IPL Auction 2023: ఐపీఎల్–2023 మినీ వేలానికి రంగం సిద్దమైంది. కేరళలోని కొచ్చి వేదికగా మరో 24 గంటల్లో ఈ మినీ ఆక్షన్‌కు తెరలేవనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మినీ వేలం ఒక్క రోజులోనే పూర్తవనుంది. మొత్తం 991 మంది ఆటగాళ్లు మినీ వేలానికి రిజిస్టర్ చేసుకోగా.. ఫ్రాంచైజీలు 405 మంది ఆటగాళ్ల పేర్లను షార్ట్‌లిస్ట్ చేశాయి.

273 మంది భారత
షార్ట్‌లిస్ట్‌లో 273 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 132 మంది ఓవర్‌సీస్ ప్లేయర్లున్నారు. ఇందులో నుంచి గరిష్టంగా 87 మంది ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. 30 స్లాట్స్ ఓవర్‌సీస్ ఆటగాళ్లకు దక్కనుండగా.. మరో 57 స్థానాల కోసం భారత ఆటగాళ్లు పోటీపడనున్నారు. షార్ట్ లిస్ట్ చేసిన 405 మంది ఆటగాళ్లను మొత్తం 5 సెట్లుగా విభజించారు.
ఆ ఇద్దరికి భారీ ధర..
తొలి సెట్‌లో బ్యాటర్లు ఉండగా.. రెండో సెట్‌లో ఆల్‌రౌండర్లు ఉన్నారు. మూడో సెట్‌లో వికెట్ కీపర్లను చేర్చగా.. నాలుగో సెట్‌లో ఫాస్ట్ బౌలర్లు, ఐదో సెట్‌లో స్పిన్నర్లను చేర్చారు. మినీ వేలంలో సెట్‌ల వారీగా వేలం వేయనున్నారు. ఈ మినీ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్లు బెన్ స్టోక్స్, సామ్ కరన్‌కు భారీ ధర పలికే అవకాశం ఉంది. భారత క్రికెటర్లలో మయాంక్ అగర్వాల్, నారయణ్ జగదీషన్‌కు మంచి ధర పలకవచ్చు.
ఇక ఆ చానెల్‌లో ఐపీఎల్..
ఐపీఎల్ 2023 సీజన్ అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్. స్టార్ స్పోర్ట్స్ చానెల్‌లో ఈ మెగా వేలం ప్రత్యక్ష ప్రసారం కానుంది. స్టార్ స్పోర్ట్స్‌కు చెందిన ఇంగ్లిష్, హిందీ, తెలుగు, మళయాళం, కన్నడం, తమిళం చానెళ్లలో కూడా లైవ్ రానుంది. స్థానిక భాషల్లో వ్యాఖ్యానాన్ని అందించేందుకు కామెంటేటర్లను కూడా స్టార్ స్పోర్ట్స్ సిద్దం చేసింది.

హాట్‌స్టార్‌లో రాదు..
అయితే ఐపీఎల్ 2023 డిజిటల్ రైట్స్ రిలయన్స్‌కు చెందిన వయకామ్ 18 దక్కించుకోవడంతో హాట్‌స్టార్‌లో ఈసారి ఐపీఎల్‌ను చూడలేం. రిలయన్స్‌కు చెందిన జియో సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మినీ వేలంతోపాటు మ్యాచ్‌లు చూడవచ్చు. జియో సినిమా యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత జియో రిజిస్టర్ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయితే చాలు, ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ చెల్లించాల్సిన అవసరం లేదు. జియో సిమ్ లేని వాళ్లు మాత్రం ఐపీఎల్ 2023 మినీ వేలం లైవ్ చూడాలంటే వూట్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వూట్ యాప్ ఏడాదికి రూ.999 సబ్‌స్కిప్షన్ వసూలు చేస్తోంది. రూ.99 చెల్లిస్తే నెల రోజులు వూట్ యాప్‌ని వీక్షించవచ్చు.
రూ.206.5 కోట్లతో మినీ వేలం..
మినీ వేలంలో పాల్గొనే 10 ఫ్రాంచైజీల వద్ద మొత్తం రూ.206.5 కోట్ల పర్స్‌మనీ ఉంది. ఈ డబ్బులతోనే గరిష్టంగా 87 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి. అత్యధికంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.42.25 కోట్లు ఉండగా.. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ వద్ద రూ.32.2 కోట్లు ఉన్నాయి. అత్యల్పంగా కేకేఆర్ రూ.7.05 కోట్లు, ఆర్‌సీబీ రూ.8.75 కోట్ల డబ్బు ఉంది. మినీ వేలంలో ప్రధాన పోటీ సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్(రూ.20.55 కోట్లు), సీఎస్‌కే(రూ.20.45 కోట్లు), లక్నో సూపర్ జెయింట్స్(రూ.23.35 కోట్లు) మధ్య ఉండే అవకాశం ఉంది.