Henna Cultivation: దేశంలో రోజురోజుకు గోరింటాకు వినియోగం పెరుగుతోంది. సౌత్ ఇండియాలో ఎక్కువగా సాగు చేసే పంటలలో గోరింటాకు కూడా ఒకటి. తక్కువ వర్షపాతం పడే ప్రాంతాలలో పండే పంటలలో గోరింటాకు ఒకటి కాగా ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోవడం ఈ పంట ప్రత్యేకత అని చెప్పవచ్చు. మొక్కలు నాటడం లేదా విత్తనాల ద్వారా ఈ పంటను పండించవచ్చు. రెండో సంవత్సరం నుంచి ఈ పంట ఆకులు కోతకు వస్తాయి.

గోరింటాకు ఎత్తు 2 మీటర్ల నుంచి 4 మీటర్ల వరకు ఉండగా ఈ మొక్కల యొక్క లైఫ్ టైమ్ 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు కావడం గమనార్హం. హర్యానా, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలలో గోరింటాకు సాగు ఎక్కువగా జరుగుతుంది. ఫర్ ఫ్యూమ్స్ , లేపనాలను తయారు చేయడానికి గోరింటాకును ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. కాస్మోటిక్ రంగంలో గోరింటాకును ఎక్కువగా వినియోగిస్తారు.
చర్మవ్యాధులను నివారించడంలో, రక్తస్రావాన్ని అరికట్టడంలో గోరింటాకు ఉపయోగపడుతుంది. సిద్ధ, ఆయుర్వేదం మందులు, అయింట్‌మెంట్స్ తయారీలో గోరింటాకును ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. పండుగలు, శుభకార్యాల సమయంలో మహిళలు గోరింటాకును ఎక్కువగా వినియోగిస్తారు. గోరింటాకును కొంతమంది హెయిర్ కండీషనర్ గా కూడా వినియోగిస్తారు.
జులై, ఆగష్టు మాసాలు గోరింటాకు సాగుకు అనుకూలమని చెప్పవచ్చు. గోరుచిక్కుడు, పెసర, మినుము పంటలను అంతర పంటలుగా సాగు చేసే అవకాశం ఉంటుంది. ఎకరానికి 1200 కేజీల నుంచి 1500 కేజీల వరకు పంట దిగుబడి వస్తుండగా ఈ పంటా లాభదాయకమని వ్యవసాయ శాఖ అధికారులు సైతం చెబుతున్నారు.