https://oktelugu.com/

Adani Group: అదానీ కోసం ఐటీని దించి మరో కంపెనీ అప్పగించిన మోడీ సర్కార్?

అదానీ గ్రూప్‌ సంఘీ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌లో 40-70 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు కోల్‌ కతా కేంద్రంగా పని చేస్తున్న శ్రీ సిమెంట్స్‌ అనే సంస్థ తీవ్ర ప్రయత్నాలు చేసింది.

Written By:
  • Rocky
  • , Updated On : August 9, 2023 / 07:59 AM IST

    Adani Group

    Follow us on

    Adani Group: వడ్డించే వాడు మనవాడయితే బంతిలో ఏ మూల కూర్చున్న సింహ భాగం దక్కుతుంది. అదే అధికారంలో ఉన్నది మనవాడయితే ఏ ఆట ఆడినా, మరే పాట పాడినా చెల్లుబాటవుతుంది. ఆ మధ్య హిండెన్‌ బర్గ్‌ అనే సంస్థ పలు కీలక ఫైల్స్‌ బయట పెట్టడంతో అదానీ కంపెనీ ఉక్కపోతకు గురయింది. దాని షేర్‌ వాల్యూ ఆమాంతం పడిపోయింది. అది ఏకంగా దేశ పార్లమెంట్‌ను స్తంభింపజేసింది. కొద్ది నెలల వరకూ అదానీ గ్రూప్‌ కోలుకోలేదని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా అదానీ గ్రూప్‌ చేసిన ఓ పని మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది. జాతీయ స్థాయి మీడియాలో మరోసారి బ్రేకింగ్‌ న్యూస్‌ అయింది.

    హిండెన్‌బర్గ్‌ ఆరోపణలతో అదానీ గ్రూప్‌ అతలాకుతలమైంది. అయితే అటువంటి కంపెనీ తొలిసారిగా టేక్‌ ఓవర్‌కు సిద్ధమైంది. గుజరాత్‌ లో సిమెంట్‌ ప్లాంట్‌ ను నడుపుతున్న సంఘీ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌కు చెందిన సంఘీ సిమెంట్‌లోని మెజార్టీ వాటా కొనుగోలు చేస్తున్నట్టు అదానీ గ్రూప్‌ ఇటీవల ప్రకటించింది. దీని కోసం సంఘీ ఇండస్ట్రీస్‌ ఎంటర్‌ప్రైజ్‌ విలువను రూ. 5000 కోట్లుగా లెక్కించినట్టు సమాచారం. అయితే ఈ డీల్‌ వెనుక పెద్ద తతంగం నడిచినట్టు విపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. టేక్‌ ఓవర్‌ ప్రక్రియలో ఓ పోటీ సంస్థను బెదిరింపులకు గురి చేసి ఈ డీల్‌ను పూర్తి కానిచ్చారని తెలుస్తోంది. ఇందుకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగించారనే ఆరోపణలు ఉన్నాయి.

    అదానీ గ్రూప్‌ సంఘీ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌లో 40-70 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు కోల్‌ కతా కేంద్రంగా పని చేస్తున్న శ్రీ సిమెంట్స్‌ అనే సంస్థ తీవ్ర ప్రయత్నాలు చేసింది. దీనికోసం ఏప్రిల్‌ నెలలో బిడ్లు కూడా దాఖలు చేసింది. యితే, గత జూన్‌ నెలలో శ్రీ సిమెంట్‌కు చెందిన కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ పరిణామం తర్వాత సంఘీ సిమెంట్‌ కొనుగోలు నుంచి తాము తప్పుకుంటున్నట్టు శ్రీ సిమెంట్‌ జూలైలో ప్రకటించింది. “డాక్టర్‌ తినాలని చెప్పింది పెరుగన్నమే, రోగి తినాలనుకుంటున్నదీ పెరుగున్నమే” సామెత తీరుగా ఈ డీల్‌ను అదానీ గ్రూప్‌ మరో ఎదురు లేకుండా పూర్తి చేసింది. అయితే, అదానీ గ్రూప్‌ కేంద్ర దర్యాప్తు సంస్థల సాయంతో ఈ డీల్‌ పూర్తి చేసిందనే ఆరోపణలున్నాయి.

    గతంలో జరిగిన ఘటనలు పై ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయని విపక్ష పార్టీల నాయకులు చెబుతున్నారు. జీవీకే గ్రూప్‌ నిర్వహణలో ఉన్న ముంబై ఎయిర్‌ పోర్ట్‌ను కూడా చివరకు అదానీ గ్రూప్‌ కైవసం చేసుకుంది. ముంబై ఎయిర్‌ పోర్ట్‌లో జీవీకేకు 50.5 శాతం, దక్షిణాఫ్రికాకు చెందిన బిడ్‌ వెస్ట్‌ హుడ్‌ అనే కంపెనీకి 13.5 శాతం వాటా ఉంది. ఒకవేళ బిడ్‌ వెస్ట్‌ హుడ్‌ తన వాటాలను విక్రయించాలనుకుంటే తొలుత జీవీకేకు ఆఫర్‌ ఇవ్వాలి. ఈమేరకు ఆర్‌ వో ఎఫ్‌ ఆర్‌(రైట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ రిఫ్యూజల్‌) క్లాజ్‌ ను నిబంధనల్లో చేర్చారు. అయితే, అదానీ గ్రూప్‌ ఈ నిబంధనను తుంగలో తొక్కిందనే ఆరోపణలన్నాయి. 13.5 శాతం బిడ్‌ వెస్ట్‌ హుడ్‌ వాటాను చేజిక్కించుకున్నది. ఈనేపథ్యంలో జీవీకే గ్రూప్‌ కోర్టులో కేసు వేసింది. ఈక్రమంలో జరిగిన పరిణామం ఒక్కసారిగా అనూహ్యంగా మారింది. ముంబై ఎయిర్‌ పోర్ట్‌ అభివృద్ధిలో రూ. 705 కోట్ల అవకతవకలకు పాల్పడినట్టు 2020 జూన్‌లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఏం జరిగిందో తెలియదు గాని జీవీకే తన 50.5 శాతాన్ని అదానీ గ్రూప్‌నకు అప్పగించింది. దీంతో సీబీఐ యూ టర్న్‌ తీసుకున్నదని విపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. పైగా ఈ కేసులో ఎలాంటి అవకతవకలు గుర్తించలేదని కోర్టుకు సీబీఐ తెలపడం విశేషం. ఇక తమిళనాడులోని కరైకల్‌ పోర్ట్‌ విషయంలోనూ దాదాపుగా ఇదే జరిగిందని సమాచారం. చెన్నై కి చెందిన మార్గ్‌ లిమిటెడ్‌ అనే కంపెనీకి ఈ కరైకల్‌ పోర్ట్‌లో 45 శాతం వాటా ఉండేది. అయితే ఈ కంపెనీపై ఐటీ అధికారులు కేసులు నమోదు చేసి, సంస్థ ఎండీని 2017లో అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆ పోర్ట్‌ అదానీ గ్రూప్‌ వశమైంది.