
Sabja: వచ్చేది వేసవి కాలం. చల్లగా ఉండే పానీయాలవైపు సహజంగానే మనసు మళ్లుతుంది. వడ దెబ్బను తట్టుకోవడానికి సబ్జా గింజలు ఎక్కడున్నాయా అని వెతుకుతాం. ఎందుకంటే వేడి, దాహం… నీరసం, నిస్సత్తువ వీటి నుంచి ఉపశమనం పొందాలన్నా.. అనారోగ్యం దరిచేరకుండా ఉండాలన్నా.. కాసిన్ని సబ్జా గింజలు నానేయండి. పాలతో, రోజ్‌సిరప్‌తో.. నిమ్మకాయరసం కలిపి తాగండి. ఎండ, చెమట కారణంగా పోయిన పోషకాలన్నీ తిరిగి మీ శరీరంలోకి రావడం కాయం.

పోషకాలు పుష్కలం..
సబ్జా గింజలు.. వీటిని తుక్మారియా లేదా తులసి గింజలు అని కూడా పిలుస్తారు. ఇవి అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. హిందువులు పవిత్రంగా భావించే తులసిని పోలిన మొక్క నుంచి వచ్చే ఈ సబ్జా గింజలతో అనేక అరోగ్య ప్రయోజనాలున్నాయి. సబ్జా గింజల్లో ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ కేలరీలు ఉంటాయి. సబ్జా గింజలను పచ్చిగా తినలేరు. వీటిని నీటిలో నానబెట్టిన తరువాత తీసుకుంటే వీటి ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. ఇక ఆయుర్వేదంలో సబ్జా గింజల ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. వీటి వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఆయుర్వేదంలో పేర్కొన్నారు.
ఇవీ ప్రయోజనాలు..
1. బరువు తగ్గడానికి..
సబ్జా గింజల్లో ఆల్ఫా–లినోలెనిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువును తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది. ఇంకా ఇందులో ఫైబర్ ఉండటం వలన.. వీటిని తింటే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. అవాంఛిత కోరికలను నియంత్రించి బరువు తగ్గడంలో సహాయపడుతాయి.
2. షుగర్ లెవల్స్ తగ్గించడంలో..
టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులకు ఇది మంచిదని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో సబ్జా గింజలు అద్భుతమైన పనితీరును కనబరుస్తాయని చెబుతున్నారు.
3. మలబద్ధకం, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం..
సబ్జా గింజలు సహజంగానే మీ శరీరాన్ని నిర్విషీకరణం చేస్తాయి. ఇది అస్థిర నూనెను కలిగి ఉంటుంది. ఉదర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా గ్యాస్, మలబద్ధకం సమస్యలను దూరం చేస్తుంది.
4. అసిడిటీ, ఛాతిలో మంట తగ్గిస్తుంది..
సబ్జా గింజలు శరీరంలో అమ్లత్వాన్ని తగ్గిస్తుంది. ఇది ఆమ్లత్వం, గుండెల్లో మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నానబెట్టిన గింజలను తీసుకోవడం ద్వారా కడుపులోని సమస్యలను క్లియర్ చేస్తుంది. తద్వారా మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
5. చర్మం, జుట్టుకు ఆరోగ్యం..
కొబ్బరి నూనెలో పిండిచేసిన సబ్జా గింజలను కలిపి.. ఆ నూనెను ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు ఉన్నచోట అప్లయ్ చేస్తే అద్భుతంగా పని చేస్తుంది. సబ్జా విత్తనాలను క్రమం తప్పకుండా తినడం వల్ల కొత్త చర్మ కణాలను రూపొందించడానికి అవసరమైన కొల్లాజెన్‌ను స్రవించడంలో మీ శరీరానికి సహాయపడుతుంది. సబ్జా గింజలు పొడవాటి, దృఢమైన జుట్టుకు అవసరమైన ఐరన్, విటమిన్–కె, ప్రొటీన్‌తో నిండి ఉన్నందు.. ఆరోగ్యకరమైన జుట్టును నిర్వహించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మీ చర్మం, జుట్టుకు అనేక రకాలుగా మేలు చేస్తుంది.
6. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం..
సబ్జా గింజల్లో యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది కండరాల సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కండరాలకు విశ్రాంతినిస్తాయి. యాంటిస్పాస్మోడిక్ లక్షణం.. కోరింత దగ్గును నియంత్రించడంలో అద్భుతంగా పని చేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.