Nimeesha Priya tearful story: దృశ్యం సినిమా చూశారా.. అందులో వెంకటేష్ పెద్ద కూతురిపై ఆమె స్నేహితుడు అఘాయిత్యానికి యత్నిస్తుంటాడు. మీనా అతడి తలపై బలంగా కొడుతుంది. దీంతో అతడు చనిపోతాడు. అతని మృతదేహాన్ని వెంకటేష్ అత్యంత తెలివిగా దాస్తాడు. పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడుతుంటాడు. ఆ చనిపోయిన యువకుడు తల్లి ఒక పోలీస్ ఆఫీసర్. తన కొడుకు చేసింది తప్పు అయినప్పటికీ వెనకేసుకొస్తుంది. చివరికి వెంకటేష్ కుటుంబానికి శిక్ష పడాలని కోర్టు మెట్ల దాకా వెళుతుంది. అయితే ఆ కేసును అత్యంత చాకచక్యంగా వెంకటేష్ తప్పిస్తాడు.
యెమెన్ దేశంలో భారతీయ నర్స్ నిమిష ప్రియ కేసు కూడా దాదాపు దృశ్యం సినిమాలాంటిదే. తన అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడినప్పుడు.. తన ప్రాణాలకే ముప్పు ఎదురైనప్పుడు స్వీయ రక్షణకు పాల్పడింది. కాకపోతే ఆ విధానం కాస్త కటువుగా ఉంది. అది ఇప్పుడు ఆమె ప్రాణాలనే తీసే స్థాయికి వచ్చింది. ఫలితంగా ఆమె కోసం దేశవ్యాప్తంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ ప్రజలు ఆమె మరణశిక్ష నుంచి ధైర్యంగా బయటపడాలని ప్రార్థిస్తున్నారు.. వారి ప్రార్థనలు ఫలిస్తాయా? నిమిష ప్రియ స్వేచ్ఛగా బయటికి రాగలుగుతుందా? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది.
Also Read: వద్దన్నాపెళ్లి చేసుకున్నాడు.. భార్య చేసిన మోసం తట్టుకోలేక వీడియో తీసి..
స్వదేశంలో నర్సింగ్ కోర్స్ చదివిన నిమిష.. ఉన్నతమైన ఉపాధి కోసం యెమెన్ వెళ్ళింది. అక్కడ ఒక క్లినిక్ ఏర్పాటు చేసింది. ఆమెకు ఆ దేశానికి చెందిన తలాల్ అబ్దో మహది హాస్పిటల్ భాగస్వామిగా వ్యవహరించాడు. మొదట్లో మహది బాగానే ఉండేవాడు. క్రమక్రమంగా అతడి దిక్కుమాలిన బుద్ధిని ప్రదర్శించడం మొదలు పెట్టాడు. నిమిషను వేధించడంతో ఆమె తట్టుకోలేక అతడికి మత్తు ఇంజక్షన్ ఇచ్చింది. దీంతో అతడు చనిపోయాడు. ఈ క్రమంలోనే ఆమె చేసిన నేరం బయటకు వచ్చింది..యెమెన్ కోర్టు ఆమెకు ఉరిశిక్ష విధించింది.. నిమిషప్రియ తన ప్రాణాలను కాపాడుకోవడానికి.. తన భర్త, పిల్లలకు అన్యాయం చేయకుండా ఉండడానికి స్వీయ రక్షణకు పాల్పడింది.. వాస్తవానికి ఇది తప్పు కాకపోయినప్పటికీ.. యెమెన్ కోర్టు మాత్రం తప్పు పట్టింది. అంతేకాదు అక్కడి షరియా చట్టం ఆధారంగా ఆమెకు ఏకంగా మరణ శిక్ష విధించింది. ఒకవేళ ఇటువంటి ఘటనలు మన దగ్గర చోటు చేసుకుంటే రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే మరణశిక్ష విధించకుండా చూస్తారు. కానీ యెమెన్ దేశంలో అలా కాదు. అక్కడ మరణ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే బాధిత కుటుంబానికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని క్షమా ధనం అని పిలుస్తుంటారు. క్షమాధనం ఇవ్వడానికి నిమిష ప్రియ కుటుంబం ఒప్పుకుంది. ఈ ప్రక్రియను పరిశీలించడానికి నిమిషప్రియ తల్లి గత ఏడాది యెమెన్ వెళ్ళింది.
నిమిషప్రియకు భర్త, పిల్లలు ఉన్నారు. ఆమె జైలుకు వెళ్లిన నాటి నుంచి ఇప్పటివరకు వారు క్షణం క్షణం ఒక యుగం లాగా గడుపుతున్నారు. ఇటీవల ఆమెను ఉరితీస్తారని వార్తలు వచ్చిన రోజు వారు పడిన వేదన మాటలకు అందనిది.. నిమిషప్రియను కాపాడేందుకు ఏకంగా సేవ్ యాక్షన్ నిమిషప్రియ కౌన్సిల్ అనే పేరుతో ఒక సంస్థ ఏర్పాటయిందంటే.. ఆమె ప్రాణాల కోసం కుటుంబ సభ్యులు ఎంతగా తాపత్ర పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.. ఆ ప్రయత్నం వల్ల నిమిషప్రియ కు చేయాల్సిన ఉరి ప్రస్తుతం వాయిదా పడింది. అయితే నిమిషం ప్రియ కుటుంబం ఇచ్చే క్షమాదనానికి మహది తరఫున వారు అంగీకరించడం లేదు. పైగా ఆమెకు ఉరిశిక్ష పడాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
Also Read: మహమ్మద్ షమీ కూతురు పుట్టిన రోజు.. ఏ తండ్రికీ ఇలాంటి కష్టం రావద్దు
షరియా చట్టాల ప్రకారం క్షమాధనం తీసుకొని.. బాధిత కుటుంబ సభ్యులు ఒప్పుకుంటేనే ఉరిశిక్ష తప్పుతుంది. మరోవైపు యెమెన్ లో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఆమెను జైలుకు పంపించిన వాటి నుంచి అక్కడ రాజకీయ పరిస్థితులు ఏమాత్రం బాగోలేదు. దీంతో 2017 నుంచి భారతదేశం తన రాయబార కార్యాలయాన్ని అక్కడి నుంచి తరలించి ఉత్తర ఆఫ్రికాలోని జీబౌటి లో కొనసాగిస్తోంది.. ఇదే క్రమంలో భారత విదేశాంగ శాఖ నిమిషప్రియ ప్రాణాలను కాపాడేందుకు గ్రాండ్ ముఫ్తీ సహాయాన్ని కోరింది. యెమెన్ సూఫీ ఇస్లామిక్ పండితుడు షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్, ఆల్ ఇండియా సున్ని జిమియాతుల్ ఉలమా ఇప్పటిదాకా కార్యదర్శి, జామియా మర్కజ్ ఛాన్స్ లర్ ఉస్తాద్ కాంతాపురం ఏపీ అబు బాకర్ ముస్లియార్ జోక్యం చేసుకోన్న నేపథ్యంలో నిమిషకు ఉరిశిక్ష పడదని వార్తలు వినిపిస్తున్నాయి. వారంతా కూడా క్రియాశీల ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కేరళ మొత్తం నిమిషప్రియ కోసం ప్రార్థనలు చేస్తోంది..
పగలు, ప్రతీకారాలు, మరణ దండనలు మనుషుల మనుగడని ప్రభావితం చేస్తాయని.. కేవలం క్షమాగుణం మాత్రమే కలకాలం నిలిచి ఉంటుందని కాంతాపురం ఉస్తాద్ యెమెన్ ప్రభుత్వ పెద్దలతో వ్యాఖ్యానిచ్చినట్టు తెలుస్తోంది. ఆయన వ్యాఖ్యలతో యెమెన్ ప్రభుత్వ పెద్దలు ఏకీభవించినట్టు కూడా సమాచారం. మరి ఇన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో యెమెన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? బాధిత కుటుంబాన్ని ఎలా ఒప్పిస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.