TSRTC Employees : కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి 5వ తేదీలోపు వేతనాలు చెల్లిస్తోంది. గతంలో ప్రతీ నెల 15వ తేదీ వరకు జీతాలు రాక ఇబ్బంది పడ్డారు. కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి వచ్చాక మొదటి వారంలోనే వేతనాలు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇక ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను కూడా క్రమంగా అమలు చేస్తోంది. ప్రభుత్వం కొలువుదీరిన 48 గంటలకే ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీలు నెరవేర్చింది. ఇటీవలే గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే వంట గ్యాస్ అందిస్తోంది. మార్చి 11న ఇందిరమ్మ ఇళ్లు, తర్వాత మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించేందుకు కసరత్తు చేస్తోంది. తాజాగా టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది.
పీఆర్సీ ప్రకటన..
టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వయించింది. 21 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ వర్తింపజేయనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన చేశారు. పీఆర్సీ అమలుతో సంస్థపై నెలకు రూ.35 కోట్ల భారం పడుతుందని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం పీఆర్సీ అమలు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.
జూన్ 1 నుంచి అమలు..
టీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుంటున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2017లో అప్పటి ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బందికి 16 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఇచ్చిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి పీఆర్సీ ఇవ్వలేదని వెల్లడించారు. ఆర్టీసీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఉద్యోగుల సంక్షేమం కోసం పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కొత్త పీఆర్సీ ఈ ఏడాది జూన్ 1 నుంచి అమలు చేస్తామని తెలిపారు. కొత్త పీఆర్సీ ప్రకారం 2017 నుంచి 21 శాతం పే స్కేలు అమలు చేస్తామని ప్రకటించారు.