Marriage checklist beyond Horoscope: ఇప్పటి కాలంలో పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. రెండు కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించే కీలక దశగా భావిస్తున్నారు. అందుకే జాతకాలు, కుటుంబ నేపథ్యం, ఉద్యోగం వంటి విషయాలతో పాటు ప్రీ-మారిటల్ మెడికల్ టెస్టులు చేయించుకోవడం కూడా ఎంతో అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. చిన్నపాటి పరీక్షలతో భవిష్యత్తులో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి నివారించవచ్చని సూచిస్తున్నారు. పెళ్లి చేసుకోబోయే జంటలు ఆరోగ్యంగా ఉన్నారని తెలిస్తే భవిష్యత్ లో ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. అంతేకాకుండా డయాబెటిక్, హై బీజీ వంటి గురించి ముందే తెలిస్తే వాటి గురించి జాగ్రత్త పడొచ్చని తెలుపుతున్నారు. అయితే పెళ్లికి ముందు ఎలాంటి టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలి?
బ్లడ్ గ్రూప్ టెస్ట్:
వరుడు, వధువు ఇద్దరి బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా Rh factor గురించి తెలుసుకోవాలి. ఇద్దరిలో ఒకరికి Rh negative ఉంటే గర్భధారణ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం అవుతాయి. లేకపోతే పుట్టబోయే శిశువుకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
హిమోగ్లోబిన్ టెస్ట్:
శరీరంలో రక్తహీనత ఉందో లేదో తెలుసుకోవడానికి హిమోగ్లోబిన్ పరీక్ష అవసరం. ముఖ్యంగా మహిళల్లో అనీమియా ఎక్కువగా కనిపిస్తుంది. గర్భధారణ సమయంలో ఇది తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
HIV:
HIV వంటి వైరల్ ఇన్ఫెక్షన్ ముందుగానే తెలుసుకుంటే సరైన చికిత్స, జాగ్రత్తలు తీసుకోవచ్చు. దంపతుల ఆరోగ్య రక్షణతో పాటు, పుట్టబోయే బిడ్డకు వైరస్ సోకకుండా నివారించవచ్చు.
హెపటైటిస్-B, హెపటైటిస్-C:
Hepatitis B, Hepatitis C వైరస్లు రక్తం ద్వారా వ్యాపిస్తాయి. ఇవి కాలేయంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. ముందుగానే గుర్తిస్తే వ్యాక్సిన్ లేదా చికిత్స ద్వారా నియంత్రణ సాధ్యమవుతుంది.
VDRL:
VDRL ద్వారా లైంగిక సంబంధాల ద్వారా వ్యాపించే వ్యాధులు గుర్తిస్తారు. ముఖ్యంగా సిఫిలిస్ వంటి ఇన్ఫెక్షన్లు ఉంటే ముందుగానే చికిత్స అవసరం.
రుబెల్లా :
Rubellaకు మహిళలకు రోగనిరోధక శక్తి ఉందో లేదో తెలుసుకోవడం ముఖ్యం. గర్భధారణకు ముందు రుబెల్లా రక్షణ లేకపోతే శిశువులో జన్యుపరమైన లోపాలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
వీటితో పాటు షుగర్ లెవెల్స్, థైరాయిడ్ పరీక్ష,,థలసీమియా స్క్రీనింగ్,,కిడ్నీ, లివర్ ఫంక్షన్ టెస్టులు,ఫెర్టిలిటీ చెకప్ చేయించుకోవాలి. ఈ పరీక్షలు చేయించుకోవడంతో భవిష్యత్తులో దంపతుల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. సంతానోత్పత్తిలో ఇబ్బందులు ముందుగానే తెలుస్తాయి. జన్యుపరమైన వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. చికిత్స అవసరమైతే ముందే ప్రారంభించవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల పట్టణాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రీ-మారిటల్ మెడికల్ చెకప్పై అవగాహన పెరుగుతోంది. పెళ్లి ముందు ఒకసారి వైద్యులను కలిసి పరీక్షలు చేయించుకోవడం కుటుంబ భవిష్యత్తుకు రక్షణగా మారుతోంది. జాతకంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పరిశీలిస్తే భవిష్యత్ లో దంపతుల జీవితం బాగుంటుందని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.