Ramadan 2024 : ముస్లింలు అత్యంత పవిత్రమాసంగా భావించే రంజాన్ మాసం మంగళవారం నుంచి ప్రారంభం అవుతుంది. సోమవారం(మార్చి 11న) నెలవంక కనిపించడంతో మంగళవారం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు చేపట్టాలని ముస్లిం మతపెద‍్దలు ప్రకటించారు. ఒమన్ మినహా గల్ఫ్ దేశాల్లో రేపటి నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. సౌదీ అరేబియాలోని సుడైర్, థుమైర్ ప్రాంతాల్లో కూడా సోమవారమే నెలవంక కనిపించింది. దీంతో మంగళవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభమువుతుందని సౌదీ సుప్రీంకోర్టు ప్రకటించింది.
భారత్‌లో కనిపించిన నెలవంక..
ఇదిలా ఉండగా భారత్‌లోనూ నెలవంక సోమవారం కనిపించింది. లక్నో, ఆగ్రా, కోల్‌కతాలో నెలవంక సాయంత్రం 6:52 గంటలకు కనిపించింది. దీంతో భారత్‌లో కూడా రంజాన్ మాసం మంగళవారం నుంచి ప్రారంభం అవుతుందని ముస్లిం మత పెద్దలు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి ఉపవాస దీక్షలు చేపట్టాలని సూచించారు.
నెల రోజులు కఠిన దీక్షలు..
రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ముస్లింలు నెల రోజులపాటు భక్తి, శ్రద్ధలతో, నియమ నిష్టలతో నెలరోజులు ఉపవాస దీక్ష చేపడతారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కనీసం మంచినీళ్లు కూడా ముట్టరు. లాలాజలం కూడా మింగకుండా భగవంతుడిని ప్రార్థిస్తారు. ప్రతీరోజు సూర్యోదయానికి ముందు సహర్ నుంచి సూర్యాస్తమయం ఇఫ్తార్ వరకు రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తారు.
ఖురాన్ పఠనం..
రంజాన్ మాసంలో రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయడంతోపాటు ప్రతీరోజు రాత్రి 8:30 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య తరావీహ్ నమాజులో ఖురాన్ చదువుతారు. ఈనెల రోజులు సఫిల్ చదివితే పుణ్యం వస్తుందని ఇస్లాం గ్రంథాల్లో ఉంది. ముస్లిం మతపెద్దలు కూడా అదే చెబుతున్నారు.