Raksha Bandhan 2023: భారతదేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో.. కొన్ని ప్రత్యేక రోజుల్లో మూసివేసే ఆలయాలు, లేదంటే కొన్ని రోజులే తెరిచి ఉండే ఆలయాల గురించి అప్పుడప్పుడు వింటుంటాం. అలాగే ఓ ఆలయాన్ని కూడా రానున్న రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) రోజు మాత్రమే తెరుస్తారు. ఏడాదిలో ఒక రోజు మాత్రమే తెరిరే ఈ ఆలయం ఎక్కడుంది.. రాఖీ పౌర్ణమి రోజు మాత్రమే ఎందుకు తెరుస్తారో తెలుసుకుందాం.
ఉత్తరాఖండ్‌లో ఆలయం..
దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్‌లో ఈ ఆలయం ఉంది. చమోలి జిల్లాలో ఉన్న మహా విష్ణువు గుడి అయిన వంశీనారాయణ(బనీ నారాయణ్) దేవాలయం ఏడాది మొత్తం మూసి ఉంటుంది. కేవలం రాఖీ పౌర్ణమి రోజు మాత్రమే పూజలు చేసేందుకు తెరుస్తారు. పురాణాల ప్రకారం బలి చక్రవర్తి అహంకారాన్ని అణిచివేసేందుకు విష్ణువు వామనుడిగా అవతరించాడు. ఇంతలో బలి చక్రవర్తి.. విష్ణువును తన ద్వార పాలకుడిగా చేస్తానని వాగ్దానం చేసి తన ద్వారపాలకుడిగా నియమించుకుంటాడు. దీంతో లక్ష్మీదేవి మారుమూల లోయలో కొలువుదీరి… బలి చక్రవర్తికి రాఖీ కట్టడంతోనే రాఖీ పండుగ మొదలైందని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. అంతేకాకుండా విష్ణువు తన వామన అవతారాన్ని ఇక్కడే చాలించాడని చెబుతారు. అందుకే ఈ ఆలయాన్ని కేవలం రాఖీ పండుగ రోజు తెరుస్తారట.
13 వేల అడుగుల ఎత్తులో..
ఈ ఆలయం అలకనందానది ఒడ్డున ఉంది. చుట్టూ ప్రకృతి కట్టిపడేస్తుంది. 13 వేల అడుగుల ఎత్తులో బద్రీనాథ్ ధామ్‌కు అతి సమీపంలో కొలువై ఉన్నాడు బన్షీ నారాయణుడు. ఈ ఆలయంలో సందడంతా రాఖీ రోజు మాత్రమే ఉంటుంది. తలుపులు తెరిచి పూజలు చేసిన అనంతరం మహిళలు, బాలికలు రాఖీలకు పూజలు చేస్తారు. స్వామివారి దర్శనం తర్వాత సోదరులకు రాఖీ కడతారు. రాఖీ పౌర్ణమి రోజు మాత్రమే భక్తులు పూజలు చేస్తారు. మిగిలిన రోజులన్నీ నారదమహాముని వచ్చి పూజలు చేస్తారని చెబుతారు.
అక్కడకు వెళ్లడం ఈజీ కాదు..
చమోలిలో ఉన్న ఈ బన్షీ నారాయణ్ ఆలయానికి వెళ్లే మార్గం చాలా కష్టంగా ఉంటుంది. గోపేశ్వర్ నుంచి ఉర్గాం లోయకు కారులో చేరుకోవాలి.. అక్కడి నుంచి దాదాపు 12 కిలో మీటర్లు కాలి నడకన వెళ్లాలి. వందల ఏళ్ల క్రితంనాటి ఆలయం, ఏడాదికోసారి తెరిచే ఈ ఆలయానికి చేరుకోవాలంటే కష్టపడాల్సిందే అంటారు భక్తులు. దేవతలకు, రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు ఇంద్రుడుతన పరివారాన్ని కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణిందేవేంద్రుడు యుద్ధంలో పాల్గొనేలా ఉత్సాహాన్ని నింపుతుంది. ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలంతా వారు పూజించిన రక్షలను తీసుకొచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. యద్ధంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం ఇప్పుడు రాఖీ పండుగగా మారిందని పురాణాలు చెప్తున్నాయి.