No Bra Day: నో బ్రా డే : బ్రా వేసుకోకపోతే లాభమా.. నష్టమా?

బిగుతుగా ఉండే బ్రాలు, లేదంటే అండర్‌ వైర్‌ ఉన్న బ్రాలు వేసుకోవడం వల్ల రోజంతా అసౌకర్యంగా ఉంటుంది. కొంతమందిలో రొమ్ము నొప్పి, వెన్ను నొప్పి కూడా ఉంటుంది.

Written By: Raj Shekar, Updated On : October 16, 2023 3:55 pm
Follow us on

ఉమెన్స్‌డే, పెరెంట్స్‌డే, గ్రీన్‌ డే, ఫారెస్ట్‌ డే, టైగర్‌డే.. లవర్స్‌డే.. ఉన్నట్లుగానే బ్రాకు ఒక రోజు ఉంది. బ్రాకు రోజు ఏంటి అనుకుంటున్నారా.. కానీ నిజమే.. అక్టోబర్‌ 13న నో బ్రా డే ను జరుపుకుంటారు. అయితే ఇప్పటికీ చాలా మంది మహిళలు బ్రా గురించి చర్చించేందుకు ఇష్టపడడం లేదు. కానీ నేటితరం యువత పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి లో దుస్తులను కూడా బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. ఒకప్పుడు బ్రా వేసుకుంటే… ఆ విషయం కూడా తెలిసేది కాదు.. కానీ ఇప్పుడు బ్రా కనిపించేలా డ్రెస్‌లు వేసుకుంటున్నారు. అయితే నో బ్రా డే ముఖ్య ఉద్దేశం రొమ్ము ఆరోగ్యాన్ని, బ్రా వేసుకోకపోవడం వల్ల వచ్చే సౌకర్యాన్ని గుర్తుచేయడం. రకరకాల డ్రెస్సులు, నెక్‌ లైన్లకు తగ్గట్లు బోలెడు రకాల బ్రాలు అందుబాటులోకి వచ్చేశాయి. జిమ్‌ వెళ్లేటప్పుడు ఒక రకం, ఆఫీసుకు వెళ్లేటప్పుడు ఒక రకం, ఇలా రకరకాల అవసరాలకు వివిధ రకాల బ్రాలు అందుబాటులోకి వచ్చేశాయి. సౌకర్యం కోసం కొందరు, అలవాటుగా మరి మరికొందరు, ఎబ్బెట్టుగా కనిపించొద్దని మరికొందరు ప్రతిరోజూ బ్రా వేసుకోవడం మామూలే. కానీ దాంతో సౌకర్యంతోపాటూ కొన్ని ఇబ్బందులూ ఉంటాయి. బ్రా వేసుకోకుండా ఉండటం వల్ల ఎంత సౌకర్యంగా ఉండొచ్చో తెలియజేసేందుకు.. అలాగే రొమ్ము క్యాన్సర్, రొమ్ము ఆరోగ్యం మీద అవగాహన పెంచేందుకు అక్టోబర్‌ 13ను నో బ్రా డేగా జరుపుకుంటారు.

బ్రా వేసుకోకపోవడం వలన లాభమా నష్టమా అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. నో బ్రా డే గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న మహిళలు దీనిపై అవగాహన పెంచుకుంటున్నారు. అసలు బ్రా వేసుకోకపోతే ఏమవుతుందనే విషయం గురించి చాలా విషయాలు ఈ క్యాంపేన్‌ సందర్భంగా నిపుణులు తెలియజేశారు. అవేంటో తెలుసుకుందాం..

సౌకర్యం కోసం..
బిగుతుగా ఉండే బ్రాలు, లేదంటే అండర్‌ వైర్‌ ఉన్న బ్రాలు వేసుకోవడం వల్ల రోజంతా అసౌకర్యంగా ఉంటుంది. కొంతమందిలో రొమ్ము నొప్పి, వెన్ను నొప్పి కూడా ఉంటుంది. బ్రా వేసుకోకపోవడం వల్ల చాలా సౌకర్యమైన అనుభూతి వస్తుంది.

రక్త సరఫరా పెరుగుతుంది..
బ్రాలు వేసుకోవడం వల్ల కొన్నిసార్లు రక్త సరఫరా మీద ప్రభావం పడుతుంది. ఇది రొమ్ము ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. బ్రా వేసుకోకపోతే రక్త సరఫరా పెరుగుతుంది. ఇది దీర్ఘకాలంలో రొమ్ములమీద ప్రభావం పడకుండా చూస్తుంది. రొమ్ము ఆరోగ్యానికి దోహదపడుతుంది.

ఆత్మ విశ్వాసం..
బ్రా వేసుకోకపోతే అసౌకర్యంగా ఉంటుందనో, లేదంటే ఎబ్బెట్టుగా కనిపిస్తామనో అనే ఆలోచన ఉంటుంది. కానీ ఆ ఆత్మవిశ్వాసం లోపించకూడదంటే.. మన శరీరాన్ని సహజంగా అది ఉన్న తీరులోనే దాన్ని అంగీకరించగలగాలి. నో బ్రా డే ముఖ్య ఉద్దేశం అదే. వక్షోజాల ఆకారం, పరిమాణం.. ఈ అన్ని విషయాల్లో ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే మన శరీరాన్ని మనం ప్రేమిస్తున్నట్లు.

ఛాతీ కండరాలు..
బ్రా వేసుకుంటేనే ఛాతీకి మద్దతుగా ఉంటుందనే భావన ఉంటుంది. కానీ నిజానికి బ్రా వేసుకోకపోతేనే ఛాతీ కండరాలు బిగుతుగా మారతాయట. అవే బ్రా అవసరం లేకుండా అవసరమయ్యే సపోర్ట్‌ ఇస్తాయి. దీనివల్ల సహజంగా మనం నిలబడే, కూర్చుని స్థితి సరిగ్గా ఉంటుంది.

వక్షోజాల ఆకారం..
బ్రా వేసుకోకపోతే ఆకారం దెబ్బతింటుందనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ నిజానికి బ్రా వేసుకోకపోతే ఆకారం మీద అసలు ఎలాంటి ప్రభావం ఉండదు. బ్రా వేసుకోవడం వల్ల చాతీ భాగంలో ఉండే స్నాయువులు బలహీనంగా మారతాయి. బ్రా వేసుకోకుంటే సహజ కదలిక ఉంటుంది. ఇవి స్నాయువుల్ని దృఢపర్చి ఆకారాన్ని కాపాడతాయి.

బ్రా వేసుకోవడం, వేసుకోకపోవడం అనేది పూర్తిగా అవసరం మీద, వ్యక్తిగత ఇష్టాఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. దానివల్ల వచ్చే సౌకర్యం, ఆత్మవిశ్వాసాన్ని చాలా మంది ఇష్టపడతారు. కానీ సహజ అందాన్ని, సౌకర్యాన్ని, సొంత ఆరోగ్యాన్ని గౌరవించుకోవాలని గుర్తుచేయడమే ఈ నో బ్రా డే నిర్వహిస్తున్నారు.