Infosys: మూన్‌లైటింగ్.. ఇటీవల తరచుగా వినిపిస్తున్న పదం.. ఇది నేరమని, చాలా తప్పని ఐటీ కంపెనీల యాజమాన్యాలు అంటున్నాయి. మూన్‌లైటింగ్‌ను వ్యతిరేకిస్తున్నాయి. కొంతమంది మాత్రం సమర్థిస్తున్నారు. తక్కువ వేతనాలతో మానవ వనరులు వినియోగించుకునే అవకాశం దొరుకుతుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్‌ఫోసిస్ మూన్‌లైటింగ్‌కు ఓకే చెప్పింది. కానీ కొన్ని షరతులు పెట్టింది. మేనేజర్ల వద్ద ముందస్తు అనుమతి తీసుకుని ‘గిగ్’ ఉద్యోగాలు చేసుకోవడానికి ఆమోదం తెలిపింది. అయితే రెండో ఉద్యోగం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్ఫోసిస్‌కు పోటీగా ఉండరాదని, తమ క్లయింట్ల ప్రయోజనాలకు భంగం కలిగించకుండా ఉండాలని స్పష్టం చేసింది.

మూన్‌లైటింగ్ అంటే..
మూన్‌లైటింగ్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఉద్యోగి.. ఒక సంస్థలో పూర్తిస్థాయి ఎంప్లాయ్‌గా పనిచేస్తూ … ఖాళీ సమయంలో ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకుని పనిచేయడం. ఇది ఇటీవల పెరిగింది. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో ఈ ధోరణి బాగా పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా ప్యాండమిక్ సమయంలో ఐటీ సంస్థలు వర్క్‌ఫ్రం హోం అవకాశం కల్పించాయి. దీంతో ఉద్యోగికి, యజమానికి మధ్య దూరం పెరిగింది. ఒక ఉద్యోగం దొరకకే కిందా మీదా పడుతుంటే.. కొంత మంది రెండు మూడు ఉద్యోగాలు ఒకేసారి చేస్తున్న వాళ్లున్నారు. ప్రపంచం మీద కరోనా విధ్వంసం చేస్తే కొందరికి మాత్రం అది వరంగా మారింది. ఐటీ ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం తమ తెలివిని, శ్రమను పెట్టుబడిగా పెట్టి.. ఇతర సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. పూర్తి ఎంప్లాయ్‌గా ఉన్న సంస్థకు పనిచేస్తూనే, పార్ట్‌టైం ఒప్పందం చేసుకున్న సంస్థకు మిగతా సమయంలో పనిచేస్తున్నారు.
ఐటీ రంగంలో ఎక్కువ..
ఐటీ సంస్థలు తమ ఉద్యోగులు టాలెంట్ మొత్తం తమ సంస్థ కోసమే వెచ్చించాలని భావిస్థాయి. ఇందుకోసం మంచి వేతనాలు కూడా ఇస్తున్నాయి. అయితే కరోనా లాక్‌డౌన్ కాలంలో వర్క్ ఫ్రం హోంకు ఐటీ సంస్థలు ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాయి. కానీ వర్క్ ఫ్రం హోం వల్ల అనేకమంది ఉద్యోగులు పక్కదారులు తొక్కారు. డెడికేటెడ్‌గా వేరువేరు ల్యాప్‌ట్యాప్‌లు పెట్టుకుని ఒక కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తూనే మరో కంపెనీకి కన్సెల్టెంట్‌గా సేవలందిస్తున్నవారు. నిజానికి ఆయా కంపెనీలు కాంపిటీటర్లు. సహజంగానే ఈ విషయం తెలిసి అనేక కంపెనీలు డిస్టర్బ్ అవుతున్నాయి.
సాఫ్ట్‌వేర్, కంపెనీ సీక్రెట్స్ రివీల్ అయ్యే అవకాశం..
మూల్‌లైటింగ్ చాలా నేరమని ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో చైర్మన్ అభిప్రాయపడ్డారు. ఒక సంస్థలో ఉద్యోగి అయి ఉండి.. ఇంకో సంస్థకు కన్సల్టెంట్‌గా చేయడం తప్పని పేర్కొన్నారు. దీనివల్ల కంపెనీ లాయల్టీ దెబ్బతింటుందని పేర్కొన్నారు. మూన్‌లైటింగ్‌ను వ్యతిరేకిస్తున్న కంపెనీలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఒక సంస్థలో పూర్తి ఉద్యోగి అయి ఉండి.. ఇంకో సంస్థకు పనిచేయడం వలన ఒక సంస్థ రహస్యాలు ఇంకో సంస్థకు తెలిసే అవకాశం ఉంటుందని, లక్షలు వెచ్చించి కొనుగోలు చేసే సాఫ్ట్‌వేర్ దుర్వినియోగం అవుతుందని పేర్కొంటున్నారు. మూన్‌లైటింగ్‌పై ఆలస్యంగా కళ్లు తెరిచిన కంపెనీలు వర్క్‌ఫ్రం హోంను రద్దు చేశాయి.

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు అంతర్గత సమాచారం..
మూన్‌లైటింగ్ కట్టడికి కంపెనీలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు ఉద్యోగులు రహస్యంగా వర్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ సంస్థ.. మేనేజర్ల వద్ద ముందస్తు అనుమతి తీసుకుని ‘గిగ్’ ఉద్యోగాలు చేసుకోవడానికి తన ఉద్యోగులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉద్యోగులకు పంపిన అంతర్గత సమాచారంలో ఏ విధంగా ‘గిగ్ వర్క్’లను చేసుకోవచ్చో వివరించింది. ఈ నిర్ణయం వల్ల సిబ్బంది వలసలు కొంతమేర తగ్గుతాయని విశ్లేషకులు అంటున్నారు. వారు అదనపు ఆదాయ వనరులు సమకూర్చుకునేందుకు, తమ అభిరుచి మేరకు కొత్త సాంకేతికతలపై పనిచేయాలన్న అభిరుచిని కొనసాగించేందుకు వీలవుతుందని విశ్లేషిస్తున్నారు. అయితే ‘గిగ్’ వర్క్‌ను ఇన్ఫీ నిర్వచించలేదు. దానిని ‘మూన్‌లైటింగ్’గానూ పేర్కొనలేదు.