Vinayaka Chavithi 2023: చవితి రోజు కృష్ణుడు ఇబ్బంది పడ్డాడు.. ఇంతకీ ఈ కథ ఏమిటో తెలుసా

అపరియుగంలో ఒకనాడు శ్రీకృష్ణుడిని చూడడానికి నారదుడు వస్తాడు. ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకుంటారు. వినాయక చతుర్థి కావడంతో చంద్రుడిని చూడరాదు కనుక నేను వెళ్ళిపోతానని కృష్ణుడితో నారదుడు అంటాడు.

Written By: Bhaskar, Updated On : September 18, 2023 5:19 pm

Vinayaka Chavithi 2023

Follow us on

Vinayaka Chavithi 2023: ఒకరోజు ధర్మరాజును శౌనకాది మహామునులందరూ కలిసి, సూతుడి దగ్గరకు వెళ్లి సత్సంగ కాలక్షేపం చేయాలని భావించారు. అప్పుడు సూతుడు మిగతా మునులతో “నేను ఈరోజు మీకు వినాయకుడి పుట్టుక, చవితి రోజున చంద్రుడిని దర్శిస్తే కలిగే దోషం, దాని నివారణ ఉపాయాలు వివరిస్తాను” అని చెప్పడం మొదలుపెట్టాడు.

పూర్వకాలంలో ఏనుగు రూపం గల గజాసురుడు అనే రాక్షసుడు పరమశివుడి గురించి ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని తపస్సుకు నచ్చిన శివుడు “గజాసురా.. నీకేం వరం కావాలో కోరుకో” అని అడిగాడు. అప్పుడు గజాసురుడు శివుడిని అనేక విధాలుగా స్తుతించి ” స్వామీ.. లోకాలన్నింటిలోనూ పూజలు అందుకునే మీరు ఇకపై నా ఉదరంలో నివాసం ఉండాలి” అని అడిగాడు. భక్తుల కోరికలను ఎన్నడూ జవదాటని శంకరుడు వెంటనే గజాసురుడి ఉదరంలో ప్రవేశించి అక్కడే నివాసం ఉన్నాడు.

కైలాసంలో పార్వతి దేవి తన భర్త ఎటు వెళ్ళాడో తెలియక అనేక చోట్ల వెతికి, ఎక్కడా కనిపించక నిరాశ చెందింది. కొంతకాలానికి తన పతి గజాసురుడు అనే రాక్షసుడి ఉదరం లో ఉన్నాడని తెలుసుకుంది. శంకరుడుని తిరిగి తీసుకువచ్చే మార్గం తెలియక బాధపడుతూ చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి జరిగినదంతా చెప్పి ” ఓ మహానుభావా పూర్వం భస్మాసురుడి బారి నుంచి నా భర్తను రక్షించావు. ఇప్పుడు కూడా అలాగే తగు ఉపాయంతో రక్షించమని” అడిగింది. అప్పుడు శ్రీహరి పార్వతి అనునయించి నేను ఉన్నాను అని అభయమించాడు. బ్రహ్మాది దేవతలను విష్ణువు పిలిపించాడు.. గజాసురుడి ఉదరం లో బంధి అయిన పరమేశ్వరుడు ఎలా బయటకు తీసుకురావాలో చర్చించాడు. చివరికి దీనికి గంగిరెద్దుల మేలమే సరైనదని ఆలోచనకు వచ్చాడు. శివుడి వాహనమైన నందిని గంగిరెద్దుగా అలంకరించాడు. దేవతలు మొత్తం తలా ఒక వాయిద్యం చేత బూనారు. విష్ణువు చిరుగంటలు, సన్నాయి పట్టుకొని మేళగాని వేషం కట్టుకున్నాడు.

దేవతలు గంగిరెద్దు మేళంతో గజాసురుడి రాజ్యంలోకి ప్రవేశించారు. నగరంలో పలుచోట్ల జగన్మోహనంగా గంగిరెద్దును ఆడించారు. ఆ నోటా ఈ నోటా వీరి ఆటా పాటా సంగతి గజాసురుడికి తెలిసింది. వారిని పిలిపించి తమ భవనం ఎదుట మేళం పెట్టమన్నాడు గజాసురుడు. దేవతలు వాయిద్యాలను విశేషంగా వాయిస్తూ వీనుల విందు చేశారు. శ్రీహరి గంగిరెద్దుల చిత్రచిత్రంగా ఆడిస్తూ గజాసురుడికి కన్నుల పండువ చేశాడు. వారి ప్రదర్శనకు పరమానందబరితుడయ్యాడు గజాసురుడు. ” మీకేం కావాలో కోరుకోండి” అని అడిగాడు. అప్పుడు శ్రీహరి గజాసురుడిని సమీపించి ” ఓ రాజా! ఇది శివుడి వాహనమైన నంది. శివుడిని కనుగొనడానికి వచ్చింది. కనుక పరమ శివుడిని తిరిగి ఇవ్వమ”ని అన్నాడు. ఆ మాటలకు ఉలిక్కిపడ్డాడు గజాసురుడు. ఆ మాట అన్నది శ్రీహరి అని గుర్తించి తనకు ఇక మరణం తప్పదు అనుకున్నాడు..” నా శిరస్సు కు త్రిలోకాలలో పూజలు జరగాలి. నా చర్మాన్ని నీవు ధరించాలి” అని తన ఉదరంలో ఉన్న శివుడిని ప్రార్థించాడు గజాసురుడు. శంకరుడు సరే అని వరం ఇచ్చాడు. వెంటనే శ్రీహరి అనుమతితో నంది తన కొమ్ములతో గజాసురుడి పొట్టను చీల్చి సంహరించాడు. శివుడు ఆ అసురుడి ఉదరం నుంచి బయటికి వచ్చి విష్ణుమూర్తిని స్తుతించాడు.. దుష్టులకు ఇలాంటి వరాలు ఇవ్వకూడదని శ్రీహరి బ్రహ్మాది దేవతలతో చెప్పాడు. శివుడు నందిని ఎక్కి కైలాసానికి వెళ్ళాడు..ఇతర దేవతలు స్వస్థలాలకు వెళ్లిపోయారు.

అపరియుగంలో ఒకనాడు శ్రీకృష్ణుడిని చూడడానికి నారదుడు వస్తాడు. ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకుంటారు. వినాయక చతుర్థి కావడంతో చంద్రుడిని చూడరాదు కనుక నేను వెళ్ళిపోతానని కృష్ణుడితో నారదుడు అంటాడు. విషయం తెలుసుకున్న కృష్ణుడు ఈరోజు చంద్రుడిని చూడకూడదని రాజ్యంలో చాటింపు వేయిస్తాడు. కాసేపయిన తర్వాత కృష్ణుడు గోషాలకు వెళ్లి పాలు పిండితో పాలలో చంద్రుడి ప్రతిబింబం చూసి ఆహా నాకు ఎలాంటి ఆపద వస్తుందో కదా అని చింతించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత యదు వంశరాజు సత్రాజిత్తు సూర్యుడిని ఉపాసించి శమంతకం అని పేరుగల అద్భుత మణిని సంపాదిస్తాడు. ద్వారకానగరంలో శ్రీకృష్ణుడిని సందర్శిస్తాడు. శ్రీకృష్ణుడు అతడిని సాదరంగా ఆహ్వానించి మర్యాద చేస్తాడు. ఈ మణిని మన రాజుకు ఇమ్మని అడుగుతాడు. రోజుకు ఎనిమిది బారువుల బంగారం ఇచ్చే ఈ మణిని ఎవరికీ ఇవ్వను అని తిరస్కరిస్తాడు సత్రాజిత్తు. సరే నీ ఇష్టం అంటూ ఊరుకుంటాడు కృష్ణుడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్తాడు. అక్కడ ఒక సింహం అతనిపై దాడి చేసి మణిని నోట కరుచుకుని వెళ్తుంది. మణితో వెళ్ళిపోతున్న సింహాన్ని ఎలుగుబంటి సంహరించి దానిని తీసుకొని కూతురైన జాంబవతికి ఆట వస్తువుగా ఇస్తుంది.

మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మరణ వార్త విని కోపంతో ఆరోజు శ్రీకృష్ణుడికి మణి ఇవ్వలేదని నా తమ్ముడిని చంపి దానిని తస్కరించాడని నగరం అంతా చాటింపు వేస్తాడు. దానికి శ్రీకృష్ణుడు బాధపడి అయ్యో ఆరోజు పాలలో చంద్రుడిని చూసినందుకే కదా ఇటువంటి నిందలు అని అనుకుంటాడు. వాటిని తొలగించుకునేందుకు బంధు సమేతుడై అడవికి వెళ్లి అంతటా వెతుకుతాడు. ఒకచోట ప్రసేనుడి మృతదేహం, కొంత దూరం వెళ్లిన తర్వాత ఎలుగుబంటి పాదముద్రలు కనిపిస్తాయి. వాటి వెంట కొంత దూరం నడిచిన తర్వాత ఒక గుహ కనిపిస్తుంది. అందులోకి కృష్ణుడు ఒక్కడే వెళ్తాడు..మణి తో కుంటున్న జాంబవతిని చూస్తాడు. ఆమె కేకలు వేయడంతో జాంబవంతుడు అక్కడికి వస్తాడు. ఇద్దరి మధ్య 28 రోజుల పాటు యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత జాంబవంతుడు వచ్చింది శ్రీకృష్ణుడు కాదు రాముడు అని తెలుసుకొని పాదాల మీద పడతాడు. దీంతో జరిగింది మొత్తం శ్రీకృష్ణుడు చెప్పి మణి ఇవ్వమని కోరుతాడు. అయితే దానితో పాటు తన కూతురు జాంబవంతిని కూడా తీసుకెళ్లాలని కోరుతాడు. తర్వాత మణిని సత్రాజిత్తు కు ఇవ్వడంతో.. తనను క్షమించమని శ్రీకృష్ణుడిని కోరతాడు. తన కూతురు సత్యభామను భార్య స్వీకరించమని అడుగుతాడు. అలా జాంబవతి, సత్యభామతో ఒక శుభముహూర్తాన శ్రీకృష్ణుడు వివాహం జరుగుతుంది. ఈ వివాహానికి వచ్చిన దేవతలు శ్రీకృష్ణుడిని స్తుతించి మీరు సమర్థులు కనుక మీ మీద వచ్చిన అపనిందను పోగొట్టుకున్నారు. మాలాంటి వారి పరిస్థితి ఏమిటి అని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు యధావిధిగా వినాయకుడిని పూజించి ఈ శమంతక మణి కథను చదివి అక్షితలు తమపై చదువుకుంటారో వారికి చంద్రుడిని చూసినా ఎటువంటి నిందలు కలగమని అభయమిచ్చాడు. ఇది శ్రీ స్కంద పురాణంలో భాగమైన ఉమామహేశ్వర సంవాదంలోని వినాయక వ్రతకల్పం.