IPL Auction 2023 Sunrisers Hyderabad: ఐపీఎల్ లో ఆడడంలోనే కాదు.. మంచి ఆటగాళ్లను కొనుగోలు చేయడంలోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ అట్టర్ ప్లాప్ అవుతోంది. ఐపీఎల్ లో అన్ని జట్ల కంటే కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద అందరికంటే అత్యధిక పర్స్ మనీ ఉంది. దాదాపు 42.25 కోట్ల డబ్బులున్నాయి. ఇన్ని డబ్బులు చేతుల్లో పెట్టుకొని ప్రపంచంలోనే మేటి ఆల్ రౌండర్లు అయిన సామ్ కరణ్, బెన్ స్టోక్స్ ను కొనకుండా చేజేతులారా ప్రత్యర్థులకు వదిలేసింది. మూల్యం చెల్లించుకుంది. అసలు బుర్ర లేకుండా సన్ రైజర్స్ వ్యవహరిస్తున్న తీరుపై అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఐపీఎల్ వేలంలో పంజాబ్, హైదరాబాద్ వద్దే భారీగా డబ్బు ఉంది. హైదరాబాద్ వద్ద 42 కోట్లు ఉంటే పంజాబ్ వద్ద 32 కోట్లు.. మిగతా అన్నింటి వద్ద 20 కోట్లలోపే. అలాంటి జట్లు మేటి ఆల్ రౌండర్లను కొంటుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వదిలేసి దిక్కులు చూస్తోంది. హైదరాబాద్ ఓనర్ కావ్య పాప ఏం వేలం వేస్తుందో అర్థం కావడం లేదని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. మినీ వేలంలో రూ.18.50 కోట్లు దక్కించుకుని రికార్డు నెలకొల్పాడు. తొలుత ముంబయి, బెంగుళూరు, పంజాబ్ పోటీపడినా చెన్నై కూడా తోడవడంతో అతడి వేలం ఒక్కసారిగా పెరిగింది. చివరకు పంజాబ్ అతడిని దక్కించుకుంది. ఇంగ్లండ్ కు మొన్నటి టీ20 ప్రపంచకప్ అందించడంలో ఇతడిదే కీలకరోల్. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ అందుకున్నాడు. అలాంటి ఆటగాడి కోసం ముంబై, బెంగళూరు, పంజాబ్ పోటీపడుతుంటే హైదరాబాద్ వదిలేయడం అందరినీ షాక్ కు గురిచేసింది.

ఇక ప్రపంచంలోనే నంబర్ 1 ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కోసం హైదరాబాద్ ఎంతగానో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. బెన్ స్టోక్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 16.25 కోట్లకు దక్కించుకుంది. 42 కోట్ల పర్స్ మనీ ఉండి కూడా బెన్ స్టోక్స్ ను కెప్టెన్ గా చేయాలని చూసినా హైదరాబాద్ ఫ్రాంచైజీ అతడి కోసం గట్టిగా వేలం పాట పాడకపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది.

ఇక పంజాబ్ కెప్టెన్సీ నుంచి తొలగించి వదిలించుకున్న మయాంక్ అగర్వాల్ ను అన్ని ఫ్రాంచైజీలు వద్దనుకుంటే మన ఘనత వహించిన హైదరాబాద్ టీం ఏకంగా 8.50 కోట్లు పోసి కొని బూడిదలో పోసుకుంది.
ఐపీఎల్ లో అన్ని జట్లు ఆల్ రౌండర్ల వెంటపడ్డాయి. అటు బ్యాటింగ్, బౌలింగ్ చేసే వారి కోసం వేలంలో గట్టిగా పాడాయి. ఆల్ రౌండర్లకే ఐపీఎల్ వేలంలోనే అత్యధికంగా కోట్లు కుమ్మరించాయి. అలాంటిది ఆల్ రౌండర్లను వదిలేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం.. కేవలం బ్యాట్స్ మెన్లకు ప్రాధాన్యతనిచ్చి ‘హారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్’ లాంటి వారి బీ గ్రేడ్ బ్యాట్స్ మెన్ కొనుగోలు చేసింది. ఆల్ రౌండర్లను వదిలేసింది. హైదరాబాద్ కు కొన్న ఈ ఇద్దరు బ్యాటర్లే. వారికే సగం పర్స్ ఖాళీ చేసుకొని చేతులు కాల్చుకుంది. అందుకే బెన్ స్టోక్స్ ను కొనుగోలు చేయడానికి డబ్బులు లేకుండా పోయాయి.
ఇలాంటి తలతిక్క చేష్టలు.. వేలంలో సరైన ఆటగాళ్లను కొనుగోలు చేయకనే హైదరాబాద్ ఇలా తగలడిందని.. కెప్టెన్ గా బెన్ స్టోక్స్ ను కొని చేద్దామనుకుంటే ఇప్పుడు చెన్నై ఎగరేసుకుపోయింది. సన్ రైజర్స్ కొనుగోళ్లు మరీ దారుణంగా ఉన్నాయని అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.