
Quiet Hiring In IT: మిగతా ఉద్యోగాలతో పోలిస్తే ఐటీలో వినూత్నత ఉంటుంది. జీతాలు దండిగా ఉంటాయి. అదే స్థాయిలో ప్రమోషన్లు, బోనస్‌లు, డిమోషన్లు ఉంటాయి. స్థూలంగా చెప్పాలంటే ఐటీ ఉద్యోగం అనేది పాలపొంగు లాంటిది. ఇక ఇప్పుడు ఐటీ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. 2008 లో మహా మాంద్యం తాలుకుకు మించిన పరిస్థితులను చవి చూస్తోంది. అమెజాన్, గూగుల్, ఫేస్ బుక్, అడోబ్, ట్విట్టర్, ఆపిల్.. ఎంత తోపు తురుం సంస్థలయితేనేం ఉద్యోగులను ఎహే పోండి అంటూ బయటకు పంపాయి. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం రెండు లక్షల మంది దాకా ఉద్యోగాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.
కొత్త విధానాలపై..
కోవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత ఐటీ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటం, యూరో జోన్‌లో ఆర్థిక కష్టాల వల్ల ఐటీ ఒక్కసారిగా నేల చూపులు చూస్తోంది. ఫలితంగా గ్రేట్ రెసిగ్నేషన్, క్వైట్ క్విట్టింగ్, మూన్ లైటింగ్, రేజ్ అప్లయింగ్ తాజాగా క్వైట్ హైరింగ్.. ఇలా ఐటీ సమూల మార్పులకు లోనయింది. ప్రస్తుతం చాలా కంపెనీలు క్వైట్ హైరింగ్ వైపు మళ్లుతున్నాయి. దీనివల్ల ఐటీ కంపెనీలపై ఒత్తిడి తగ్గుతోంది. ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతున్నాయి.

ఏమిటీ క్వైట్ హైరింగ్?
అవసరాలు ఎలా ఉంటాయో తెలియదు? ముఖ్యంగా ఐటీ కంపెనీల అవసరాలు ఒక పట్టాన అంతు పట్టవు. ఆ అవసరాలకు తగ్గట్టుగా మానవ వనరులను ఉపయోగించుకోవడమే క్వైట్ హైరింగ్ ముఖ్య ఉద్దేశ్యం. అంటే ఉదాహరణకు ఓ ఐటీ కంపెనీకి డాటా బేస్‌లో ఉద్యోగుల అవసరం పడింది. అప్పటికప్పుడు తీసుకునే పరిస్థితి లేదు. ఈక్రమంలో మరో విభాగంలో ఉన్న ఉద్యోగులతో ఆ స్థానాలు భర్తీ చేస్తుంది. ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తుంది. అక్కడ ఏర్పడిన ఖాళీలను మరో ఉద్యోగులతో భర్తీ చేస్తుంది. అంటే ఎప్పటికయ్యేది ప్రస్తుతమో అనే సామెతను ఇప్పుడు ఐటీ కంపెనీలు పాటిస్తున్నాయి. అంతే కాదు కొత్త లక్ష్యాలను సాధించే క్రమంలో ఉద్యోగులకు ఆశించినంత వేతనాలు ఇస్తున్నాయి. మరోవైపు బోనస్‌లు కూడా ప్రకటిస్తున్నాయి.