Palaj Ganesh Temple: గణేశ్ ఉత్సవాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా నిర్వహిస్తారు. ఆది దేవుడిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా కొలుస్తారు. నిమజ్జనం కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. కొంతమంది ఐదు రోజులకే నిమజ్జనం చేస్తారు. కొందరు తొమ్మిది రోజులకు.. మరికొన్ని ప్రాంతాల్లో నెలంతా నిమజ్జనం కొనసాగుతుంది. ఇన్ని ప్రత్యేకతలు.. ఇన్ని వైవిధ్యాలు ఉన్న వినాయక చవితిని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో భిన్నంగా జరుకుంటారు. ఇక్కడ నవరాత్రులు పూజలు జరుగుతాయి. కానీ నిమజ్జనం మాత్రం ఉండదు. సాధారణంగా వినాయక ఉత్సవాల ముగింపు సందర్భంగా గణేశ్ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తుంటారు. కానీ తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో కొలువుదీరిన కర్ర గణపతి మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఉత్సవాలలో భాగంగా పదకొండు రోజుల విశేష పూజల తర్వాత ఈ లంబోదరుణ్ణి ఊరేగించి ఒక ప్రత్యేక గదిలో భద్రంగా ఉంచడం ఇక్కడ ఆనవాయితీ.
పర్యావరణ హితంగా..
గణపతి నవరాత్రుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయనిక రంగులు లేకుండా, కనీసం మట్టితోనూ సంబంధం లేకుండా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని గ్రామాల్లో కర్ర వినాయకులు కొలువుదీరుతారు. ఇది నిన్నమొన్నటి నుంచి కాదు.. ఏడు దశాబ్దాలుగా కొలుస్తున్నారు. 11 రోజుల పూజల తర్వాత కర్ర గణనాథులను తిరిగి గదిలో భద్రపరుస్తారు.
కొరువు కారణంగా..
స్వతంత్య్ర ఉద్యమకాలంలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు మహారాష్ట్రలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. ఆ మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో స్వాతంత్య్రానికి పూర్వమే కలరా, ప్లేగు వ్యాధులు ప్రబలడంతో పాటు కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలకు తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి సందర్భంలో గణేశ్ నవరాత్రులు వచ్చాయి. అప్పుడు అక్కడి ప్రజలు నిమజ్జనం చేసే పరిస్థితులు లేనందున నీటితో అవసరం లేకుండా ఉండేలా కర్రతో గణపతిని చేయించాలని నిశ్చయించారు.
కర్ర గణపతితో కరువు మాయం..
తెలంగాణ సరిహద్దు పక్కనే మహారాష్ట్రలోని భోకర్ తాలూకాలో గల పాలజ్ అనే గ్రామస్తులు 1948లో నిర్మల్‌లో కొయ్యబొమ్మలు చేసే నకాశీ కళాకారుడైన గుండాజీవర్మను కలిశారు. ఆయన నిష్టతో ఒకే కర్రతో, సహజసిద్ధమైన రంగులతో అందంగా గణపతిని తయారుచేసి ఇచ్చారు. ఆ ఊరంతటికీ ఆ కర్రగణపతినే ప్రతిష్టించడంతో కొంతకాలానికే కరువుకాటకాలు, వ్యాధులు దూరమయ్యాయి. కర్ర గణపతి రాకతోనే తమ ఊరు మారిందని నమ్ముతూ ఉటా అదు కర్ర వినాయకుడిని ప్రతిష్టించి పూజిస్తున్నారు. నవరాత్రులు ముగియగానే కాసిన్ని నీళ్లు భద్రపరుస్తున్నారు.