
Sikander Raza : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పాకిస్తాన్ ఆటగాళ్లకు గత కొన్నేళ్ల నుంచి అవకాశం లేకుండా పోయింది. అయితే పాకిస్తాన్ లో పుట్టి.. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అదరగొడుతున్నాడు ఓ క్రికెటర్. ఐపీఎల్ లో మెరుపులతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు క్రికెటర్ సికిందర్ రజా. జింబాబ్వే జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న ఈ క్రికెటర్.. తాజా ఇన్నింగ్స్ తో పంజాబ్ జట్టుకు కీలకంగా మారాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో దేశ, విదేశాలకు చెందిన క్రికెటర్లు అదరగొడుతున్నారు. లోకల్ స్టార్స్ ఇప్పటికే పలు మ్యాచ్ ల్లో అదరగొట్టగా.. మొన్న జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ కు చెందిన బ్రూక్ సెంచరీ తో కదం తోక్కి హైదరాబాద్ జట్టుకు విజయాన్ని అందించగా.. తాజాగా పాకిస్తాన్ లో పుట్టి జింబాబ్వే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సికిందర్ రజా అద్భుత ఇన్నింగ్స్ తో పంజాబ్ జట్టుకు విజయాన్ని అందించి పెట్టాడు.
ఐపీఎల్ లో సత్తా చాటిన వారికి జాతీయ క్రికెట్ జట్టులో చోటు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సత్తా చాటే ఆటగాళ్లకు ఆయా దేశాల క్రికెట్ టీమ్ లో మంచి స్థానం లభిస్తుంది. ఇండియన్ క్రికెట్ టీమ్ కు ఐపీఎల్ నుంచి వచ్చిన ఎంతో మంది యువర్ క్రికెటర్లు ఎంపికయ్యారు. విదేశాలకు చెందిన ప్లేయర్లు ఐపీఎల్ లో రాణించి ఆయా దేశాల జట్లలో కీలక ప్లేయర్లుగా మారారు.
థ్రిల్లర్ ను తలపిస్తున్న ఐపీఎల్ మ్యాచ్ లు..
కొద్దిరోజులుగా ఐపీఎల్ 16వ సీజన్ లో జరుగుతున్న మ్యాచ్ లను పరిశీలిస్తే థ్రిల్లర్ తలపిస్తున్నాయి. ఏ జట్టు గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఓవర్ వరకు ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడుతోంది. దీంతో ఐపీఎల్ పట్ల ఆసక్తి మరింత పెరుగుతుంది. తాజాగా లక్నో – పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కూడా చివరి ఓవర్ వరకు ఉత్కంఠ గా సాగింది. ఈ మ్యాచ్ లో సికిందర్ రజా అద్భుత ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ జట్టుకు విజయాన్ని అందించాడు.
కీలక ఇన్నింగ్స్ తో ఆదుకున్న సికిందర్ రజా..
ఈ సీజన్ లో పంజాబ్ జట్టు వరుసగా రెండు ఓటములు చవి చూసింది. తర్వాత నుంచి మెల్లగా కోలుకుని విజయాల బాట పట్టింది. భుజం నొప్పి వల్ల రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఆటకు దూరమైనా మూడో విజయం సొంతం చేసుకుంది. L ఈ మ్యాచ్ లో ఒక దశలో 11 ఓవర్లకు పంజాబ్ 75/4 తో క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ దశలో మరో వికెట్ పడితే జట్టు పరిస్థితి ఇబ్బందికరంగా మారేది. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన సికిందర్ రజా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 41 బంతుల్లో 57 పరుగులు చేసి అదరహో అనిపించాడు రజా.

పాకిస్తాన్ లో పుట్టి.. జింబాబ్వే జట్టుకు ఆడుతూ..
రజా అద్భుతమైన ప్రతిభ కలిగిన క్రీడాకారుడు. అయితే ఈ ఆటగాడు గురించి చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. సికిందర్ రజా అంటే అందరికీ గుర్తొచ్చేది జింబాబ్వే జట్టు ప్లేయర్ అని. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. రజా పాకిస్థాన్లోని సియాల్కోట్ లో పంజాబీ మాట్లాడే కశ్మీరీ కుటుంబంలో జన్మించాడు. పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్ లో ఫైటర్ పైలెట్ కావాలనే కోరిక ఉండేది. కానీ కంటి పరీక్షలో విఫలం కావడంతో అతని కల నెరవేరలేదు. 11 ఏళ్ళ వయసు నుంచి పైలెట్ కావాలనే ధ్యాసలో ఉన్న రజా.. అది సాధ్యం కాకపోవడంతో ఎంతో బాధపడ్డాడు. తర్వాత స్కాట్లాండ్లోని గ్లాస్గో లో ఉన్న కలేడోనియన్ యూనివర్సిటీలో చేరాడు రజా. 2002 నుంచి తన తల్లిదండ్రులు జింబాబ్వేలో స్థిరపడడంతో.. ఆ దేశానికి వెళ్లిపోయాడు. అక్కడ క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన సికిందర్.. 2007లో తొలిసారి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. 2009లో జింబాబ్వే క్రికెట్లో ప్రక్షాళన జరిగాక.. మసోనా ల్యాండ్ ఈగల్స్ తరపున ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. చదువు పూర్తయిన తర్వాత 2010 -11 సీజన్ లో పూర్తి సమయాన్ని క్రికెట్ కోసం కేటాయించాడు. ఆ సీజన్లో 41 యావరేజ్ తో 625 పరుగులు చేశాడు. ఆ తర్వాత కాలంలో టీ20 స్పెషలిస్ట్ గా రజా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అనంతరం ఏడాది జరిగిన స్ట్రాన్ బిక్ బ్యాంక్ టి20 కాంపిటీషన్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో సెలెక్టర్లు దృష్టిలో పడ్డాడు రజా. వుసి సింబంద గాయపడటంతో.. బంగ్లాదేశ్ తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటానికి రజా ఎంపికయ్యాడు.
పౌరసత్వం లేకపోవడంతో దక్కని చోటు..
2011 వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో రజాను ఎంపిక చేశారు. అప్పటికే మెరుగైన ప్రదర్శన చేయడంతో జట్టుకు కొండంత అండగా రజా ఉంటాడని టీమ్ భావించింది. అయితే, తుది జట్టులో రజాకు చోటు కల్పించలేకపోయారు. దీనికి కారణం జింబాబ్వే పౌరసత్వం లేకపోవడమే. 2011 ఏడాది చివర్లో రాజాకు జింబాబ్వే పౌరసత్వం వచ్చింది. 2013 మే నెలలో రజాకు జింబాబ్వే తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం లభించింది. నాటి నుంచి జింబాబ్వే జట్టులో కొనసాగుతున్నప్పటికీ.. గడిచిన మూడేళ్లుగా ఆ జట్టులో స్టార్ ప్లేయర్ గా మారిపోయాడు రజా. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటుతూ దుమ్మురేపుతున్నాడు. గతేడాది జరిగిన టి20 ప్రపంచ కప్ లో జింబాబ్వే గెలిచిన మ్యాచ్ లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఇక ఐపీఎల్ మినీ వేలంలో రజాను రూ.50 లక్షలకు దక్కించుకుంది పంజాబ్ కింగ్స్.
అద్భుతమైన ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాన్ని..
సికిందర్ రజాకు జట్టులో అనూహ్యంగా స్థానం లభించడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. లక్నో తో జరిగిన మ్యాచ్ లో 57 పరుగులు చేసి జట్టుకు గొప్ప విజయాన్ని అందించాడు. అంతర్జాతీయ క్రికెట్ తోపాటు అనేక లీగ్ లు ఆడుతూ.. తనలోని సత్తాను ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. కొద్దిరోజుల కిందట పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కూడా అదరగొట్టాడు ఈ క్రికెటర్. తాజా ఇన్నింగ్స్ తో పంజాబ్ జట్టులో కీలక ప్లేయర్ గా మారిపోయాడు సికిందర్ రజా.