
IND vs AUS KS Bharath : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ ఆరంగేట్రం చేశాడు.. నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బ్యాటింగ్లో భరత్ విఫలమయ్యాడు. అయితే తొలి ఇన్నింగ్స్ కదా కొంచెం ఒత్తిడికి గురై ఉంటాడని అందరూ అనుకున్నారు. అదృష్టం కొద్దీ ఆ టెస్ట్ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలిచింది. తర్వాత రెండవ టెస్టు ఢిల్లీలో నిన్న ప్రారంభమైంది. తొలి రోజు ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆలౌట్ అయింది.. భారత్ అక్షర్ పటేల్, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా పుణ్యమా అని 262 పరుగులు చేసింది. అయితే రెండవ టెస్టులో భరత్ రాణిస్తాడని అందరూ ఆశించారు. కానీ అది జరగలేదు. ఢిల్లీలోనూ నాగపూర్ ఫలితమే పునరావృతమైంది.
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అవుట్ అయిన తర్వాత భరత్ క్రీజులోకి వచ్చాడు. కోహ్లీతో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడతాడు అని అందరూ అనుకున్నారు. కాసేపటికే అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. అప్పటికి అతని స్కోరు కేవలం 44 పరుగులు మాత్రమే. దీంతో భరత్ తప్పనిసరిగా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మైదానంలో ఉన్న తెలుగు అభిమానులు కూడా ఫ్ల కార్డులు పట్టుకొని భరత్ ను ఉత్సాహపరిచారు. కానీ భరత్ మాత్రం తన వైఫల్యాన్ని కొనసాగించాడు. వ్యక్తిగత స్కోరు ఆరు పరుగుల వద్ద లియాన్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకోవడంతో గాలిలోకి లేచింది. దానిని స్మిత్ అద్భుతంగా పట్టేశాడు. దీంతో భరత్ మరోసారి నిరాశగా పెవిలియన్ చేరాడు.
భరత్ నిష్క్రమణతో సోషల్ మీడియాలో మీమ్స్ చెలరేగుతున్నాయి. ఇతని కంటే ఆ సంజు శాంసన్ నయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. రోడ్డు ప్రమాదానికి గురికాకుంటే పంత్ ఇతడి స్థానంలో ఆడేవాడని, అప్పుడు భారత్ పెద్దగా ఇబ్బంది పడేది కాదని కామెంట్లు చేస్తున్నారు. ఇంతమంది కీలకమైన ఆటగాల మధ్యలో అవకాశం రావడమే ఎక్కువ. కానీ దాన్ని భరత్ వినియోగించుకోకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. భరత్ కన్నా మెరుగైన బ్యాటర్లు, వికెట్ కీపర్లు ఉన్నప్పటికీ ఇలాంటి వ్యక్తికి ఎలా అవకాశం ఇస్తున్నారని బీసీసీఐ సెలెక్టర్లను ప్రశ్నిస్తున్నారు.. భరత్ వరుసగా విఫలం కావడంతో అతడు అవుటైన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
KS Bharat contribution in 2nd Test#SrikarBharat #IndVsAus2023 pic.twitter.com/Tyvg4Zr57X
— Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) February 18, 2023