India Vs New Zealand 1st T20: టీం ఇండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది.. వన్డే సిరీస్ లో వాష్ కు గురైన న్యూజిలాండ్ తొలి టి20 మ్యాచ్లో శుభారంభం చేసింది.. రాంచి వేదికగా జరిగిన తొలి టీ20 లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్.. 21 పరుగుల తేడాతో భారత జట్టును ఓడించింది.. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది.. డేవాన్ కాన్వే(35 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 52 పరుగులు), డారిల్ మిచెల్( 30 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్ లతో 59 నాట్ అవుట్) హాఫ్ సెంచరీ లతో చెలరేగారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీశాడు. అర్ష్ దీప్ సింగ్, కులదీప్ యాదవ్, మావి తలా ఒక వికెట్ తీశారు.

అనంతరం లక్ష్య చేదనకు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 155 పరుగులు చేసి ఓటమి పాలయింది. వాషింగ్టన్ సుందర్ ( 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్ లతో50) హాఫ్ సెంచరీ తో రాణించగా, సూర్య కుమార్ యాదవ్ ( 34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్ లతో 47) పర్వాలేదు అనిపించాడు. కివీస్ బౌలర్లలో బ్రేస్ వెల్, శాంట్నర్, ఫెర్గూసన్ రెండేసి వికెట్లు తీశారు..ఐష్ సోది, జకోబ్ దప్ఫీ తలా ఒక వికెట్ తీశారు. టీం ఇండియా పేసర్ ఆర్ష్ దీప్ సింగ్ 27 పరుగులు ఇవ్వడం టీం ఇండియా పతనాన్ని శాసించింది.
ఓపెనర్లు విఫలం
177 పరుగుల భారీ లక్ష్య చేదనకు దిగిన టీం ఇండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది.. లింక్స్ రెండో ఓవర్లో బ్రేస్ వెల్ స్టన్నింగ్ డెలివరీ కి ఇషాన్ కిషన్ (4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులో కి వచ్చిన రాహుల్ త్రిపాఠి (0) ని మరుసటి ఓవర్లో డప్ఫీ కీపర్ క్యాచ్ గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ గిల్ ను శాంట్నర్ క్యాచ్ ఔట్ చేశాడు. దీంతో టీమిండియా 15 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఆచి తూచి ఆడారు. ఈ క్రమంలో శాంట్నర్ వేసిన ఆరో ఓవర్ ను సూర్య పూర్తిగా మెయిడిన్ చేశాడు. దీంతో పవర్ ప్లే లో టీం ఇండియా 3 వికెట్లకు 33 పరుగులు మాత్రమే చేసింది.
సోది దెబ్బతీశాడు
బ్రేస్ వెల్ వేసిన 8వ ఓవర్ లో హార్దిక్ భారీ సిక్సర్ బాదాడు. సూర్య కూడా బౌండరీ తో టచ్ లోకి వచ్చాడు.. అదే జోరులో మరిన్ని బౌండరీలు దాటిన సూర్య.. ఇష్ సోది తెలివైన బంతికి క్యాచ్ అవుట్ అయ్యాడు.. దీంతో నాలుగో వికెట్ కు నమోదైన 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. బ్రేస్ వెల్ వేసిన ఆ మరుసటి ఓవర్లో హార్థిక్ పాండ్యా (21) కూడా అవుట్ అవడంతో మ్యాచ్ పై కివీస్ పట్టు బిగించింది.. వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా ఇచ్చిన క్యాచ్ లను న్యూజిలాండ్ ఫీల్డర్లు నేలపాలు చేశారు. ఈ అవకాశాన్ని దీపక్ (10) వినియోగించుకోలేకపోయాడు. వేగంగా ఆడాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి స్టంప్ అవుట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన శివమ్ మావి శాంట్నర్ స్టన్నింగ్ త్రోకు అవుట్ గా వెను తిరిగాడు. కులదీప్ యాదవ్ (0) క్యాచ్ అవుట్ అయ్యాడు.

సుందర్ ఒంటరి పోరాటం
క్రీజులోకి వచ్చిన అర్ష్ దీప్ సింగ్ తో సుందర్ భారీ షాట్లతో అభిమానులను అలరించాడు. టిక్ నర్ వేసిన 17వ ఓవర్ లో 6, 4 బాదిన సుందర్… జకోబ్ డప్ఫీ వేసిన 19వ ఓవర్ లో 6, 4, 4 బాదాడు. ఒత్తిడికి గురైన డప్ఫీ వరుసగా రెండు వైడ్లు వేశాడు. చివరి ఓవర్ లో భారత్ విజయానికి 6 బంతుల్లో 33 పరుగులు అవసరం అవ్వగా… రెండో బంతికి సిక్స్ బాది ఆశలు రేకెత్తించాడు. ఈ సిక్స్ తో టీ 20 ల్లో హాఫ్ సెంచరీ చేశాడు..కానీ ఫెర్గూసన్ కట్టు దిట్టంగా బౌలింగ్ చేయటంతో సుందర్ ఔట్ అయ్యాడు. దీంతో కివీస్ విజయం సాధించింది.