https://oktelugu.com/

Farm House Culture: ధనవంతుల కొత్త ట్రెండ్.. ప్రకృతితో మమేకం.. పేదలకు ఉపాధి

హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న షాద్ నగర్, చేవెళ్ల, శంకర్ పల్లి, ఇబ్రహీంపట్నంలో గత కొన్ని సంవత్సరాలుగా భూముల కొనుగోళ్లు భారీగా పెరిగిపోయాయి. సాధారణమైన భూములకు కూడా విపరితమైన ధరలు చెల్లించి కొంతమంది డబ్బున్న వాళ్ళు కొనుగోలు చేశారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 7, 2024 / 11:47 AM IST

    Farm House Culture

    Follow us on

    Farm House Culture: మహర్షి సినిమా చూశారా.. అందులో మహేష్ బాబు ఒక పెద్ద కంపెనీకి సీఈవో. వేల కోట్ల ఆస్తులుంటాయి. అవన్నీ కూడా పెద్దగా అతడికి సంతృప్తినివ్వవు. ఒక స్నేహితుడు చేస్తున్న భూ పోరాటం అతడిని ఆలోచింపజేస్తుంది. మట్టి వాసనను పరిచయం చేస్తుంది. పంటచేనును దగ్గర చేస్తుంది. ఎన్ని కోట్లు ఉన్నా.. ఈ మట్టే తనకు కూడును అందిస్తుందని అప్పటికి గాని అతనికి అర్థం కాదు. అప్పట్లో ఈ సినిమా ప్రభావం వల్ల చాలామంది వీకెండ్ ఫార్మింగ్ వైపు వెళ్లిపోయారు. ఇప్పటికీ అదే కల్చర్ కొనసాగిస్తున్నారు. సినిమాల ప్రభావమో.. చుట్టూ ఉన్న పరిస్థితులో.. మరేమిటో తెలియదు గానీ.. చాలామంది డబ్బు ఉన్నవాళ్లు తమ వ్యవహార శైలి మార్చుకుంటున్నారు.. తమ జీవనాన్ని మొక్కలతో గడిపేందుకు.. మట్టి మధ్య సంచరించేందుకు అలవాటు పడుతున్నారు. ఇంతకీ వారు ఏం చేస్తున్నారంటే..

    హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న షాద్ నగర్, చేవెళ్ల, శంకర్ పల్లి, ఇబ్రహీంపట్నంలో గత కొన్ని సంవత్సరాలుగా భూముల కొనుగోళ్లు భారీగా పెరిగిపోయాయి. సాధారణమైన భూములకు కూడా విపరితమైన ధరలు చెల్లించి కొంతమంది డబ్బున్న వాళ్ళు కొనుగోలు చేశారు. వాస్తవానికి ఆ భూములకు అంత ధరలు పలకవు. కానీ ఆ స్థాయిలో ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారంటే.. రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసమని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ భూములు కొన్న వాళ్ళు అలా చేయలేదు. ఆ భూమి చుట్టూ ముందుగా ప్రహరీ గోడ నిర్మించారు. ఆ తర్వాత అందులో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టుకున్నారు. మిగతా భూమిలో పండ్ల మొక్కలు.. కూరగాయల మొక్కలు.. వరి, ఇతర పంటలు వేయడం ప్రారంభించారు. అక్కడున్నవారికి అది కొత్తగా అనిపించింది. డబ్బున్న వాళ్లకు అది స్వర్గం లాగా కనిపించింది.

    అలా డబ్బున్న వాళ్ళు నిర్మించుకున్న ఫామ్ హౌస్ వారికి స్ట్రెస్ బస్టర్ లాగా మారిపోయింది. శనివారం కుటుంబంతో సహా రావడం.. ఆదివారం మొత్తం అక్కడే గడపడం.. సోమవారం ఉదయం మళ్లీ వెళ్లిపోవడం.. ఇది వారికి ఒక టైం టేబుల్ లాగా మారిపోయింది. ఆ ఫామ్ హౌస్ లో ఓ రైతు కుటుంబాన్ని తీసుకొచ్చి అక్కడ ఉంచడం.. వారికి నెలకు 15 నుంచి 20వేల వరకు వేతనం ఇవ్వడం.. వారి భోజనానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఆ ఫామ్ హౌస్ లో ఉండే రైతు కుటుంబాలు మొక్కల బాగోగులు చూడటం.. ఫామ్ హౌస్ నిర్వహణను పర్యవేక్షించడం వంటి పనులు చేస్తున్నారు.

    డబ్బున్న వాళ్లకు ఇంత దూరం వచ్చి ఫామ్ హౌస్ కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకాస్త డబ్బు పెడితే హైదరాబాదులోనే అద్భుతమైన లగ్జరీ హౌస్ కొనుగోలు చేసుకోవచ్చు. కానీ అవేవీ వారికి సాంత్వన కలిగించడం లేదు. స్ట్రెస్ బస్టర్ లాగా మారడం లేదు. స్వచ్ఛమైన గాలి, నాణ్యమైన కూరగాయలు, మట్టిని ఆస్వాదిస్తూ భోజనం చేయడం.. పంటచేలను చూసుకుంటూ మైమరచిపోవడం వంటి అనుభూతులు వారికి కొత్తగా కనిపిస్తున్నాయి. వారిలో ఉన్న ఒత్తిడిని దూరం చేస్తున్నాయి. డబ్బున్న వారిలో వచ్చిన ఈ మార్పు.. క్రమేపీ విస్తరిస్తోంది. ఇలాంటప్పుడే డబ్బు ఒక స్థాయికి వచ్చిన తర్వాత హాయినివ్వదు. ఆనందాన్ని ఇవ్వదు. అనుభూతులను ఇవ్వదు.. జస్ట్ సమాజంలో ఒక హోదాను మాత్రమే ఇస్తుంది. ఆ హోదా వల్ల పెద్దగా ఒరిగేది ఏది ఉండదనేది డబ్బున్న వాళ్లకు ఇప్పుడు అర్థమవుతోంది. దీనినే మూలాలను వెతుకుతూ ప్రయాణించడం అంటారు..