్ల తర్వాత ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ట్విట్టర్ ఉద్యోగులను తీసి పడేసింది. అమెజాన్ పొదుపు చర్యలు పాటిస్తోంది. ఫేస్ బుక్ మాతృ సంస్థ అయిన మెటా 11% ఉద్యోగులకు ఉద్వాసన పలికింది..పీఠం కిందికి నీళ్లు వస్తున్నాయని భావించాడో ఏమోగానీ.. మార్క్ జూకర్ బర్గ్ ఈ కష్ట కాలంలో ఓ భారతీయురాలి శరణు జొచ్చాడు.

మెటా ఇండియా హెడ్ గా సంధ్య దేవ నాథన్
ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా ఇండియా హెడ్ గా సంధ్య దేవనాథన్ నియమితులయ్యారు. మెటా వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఆమె బాధ్యతలు నిర్వహించనున్నారు. మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్ రాజీనామా చేయడంతో యాజమాన్యం సంధ్యను నియమించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఆమె కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.సంధ్య తన బీటెక్ విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ ఆఫ్ స్టడీస్ లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. అందులో భాగంగానే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లో తరగతులకు హాజరయ్యారు. మెటా కు ముందు ఆమె సిటీ బ్యాంక్ లో పనిచేశారు. నూతన బాధ్యతలు స్వీకరించేందుకు త్వరలో ఆమె ఇండియాకు రానున్నారు.. గ్లోబల్ బిజినెస్ లీడర్ గా పేరుందిన సంధ్య దేవనాథన్ కు బ్యాంకింగ్, చెల్లింపులు, సాంకేతికతలో 22 ఏళ్ల అంతర్జాతీయ అనుభవం ఉంది. 2016 నుంచి సంధ్య మెటాలో పనిచేస్తున్నారు. 2020 నుంచి ఆసియా పసిఫిక్ మార్కెట్లో కంపెనీ గేమింగ్ వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నారు.. అలాగే పెప్పర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్లోబల్ బోర్డులో కూడా పనిచేస్తున్నారు..
కార్పొరేట్లకు భారతీయుల అండ
మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్, పెప్సికో వంటి కార్పొరేట్ దిగ్గజాలకు ఇప్పుడు భారతీయులే నాయకత్వం వహిస్తున్నారు. ఆ జాబితాలో సంధ్య చేరారు. అయితే ఇటీవల ట్విట్టర్ ను మస్క్ కొనుగోలు చేసిన నేపథ్యంలో ఆ కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్, సీ ఎఫ్ వో గద్దె విజయను తొలగించారు. ఇప్పుడు వారిని మళ్లీ రమ్మని ఆహ్వానం పలుకుతున్నారు. అంటే కష్టకాలంలో భారతీయులు మరింత సమర్థవంతంగా పనిచేస్తారని కార్పొరేట్లకు నమ్మకం.

అందుకే తమ కంపెనీలను కాపాడతారని కీలక సారధ్య బాధ్యతలు మొత్తం భారతీయులకే అప్పగించారు. అప్పగిస్తున్నారు కూడా. ఇక మెటా యాజమాన్యంలోని వాట్సప్ ఇండియా హెడ్, మెటా ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 11 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు మెటా ప్రకటించిన కొన్ని రోజులకే వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్, మిఠాయి ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ రాజీవ్ అగర్వాల్ రాజీనామా చేశారు.. సారధ్యమే కాదు సంక్షోభ సమయంలో భారతీయులు కంపెనీల దిమ్మతిరిగేలా తమ నిరసన కూడా వ్యక్తం చేయగలరు.