Problems after quitting job: జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని అందరికీ కోరిక ఉంటుంది. కానీ కొందరు మాత్రమే లక్ష్యాన్ని చేరుకుంటారు. మిగతావారు లక్ష్యం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. ఈ లక్ష్యంలో భాగంగా ఉద్యోగం లేదా వ్యాపారం ఎంచుకుంటారు. కొందరు ఉద్యోగం చేస్తూనే వ్యాపారం చేయాలని అనుకుంటారు.. మరికొందరు వ్యాపారంలో విసుగు పుట్టి ఉద్యోగం చేయాలని అనుకుంటారు. అయితే ప్రతి మధ్యతరగతి వ్యక్తికి ఉద్యోగమే అండగా నిలుస్తుంది. ఎందుకంటే స్థిరమైన ఆదాయం.. స్టెబిలిటీ జీవితం వంటివి ఇందులో ఉంటాయి. అయితే ఒక్కోసారి ఇంకా డబ్బు సంపాదించాలన్న కోరిక ఉంటుంది. ఈ క్రమంలో కొందరు ఈ ఉద్యోగాన్ని మానేసి బయట ప్రయత్నాలు చేయడం ప్రారంభిస్తారు. అయితే ఒక్కసారిగా ఉద్యోగం మానివేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
ఉద్యోగంలో సక్సెస్ అయిన వారు వ్యాపారంలో తమ ప్రతిభ చూపించాలని అనుకుంటారు. లేదా మరో కంపెనీకి వెళ్లి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి గొప్పవారిగా మారిపోవాలని అనుకుంటారు. అయితే ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు మరో ప్రయత్నం చేయడం తప్పేం కాదు. కానీ ఒక ఉద్యోగాన్ని వదిలి మరో ఉద్యోగం కోసం వెతుకులాడుకోవడం మాత్రం సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తాను మాత్రమే కాదు తనపై ఆధారపడిన కుటుంబం కూడా ఈ జాబ్ పైనే ఆధారపడుతుంది. అందువల్ల ఉద్యోగం మానివేస్తే తర్వాత పరిస్థితి ఏంటి అనే విషయాలను ఆలోచించుకోవాలి.
ఒకవేళ ఉద్యోగం మానివేస్తే నెల నెల ఆదాయం ఎలా వస్తుంది? ఇతర మార్గాల ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంటే అప్పుడు ఉద్యోగం మానివేసిన నష్టం ఉండదు. లేదా కుటుంబ సభ్యుల్లో ఇతరులు కూడా సంపాదిస్తున్నారు అంటే జాబ్ లేకపోయినా పర్వాలేదు. అలా కాకుండా జాబ్ మాత్రమే ఆధారమని అనుకునేవారు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం మాని వేద్దామన్న ఆలోచన కూడా రానీయకుండా ఉండాలి.
చాలామంది కొత్త ఉద్యోగంలోకి చేరాగానే వివిధ వస్తువులు, స్థలాలు కొనుగోలు చేసి ఈఎంఐ లను ఏర్పాటు చేసుకుంటారు. ఇలాంటివారు ఉద్యోగం మానేస్తే ఆ ఈఎంఐ లను ఎవరు చెల్లించాలి? అనేది ఆలోచించుకోవాలి. ఈఎంఐలు చెల్లించడానికి ఇతర మార్గాలు ఉంటే అప్పుడు జాబ్ మానివేసిన పర్వాలేదు. అలా లేకపోతే మాత్రం ఈఎంఐ భారం కచ్చితంగా ఎక్కువ అవుతుంది.
జాబ్ మానివేసిన తర్వాత కుటుంబం పోషణ ఎలాగో ముందే ఆలోచించుకోవాలి. ఎందుకంటే కుటుంబ పోషణ కోసం స్నేహితులు గాని.. ఇతర బంధువులు గాని డబ్బు ఇచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ ఇప్పటికే ఏడాది పాటు కుటుంబ పోషణకు సరిపడా డబ్బు ఉందంటే అప్పుడు ఇతర ప్రయత్నాలు చేయవచ్చు. అలా లేకపోతే మాత్రం ఉద్యోగం వదలడం అంతా మంచిది కాదు.
ఒక జాబ్ సంపాదించుకోవడం ఎంత కష్టమో.. దానిని వదిలించుకోవడం క్షణాల్లో పని. కానీ ఒకసారి జాబ్ వదిలేసిన తర్వాత అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సమాజంలో ఉద్యోగం చేయని వ్యక్తిని చిన్న చూపు చూస్తుంటారు. చివరికి కుటుంబ సభ్యుల నుంచి కూడా ప్రతికూల వాతావరణం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల జాబ్ మానేయాలని అనుకునేవారు తస్మాత్ జాగ్రత్త..