https://oktelugu.com/

Dried Fruit: ఎండుఫలం.. ఎంతో బలం

చాలామంది జీడిపప్పు, బాదం, పిస్తా వంటి వాటిని డ్రై ఫ్రూట్స్ గా పరిగణిస్తుంటారు. వాటిని ఎప్పుడో ఒకసారి తింటారు.. అయితే అలా కాకుండా వాటిని రోజూ తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు పౌష్టికాహార నిపుణులు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 4, 2024 / 03:53 PM IST

    Health benefits of dried fruit

    Follow us on

    Dried Fruit: ఆకలైనప్పుడు తినడం వేరు.. శరీరానికి పనికొచ్చే తిండి తినడం వేరు. అదేంటి ఆహార పదార్థాలు తినడం వల్లే కదా ఆకలి తీరేది. ఆ ఆహార పదార్థాలు శరీర వృద్ధికి తోడ్పడతాయని అంటారు కదూ.. శరీరానికి పనికొచ్చే తిండి తింటే చాలామంది పోషకాహార లోపంతో బాధపడరు. వివిధ రకాల రుగ్మతలతో ఇబ్బంది పడరు. అందుకే ఎరుకతో తినాలని వైద్యులు చెబుతుంటారు. ఇంతకీ శరీరానికి పనికొచ్చే ఆ పౌష్టికాహార పదార్థాలు ఏమిటో ఒకసారి ఈ కథనంలో తెలుసుకుందాం.

    చాలామంది జీడిపప్పు, బాదం, పిస్తా వంటి వాటిని డ్రై ఫ్రూట్స్ గా పరిగణిస్తుంటారు. వాటిని ఎప్పుడో ఒకసారి తింటారు.. అయితే అలా కాకుండా వాటిని రోజూ తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు పౌష్టికాహార నిపుణులు. వాటిల్లో మోనో అసంతృప్త కొవ్వులు ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ముఖ్యంగా పిస్తాలో బి6 విటమిన్ గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఇక ఎండు ఖర్జూరం రక్తనాళాల్లో రక్తం గట్టిపడకుండా చూస్తుంది. కొవ్వులు పేరుకుపోయినప్పుడు.. అవి కరిగేలా పనిచేస్తుంది. ఎండు ద్రాక్ష, ఖుబానీ వంటి ఫలాల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆడవాళ్లు తీసుకుంటే ఐరన్ లోపాన్ని జయించవచ్చు.

    ఎండు ఫలాలు కేవలం విటమిన్లను ఇవ్వడం మాత్రమే కాదు.. కొవ్వులు తగ్గడానికి దోహదం చేస్తాయి. జీడిపప్పులో కొవ్వు శాతం ఉండదు. పిస్తాలో మంచి కొవ్వులు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఎండు ద్రాక్షలో ఉన్న ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం రక్త ప్రసరణ వ్యవస్థ సాఫీగా జరిగేందుకు దోహదం చేస్తాయి.. ఎండు ఆల్బుకార్ పండ్లలో పొటాషియం, విటమిన్ ఏ, ఫైబర్ వంటివి ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఒంట్లో శక్తి తగ్గిపోదు. బాదంపప్పును ఉదయం నానబెట్టి తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. చాలామంది బాదంపప్పును పై పొట్టు తీసి తింటారు.. కానీ ఆ పొట్టులో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంటాయి. ఎండు ద్రాక్షలో విటమిన్ ఏ, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల దృఢత్వానికి దోహదం చేస్తాయి. జీడిపప్పులో ఉన్న మెగ్నీషియం దంతాల చిగుళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇక అక్రూట్స్ మెదడు కు రక్త ప్రసరణ వ్యవస్థను పెంపొందిస్తాయి. మెదడుపై ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా వీటిలో ఉన్న ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు మెదడు ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తాయి.

    ఎముక పుష్టి సరిగ్గా లేనివారు, ఐరన్ లోపంతో బాధపడుతున్న వారు ఎండు ద్రాక్ష, బాదం పప్పులు, జీడిపప్పులు తీసుకోవాలి. జీడిపప్పులు నానబెట్టిన నీటిని తాగాలి. దీనివల్ల శరీరంలో జీవక్రియలు క్రమబద్ధీకరణ దశలో జరుగుతాయి. అప్పుడు వృద్ధిరేటు కూడా బాగుంటుంది. అయితే ఈ ఎండుఫలాలను సరైన మోతాదులో తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. ఎక్కువ తీసుకుంటే దుష్పరిణామాలు వస్తాయని చెబుతున్నారు పౌష్టికాహార నిపుణులు.