
Air India: విమానాల్లో ప్రయాణించే భారతీయుల సంఖ్య చాలా తక్కువ. ఉన్నత వర్గాలే విమానయానాన్ని ప్రయాణ మార్గంగా ఎంచుకుంటాయి. ఇంకా మధ్యతరగతి వర్గానికి ఇదొక కాస్ట్లీ వ్యవహారంగానే ఉంది. ఇప్పుడిప్పుడే మధ్యతరగతి వర్గం విమానాల్లో ప్రయాణించడం అలవాటు చేసుకుంటోంది. భవిష్యత్తులో మరింత డిమాండ్ పెరగనుంది. ఈ డిమాండ్ ను అందిపుచ్చుకునేందుకు భారత విమానయాన రంగం సిద్దమవుతోంది.
భారత విమానయాన రంగం అభివృద్ధి దశాబ్దాలుగా ఎదుగు బొదుగు లేకుండా ఉంది. విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్యలో ఏమాత్రం పెరుగుదల లేదు. కొన్ని వర్గాలే విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటున్నాయి. వీటికి తోడు ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి. టికెట్ ధర పెంచే పరిస్థితి లేదు. విమాన సిబ్బంది జీతాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కలిసి విమానసంస్థల ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా విమానయాన సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి. వంద విమానాలు నడిపే సంస్థ .. కరోన తర్వాత 50 విమానాలకే పరిమితమైంది.
ఇదంతా గతం.. వర్తమానం. కానీ రానురాను విమానయాన రంగం దిశ మారుతున్నట్టు తెలుస్తోంది. విమానాలు నడపడం తగ్గించిన సంస్థలు.. ఇప్పుడు కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇస్తున్నాయి. ఇటీవల ఎయిర్ ఇండియా సంస్థ 420 కొత్త విమానాలకు ఆర్డర్ ఇచ్చిందంటే పరిస్థితిని ఊహించవచ్చు. ఎయిర్ ఇండియా బాటలోనే మరిన్ని దేశీయ సంస్థలు పయనించే అవకాశం కనిపిస్తోంది. ఇండిగోతో పాటు మరికొన్ని సంస్థలు త్వరలో 1000 నుంచి 1200 కొత్త విమానాలకు ఆర్డర్ ఇవ్వనున్నట్టు ది సెంటర్ ఫర్ ఏసియా ఫసిఫిక్ ఏవియేషన్ అంచనా వేసింది. వచ్చే రెండేళ్లలో మరిన్ని కొత్త విమానాల కోసం కపెంనీలు ఆర్డర్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దీనికి మొదటి కారణం.. ఏవియేషన్ రంగంలో రానున్న అభివృద్ధి కాగా.. రెండో కారణం పాత విమానాల స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టడం.

కరోన రాక ముందు ఇండిగో సంస్థ 300 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. కానీ కరోన కారణంగా ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. కానీ ఇప్పుడు గతంలో కంటే అధికంగా 500 కొత్త విమానాలకు ఆర్డర్ ఇవ్వనున్నట్టు ది సెంటర్ ఫర్ ఏసియా ఫసిఫిక్ ఏవియేషన్ అంచనా వేసింది. ప్రస్తుతం ఇండియాలోని అన్ని కంపెనీలు 700 దాకా విమానాలను నడిపిస్తున్నాయి. ఒక్క అమెరికన్ ఎయిర్ లైన్స్ మాత్రమే 900కి పైగా విమానాలు నడుపుతోంది. కానీ వచ్చే రోజుల్లో ఇండియా నుంచి మరిన్ని వందల విమానాలు నడిచే అవకాశం ఉన్నట్టు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. విమానాలు ఆర్డర్ ఇవ్వడం పెద్ద విషయం కాదు కానీ.. ఇంత పెద్ద ఎత్తున విమానాలు నడిపినప్పుడు.. వాటిని తట్టుకునే సామర్థ్యం భారత విమానరంగ వ్యవస్థకు ఉండాలని రిపోర్టులో పేర్కొన్నారు.
పాలసీల్లో మార్పులు, నియమ నిబంధనల్లో మార్పులు తీసుకురావాల్సి ఉందని రిపోర్టులో పేర్కొన్నారు. పెరగబోయే విమానాల సంఖ్యకు అనుగుణంగా.. వాటిని నడిపే నైపుణ్యంగల యువత కావాలి. అందుకు అవసరమైన విజ్ఞానం అభివృద్ధి చెందాలి. ప్రపంచ స్థాయిలో పోటీపడగల ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది. విమానాలు ఆర్డర్ అయితే ఇస్తున్నారు. కానీ ఇప్పుడు అనేక సవాళ్లు విమానయాన రంగం ముందు ఉన్నాయని చెప్పవచ్చు. భవిష్యత్తులో నైపుణ్యంగల సిబ్బంది కొరత వేధించనుంది. పైలెట్లు, ఇంజినీర్లు, టెక్నిషియన్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ లాంటి నైపుణ్యంగల ఉద్యోగాల కొరత అధికంగా ఉండే అవకాశం ఉంది. విమానయాన కంపెనీలు వీటిని దృష్టిలో ఉంచుకుని కొత్త విమానాలను సమకూర్చుకోవాలి. విమానాలు సమకూర్చుకోవడానికి సమాంతరంగా సిబ్బందిని సమకూర్చుకోగలిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
విమానయానరంగంలో ఇంత పెద్ద ఎత్తున మార్పు రావడానికి.. దేశీయ, అంతర్జాతీయ టూరిజం ఒక కారణమని చెప్పవచ్చు. అదే సమయంలో ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో విమాన ప్రయాణం ఇక నుంచి కాస్ట్లీ వ్యవహారమైతే కాకపోవచ్చు. దేశంలో అధికంగా మధ్యతరగతి వర్గం ఉంది. ఈ వర్గం విమాన ప్రయాణాన్ని .. బస్సు, రైలు లాంటి సాధారణ ప్రయాణంగా ఎంచుకుంటే .. విమానయాన రంగం వాయివేగంతో దూసుకుపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
