Mayank Agarwal- Sunrisers Hyderabad: అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటిలా మారింది సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి. ఐపీఎల్ వేలంలో అందరికంటే ఎక్కువ పర్స్ మనీ కలిగిన సన్ రైజర్స్ టీం వ్యూహాత్మకంగా వ్యవహరించక అనామకులకు కోట్లు కుమ్మరించి అగ్ర శ్రేణి క్రీడాకారులకు డబ్బులు సరిపోక వదులుకుంది.

ప్రపంచంలోనే మేటి ఆల్ రౌండర్లు అయిన బెన్ స్టోక్స్, సామ్ కరణ్ లాంటి వారికి డబ్బులు వెచ్చించలేక తొందరపడి పంజాబ్ వదిలేసిన ఆ జట్టు కెప్టెన్ మయాంక్ కు 8 కోట్లు పెట్టి కొని చేతులు కాల్చుకుంది. ఆ తర్వాత కొందామంటే డబ్బులు సరిపోక భిక్కమొహం వేసింది.
ఐపీఎల్ వేలంలో పంజాబ్, హైదరాబాద్ వద్దే భారీగా డబ్బు ఉంది. హైదరాబాద్ వద్ద 42 కోట్లు ఉంటే పంజాబ్ వద్ద 32 కోట్లు.. మిగతా అన్నింటి వద్ద 20 కోట్లలోపే. అలాంటి జట్లు మేటి ఆల్ రౌండర్లను కొంటుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వదిలేసి దిక్కులు చూస్తోంది. హైదరాబాద్ ఓనర్ కావ్య పాప తెలివితక్కువ వేలానికి ఇప్పుడు సన్ రైజర్స్ కు కెప్టెన్ లేకుండా పోయారు.
నిజానికి ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భీకర ఫాంలో ఉన్నాడు. మొన్నటి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో పాకిస్తాన్ పై అజేయ అర్థసెంచరీ సాధించి టీంకు వరల్డ్ కప్ అందించాడు. అతడినే సన్ రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ చేయాలని.. ఎంతైనా వెచ్చించాలని చూశారు. కానీ మయాంక్ అగర్వాల్ కు 8 కోట్లు పెట్టి, హెన్నీ బ్రూక్ కు 13.50 కోట్లు ఖర్చు చేయడంతో సన్ రైజర్స్ గల్లాపెట్టే ఖాళీ అయిపోయింది. తర్వాత బెన్ స్టోక్స్ కోసం వేలంలో పోటీపడలేక వదులుకుంది. తెలివిగా అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న చెన్నై ఈ దిగ్గజ ఆల్ రౌండర్ కోసం 16 కోట్లు పోసి కొని లాభపడింది.

బెన్ స్టోక్స్ వస్తాడని ఆశపడ్డ సన్ రైజర్స్ ఆశలకు దెబ్బపడింది. ఈ దెబ్బకు సన్ రైజర్స్ కు కెప్టెన్ లేని పరిస్థితి నెలకొంది. దీంతో పంజాబ్ వదిలేసిన మయాంక్ అగర్వాల్ కే సన్ రైజర్స్ కెప్టెన్సీ అప్పగించాల్సిన గతి ఏర్పడింది. దీంతో ‘ఇదేం కర్మరా’ బాబూ అంటూ సన్ రైజర్స్ ఫ్యాన్స్ యాజమాన్యం వేలంలో వ్యవహరించిన తీరుకు తూర్పారపడుతున్నారు.