Pink vs White: సీజనల్‌గా లభించే జామ పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యానికి మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడతాయి. విటమిన్ సి ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మం, జుట్టు, రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. డైలీ జామ పండ్లను తినడం వల్ల మలబద్ధకం, జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి విముక్తి పొందుతారు. అలాగే కళ్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఏ కాలంలో వీటిని తిన్నా కూడా శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలే కానీ నష్టాలు లేవు. అందుకే వైద్యులు కూడా రోజుకి కనీసం ఒక జామ అయిన తినాలని అంటారు. అయితే జామలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి వైట్ ఉంటే మరొకటి పింక్ రంగులో ఉంటుంది. అసలు వైట్, పింక్ జామకి తేడా ఏంటి? రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? ఎక్కువ ప్రయోజనాలను ఏది ఇస్తుందనే విషయాలను ఈ రోజు స్టోరీలో తెలుసుకుందాం.
మిగతా పండ్లతో పోలిస్తే జామ చాలా తక్కువ రేటుకే లభిస్తుంది. అయితే పింక్ లేదా వైట్ జామ రెండు కూడా ఆరోగ్యానికి మంచివే. పింక్ జామలో ఉండే లైకోపీన్ వల్ల పింక్ కలర్ వస్తుంది. ఈ పింక్ జామలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తాయి. పింక్ జామలో ఎక్కువగా తీపి ఉంటుంది. వీటిని ఎక్కువగా జ్యూస్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇందులో సహజమైన చక్కెర వల్ల జ్యూస్‌లకు బాగుంటుందని వాడుతారు. అయితే మధుమేహం ఉన్నవారు ఈ పింక్ జామను తినకపోవడం ఆరోగ్యానికి మంచిది. ఒకవేళ తింటే తీపి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
తెల్ల జామకాయలో కూడా ఇలానే పోషకాలు ఉంటాయి. అయితే పింక్ జామలో ఉన్నంత తీపి తెల్ల జామకాయల్లో ఉండదు. వీటిలో కొంచెం ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మం మెరిసేలా చేస్తుంది. తెల్ల జామ తక్కువ తీపిని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ జామను మధుమేహం ఉన్నవారు ఈజీగా తినవచ్చు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం ఏం ఉండదని నిపుణులు చెబుతున్నారు. పింక్, తెల్ల జామ రెండింటిలో కూడా డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మలబద్ధకం, కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలను క్లియర్ చేస్తుంది. అలాగే బరువును తగ్గించడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.