https://oktelugu.com/

Lord Ganesh : వినాయకుడికి ఎన్నో రూపాలు.. వీటి వెనుక పరమార్ధం ఏమిటో తెలుసా

భక్తుల సంకటాలు హరించే కరుణమూర్తి ఇతడు. సంతోషం ఆనందంతో జీవితాలలో సంతోషం, వెలుగును నింపే వాత్సల్య మూర్తి సంకటహర గణపతి.

Written By:
  • Rocky
  • , Updated On : September 18, 2023 / 10:32 PM IST

    ganesh1

    Follow us on

    Lord Ganesh : దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఎవరికివారు తమకు తోచిన విధానంలో గణపతిని పూజిస్తున్నారు. ఒకప్పుడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు డిమాండ్ భారీగా ఉండేది. అయితే క్రమేపి పర్యావరణం మీద స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో మట్టి విగ్రహాల తయారీ ఊపందుకుంది. ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా నిర్వాహకులు మట్టి విగ్రహాలనే ఎక్కువ సంఖ్యలో నెలకొల్పారు. వారి వారి సంప్రదాయాల ఆధారంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అయితే ఈ వినాయక చవితి సందర్భంగా పురాణ గాధలు వెలుగులోకి రావడం సహజం. మన పెద్దలు వాటిని కథలుగా చెప్పడం కూడా సహజమే. అయితే గజ ముఖ రూపుడైన గణపతి కి ఎన్ని రూపాలు ఉంటాయి? వాటి వెనుక ఉన్న ప్రాశస్త్యం ఏమిటో ఒకసారి ఈ కథనంలో తెలుసుకుందాం.

    బాల గణపతి

    అరుణ వర్ణంలో వెలుగొందుతుంటాడు. బుద్ధి, వివేకం, జ్ఞానం ప్రసాదిస్తూ ఉంటాడు. బాలగణపతి ఉపాసనతో పిల్లలకు ఉత్సాహం, చదువుపై ఆసక్తి పెరుగుతాయి.

    తరుణ గణపతి

    మధ్యాహ్నపు సూర్యుడి వర్ణం కలిగి ఉంటాడు. భక్తులకు కార్యోన్ముఖులు కాగల పట్టుదలను, దీక్షను ప్రసాదిస్తూ ఉంటాడు.

    భక్త గణపతి

    చంద్రుడి తెల్లని రూపంతో చల్లని వెన్నెలతో ప్రకాశిస్తూ ఉంటాడు. తనను కొలిచిన వారి హృదయంలో భక్తి ప్రపత్తులను ద్విగుణీకృతం చేస్తాడు. మానసిక ప్రశాంతతను కలగజేస్తాడు.

    వీర గణపతి

    కుంకుమ వర్ణంతో ప్రకాశిస్తుంటాడు. భక్తులకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. శత్రువులను ఎదిరించే శక్తిని ఇస్తాడు.

    శక్తి గణపతి

    సాయం సంధ్యలో సూర్యుడు ఉండే రంగులో కనిపిస్తాడు. భక్తులను సర్వశక్తి సంపన్నులుగా తీర్చి దిద్దుతాడు.

    ధ్వజ గణపతి

    చంద్రుడి తెల్లని వర్ణం కలిగి ఉంటాడు. మేథస్సును పెంచి విద్యాబుద్ధులు ప్రసాదిస్తాడు. విద్యార్థులు ఈ గణపతిని పూజిస్తే తెలివితేటలు వృద్ధి చెందుతాయి.

    సిద్ధి గణపతి

    బంగారు వర్ణంలో దర్శనమిస్తాడు. సకల కార్యాల్లోనూ విజయాన్ని అనుగ్రహిస్తాడు.

    ఉచ్చిష్ట గణపతి

    ఇది సర్వోన్నతమైన గణపతి రూపం గా పురాణాలు చెబుతున్నాయి. ఈ వినాయకుడు నలుపు వర్ణనలో దర్శనమిస్తాడు. ఈ రూపాన్ని అర్చించడం వల్ల ధన ధాన్య వృద్ధి, ఆరోగ్యం, సుఖశాంతులు వెల్లి విరుస్తాయి.

    విఘ్న గణపతి

    ఎనిమిది భుజాలతో దర్శనమిస్తాడు. త్రిమూర్తి స్వరూపుడు. విఘ్నాలను దాటిస్తాడు. భయంకరమైన ప్రమాదాలు, ఆటంకాలు ఎదురవకుండా విజయాలు ప్రసాదిస్తాడు.

    క్షిప్ర గణపతి

    ఈ రూపాన్ని బోళా వినాయకుడికి ప్రతిరూపమని పురాణాలు చెబుతుంటాయి. అతి శీఘ్రంగా స్పందించి భక్తకోటిని కరుణిస్తాడు. చాలాకాలంగా తీరని కోరికలను తీర్చి భక్తుల్లో సంతోషం కలిగిస్తాడు.

    హేరంబ గణపతి

    విలక్షణమైన మంత్రమూర్తి, పంచముఖుడై, నాలుగు తలలు నాలుగు దిక్కులను చూస్తుండగా.. వాటిపైన ఐదో తల కలిగి ఉంటాడు. తనను నమ్మిన వారిని కాపాడుతూ ఉంటాడు.

    లక్ష్మి గణపతి

    ఈ గణపతికి రెండు తొడల పైనా శ్రీదేవి, భూదేవి కూర్చుని ఉంటారు. ఈ గణపతి భక్తులకు ధన సంపద కలిగిస్తుంటాడు.

    శ్రీ మహాగణపతి

    సమగ్ర మూర్తి రూపమని పురాణాలు చెబుతుంటాయి. మనం చూసే రూపం ఈ మహాగణపతిదే. ఈ వినాయకుడిని ప్రార్థిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

    విజయ గణపతి

    కుంకుమ వర్ణంలో ప్రకాశిస్తుంటాడు. సర్వకార్యాల్లోనూ సాఫల్యతను ఇస్తుంటాడు.

    నృత్య గణపతి

    గణపతిని తాండవ గణపతి అని కూడా పిలుస్తుంటారు. పసి బాలుడు రూపంలో ఆనందతాండవం చేస్తుంటాడు. ఇతడు మోక్ష స్వరూపుడు. కొలిచిన వారికి సంతృప్తిని, మనశ్శాంతిని ఇస్తాడు.

    ఊర్ద్వ గణపతి

    పసుపు పచ్చని శరీర ఛాయ కలిగి ఉంటాడు. ఎడమ తొడ పై లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది. తనను నమ్ముకున్న భక్తులకు పాప విమోచనం కలిగిస్తాడు.

    ఏకాక్షర గణపతి

    ఏకాక్షర గణపతి భక్తుల చింత, శోకం, అజ్ఞానాన్ని పోగొడతాడు. ప్రశాంతతను, సంతోషాన్ని కలిగిస్తాడు..

    త్రయక్షర గణపతి

    విఘ్నాలు తొలగించి, సర్వసిద్ధిత్వం కలిగించి అజ్ఞాన విముక్తులను చేస్తాడు త్రయక్షర గణపతి.

    వర గణపతి

    సులభ ప్రసన్నుడు. కోరిన వరాలు మొత్తం తక్షణమే ప్రసాదిస్తాడు.

    క్షిప్ర ప్రసాద గణపతి

    గణపతి కీర్తి ప్రతిష్టలు, పదవులు, సత్కారాలు అందజేస్తాడు.

    హరిద్రా గణపతి

    పసుపు రంగులో దర్శనమిస్తాడు. వివాహాది శుభకార్యాల్లో ఈ గణపతిని పూజిస్తారు. ఈ దైవం విఘ్న నివారికుడు.

    సృష్టి గణపతి

    దైనందిన కార్యక్రమాలు, సృష్టి కార్యాలు నిరాటంకంగా జరిగేలా అనుగ్రహించే దేవుడు సృష్టి గణపతి.

    ఏకదంత గణపతి

    ఆసురీ ప్రవృత్తులను, భయాలను తొలగించే ఈ గణపతి ఏకదంతుడు. భక్తులకు సమయజ్ఞతను ఇస్తాడు. వ్యాసుడు భారతం చెబుతుండగా ఘంటం విరిగిపోతే, దంతాన్ని పెకిలించి, దానితో రాతను కొనసాగించాడు గణపతి. అలా ఏకదంతుడయ్యాడని పురాణం చెబుతుంటుంది.

    ఉద్దండ గణపతి

    దుష్టశక్తులను, శత్రువులను ఎదుర్కొనే సాహస సామర్ధ్యాలను అనుగ్రహిస్తాడు ఉద్దండ గణపతి.

    రుణ విమోచన గణపతి

    సకల రుణాల నుంచి విముక్తిని ప్రసాదిస్తాడు ఈ స్వామి.

    ద్విముఖ గణపతి

    రెండు ముఖాలు కుడి, ఎడమలకు తిరిగి ఉన్న ఈ గణపతి విశేషమైన సంపదలను ప్రసాదిస్తాడు.

    డుండి గణపతి

    కాశీ విశ్వనాథుడి సన్నిధిలో ఉండే ఈ ప్రమథ గణనాథుడు భక్తులకు శుభాలను, సౌఖ్యాలను అనుగ్రహిస్తాడు.

    త్రిముఖ గణపతి

    అకార, ఉకార, మకారాల స్వరూపంగా కుడి ఎడమలకు రెండు ముఖాలు. మధ్యన ముఖ్య శిరస్సుతో త్రిముఖ గణపతి కనిపిస్తాడు. కరుణ, జాలితో దీనులను, నిస్సహాయులను కరుణిస్తూ ఉంటాడు.

    సింహ గణపతి

    భక్తులను ధైర్యవంతులుగా చేసి, ఆత్మవిశ్వాసంతో వారిని ముందుకు నడిపిస్తాడు సింహ గణ పతి.

    దుర్గ గణపతి

    సకల పాపాలను దూరం చేసి, ఉపాసకులను ఈ దుర్గ గణపతి కంటికి రెప్పలా కాపాడుతాడు.

    యోగ గణపతి

    ఈ గణపతి యోగమూర్తి. మూలధార స్థితుడైన జప,తప,ద్యాన తత్పరుడు. బ్రహ్మజ్ఞానానికి యోగ గణపతి ప్రతీక. ఆయురారోగ్య ప్రదాత.

    సంకటహర గణపతి

    భక్తుల సంకటాలు హరించే కరుణమూర్తి ఇతడు. సంతోషం ఆనందంతో జీవితాలలో సంతోషం, వెలుగును నింపే వాత్సల్య మూర్తి సంకటహర గణపతి.