
Virat Kohli- Hardik Pandya: హార్ధిక్ పాండ్యా.. టీమిండియా టీ20 జట్టు కెప్టెన్. మంచి క్రికెటర్. చిన్న వయసులోనే టీ20 జట్టుకు సారథ్య బాధ్యలు చేపట్టే చాన్స్ దక్కింది. అది ఎలా అనే విషయం పక్కన పెడితే.. పదవి వచ్చిన ఒదిగి ఉండడం ఏ రంగంలో అయినా ముఖ్యమే. కానీ, హార్ధిక్ పాండ్యా కెప్టెన్ అయ్యాక ఆయన ప్రవర్తనలో మార్పులు కనిపిస్తున్నాయి. సహచరులతో, సీనియర్లతో ప్రవర్తిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీతో హార్ధిక్ వ్యవహరించిన తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తొలి వన్డేలో విజయం..
ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో భారత స్టార్ ఆటగాళ్లు కేల్ రాహుల్, రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పట్ల హార్ధిక్ పాండ్యా వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీనియర్లకిచ్చే గౌరవం ఇదేనా..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లు ముగిసేసరికి 129 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో ఆసీస్ ఇన్నింగ్స్ 21వ ఓవర్ బౌలింగ్ చేయడానికి కుల్దీప్ యాదవ్ వచ్చినప్పుడు.. విరాట్ కోహ్లీ ఫీల్డ్‌లో మార్పు చేయాలని హార్ధిక్‌కు సూచించాడు. అయితే హార్ధిక్ మాత్రం విరాట్ మాటలను కొంచెం కూడా పట్టించుకోలేదు. అంతేకాదు ఏమీ పట్టనట్లు దూరంగా వెళ్లిపోయాడు. వెంటనే కోహ్లి కూడా హార్ధిక్‌ను ఉద్దేశించి కోపంగా ఏదో అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా నిలిచిన కోహ్లిని.. హార్ధి్దక్ ఈ విధంగా అవమానించడాన్ని విరాట్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోను ట్రోల్ చేస్తున్నారు. ఎంత కెప్టెన్ అయినా, సీనియర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడుతున్నారు. కెప్టెన్ కాగానే కొమ్ములు వచ్చాయా అని మండి పడుతున్నారు. తొలిసారి వన్డే జట్టుకు సారథ్యం వహించే చాన్స్ వచ్చిందని, తన బాధ్యతలతో గౌరవం పెంచుకోవాలని కానీ, ఇలా ప్రవర్తించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆలోచనలు, అభిప్రాయాలను సహచరులతో పంచుకున్నప్పుడే నిజమైన సారథి అవుతారని పేర్కొంటున్నారు. మరి దీనిపై హార్ధిక్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.
https://twitter.com/cricadda/status/1636723210854236162?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1636723210854236162%7Ctwgr%5Ec60a977cfa67da395ad428fff535b2af6ea55354%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fsports%2Fvirat-kohli-fumes-hardik-pandya-ignores-him-during-1st-odi-1552741