Gaganyaan: ఇస్రో పట్టిందల్లా బంగారమే అవుతుంది. చంద్రుడి మీదకి పంపిన చంద్రయాన్_ 3, సూర్యుడి మీదికి పంపిన ఆదిత్య.. తాజాగా మనుషులను నింగిలోకి పంపే ప్రయోగం చేసి విజయం సాధించింది. గగన్ యాన్ మిషన్లో భాగంగా శనివారం చేపట్టిన టీవీ_డీ_1 ఫ్లైట్ టెస్ట్ విజయవంతమైంది. తొలుత రెండుసార్లు ఈ రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసిన ఇస్రో.. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు విజయవంతంగా నిర్వహించింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ప్రయోగ కేంద్రంలో సంబరాలు మిన్నంటాయి. దసరా కు రెండు రోజుల ముందే అక్కడ వేడుకలు మొదలయ్యాయి.
టీవీ_డీ_1 క్రూ మాడ్యూల్ అనుకున్నట్టే నింగిలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత బంగాళాఖాతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. పారా చూట్ల ఆధారంగా మాడ్యూల్ నీటిపై వాలింది. మూడు పారా చూట్ల సహాయంతో క్రూ మాడ్యూల్ దిగింది. సముద్రంలో ఉన్న ఇండియన్ నేవీ ఆ మాడ్యుల్ ను సేకరిస్తుందని ఇస్రో అధికారులు చెబుతున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు వాతావరణం సరిగా లేని కారణంగా ప్రయోగాన్ని ఇస్రో అధికారులు 8 గంటల 45 నిమిషాలకు వాయిదా వేశారు. అనంతరం 8గంటల 45 నిమిషాలకు చేపట్టిన టీవీ_ డీ1 ప్రయోగంలో ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. రాకెట్ ఇంజన్లో ఇగ్నిషన్ లోపం వచ్చినట్టు ఇస్రో ప్రకటించింది. ఇంజన్ మండకపోవడం వల్ల అనుకున్న సమయానికి గగన్ యాన్ మాడ్యూల్ పరీక్షను వాయిదా వేశారు. ఐదు సెకండ్ల ముందు పరీక్షను రద్దు చేశారు. అయితే ఆ పరీక్షను ఉదయం 10 గంటలకు నిర్వహించారు.
దీంతో ప్రతిష్టాత్మక గగన్ యాన్ మిషన్ కు ఎనలేని ఉత్తేజం వచ్చింది. టీవీ_డీ1 ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో చైర్మన్ సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు. సాంకేతిక లో పని త్వరగానే పసిగట్టి.. తక్కువ సమయంలో మళ్ళీ పరీక్షను విజయవంతంగా నిర్వహించడం ఆనందంగా ఉందని ఆయన ప్రకటించారు. ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియోను ఇస్రో తన ట్విట్టర్ ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేసింది. ఇస్రో పరీక్ష విజయవంతం అయ్యి గగన్ యాన్ విజయవంతంగా బంగాళాఖాతంలో ల్యాండ్ అయ్యింది..
#WATCH | Gaganyaan Mission: After the successful touch down of the crew escape module, ISRO chief S Somanath congratulates scientists pic.twitter.com/YQp6FZWXec
— ANI (@ANI) October 21, 2023