Vehicle safety rules: రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించేవారు రోడ్డు ప్రమాదాల బారిన ఎక్కువగా పడుతున్నారు. వాహనాలు ఒకదాని వెంట ఒకటి ప్రయాణించినప్పుడు ముందు వాహనం సరిగ్గా కనిపించకపోయినా.. లేక ఏదైనా వాహనం రోడ్డు పక్కన నిలిచి ఉన్నా.. ఆ వాహనాన్ని ఢీకొన్నప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటువంటి ప్రమాదాల్లో అనేక ప్రాణాలు ఇప్పటికే పోయాయి. అయితే వీటిని నివారించేందుకు రోడ్డు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల వెనుక రిఫ్లెక్టింగ్ స్టిక్కర్ తప్పనిసరిగా ఉండాలని ఈ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. అసలు ఈ రిఫ్లెక్టింగ్ స్టిక్కర్ ఎలా పనిచేస్తుందంటే?
ద్విచక్ర వాహనాలతో పాటు ఆటో, క్యాబ్ తో సహా అన్ని వాహనాలకు రిఫ్లెక్టింగ్ స్టిక్కర్లను అంటించాలని రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ఇవి వాహనాల వెనుక ఉండటం వల్ల వెనుక వచ్చే వాహనం గుర్తించవచ్చని.. దీంతో ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. రిఫ్లెక్టింగ్ స్టిక్కర్ అనేది ఒక ప్రత్యేకమైన పదార్థంతో తయారుచేస్తారు. దీనిపై లైట్ ఫోకస్ పడగానే షైనింగ్ వస్తుంది. ఈ స్టికర్ ఎక్కడ ఉన్నా స్పష్టంగా అక్కడ ఒక వస్తువు ఉన్నట్లు తెలియజేస్తుంది. ఇవి ఒకప్పుడు సైకిల్ వెనకాల ఉండేవి. ఆ తర్వాత ద్విచక్ర వాహనాల వెనుక బ్యాటరీతో లైటు ను అమర్చారు. ఆ తర్వాత లారీల వెనుక కూడా ఉంచారు. కానీ కొందరు దీనిని అమర్చుకోవడం లేదు. అంతేకాకుండా వాహనాలు నిలిపి ఉన్నప్పుడు బ్యాటరీ ఆఫ్ అయి ఉంటుంది. దీంతో వెనుక వైపు ఉన్న లైట్ వెలిగే అవకాశం ఉండదు. ఈ సందర్భంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.
అయితే ప్రతి వాహనం వెనుక రిప్లేటింగ్ స్టిక్కర్ ఉండడంవల్ల వెనుక వచ్చే వాహనం ముందు వాహనాన్ని గుర్తించవచ్చు. అంతేకాకుండా ఈ స్టిక్కర్ను వెనుక వైపు వేయడం వల్ల ఎలాంటి బ్యాటరీ గానీ అదనపు పవర్ అవసరం లేదు. అయితే ఈ స్టిక్కర్ నిబంధనలో ప్రకారంగా వేసుకోవాలి. వీటిని నెంబర్ ప్లేట్ ఏఐఎస్ 057, 090, 089 నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వీటిని రవాణా శాఖ కార్యాలయం నుండి తీసుకోవాలని.. ప్రతి స్టిక్కర్ పై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తారని అంటున్నారు. ఈ స్టిక్కర్లు ప్రతి వాహనంపై ఉండడంవల్ల ఆ వాహనం ఎక్కడ ఉందో ట్రేస్ కూడా చేసే అవకాశం ఉంటుందని తెలుపుతున్నారు త్వరలో ఈ స్టిక్కర్లు అన్ని వాహనాలకు ఏర్పాటు చేసుకునేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అయితే వీటిని కేవలం రవాణా శాఖ సంబంధిత కార్యాలయంలోనే కొనాలని అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లోకి కొత్తగా వచ్చే వాహనాలకు వీటిని ఏర్పాటు చేస్తున్నారని.. ఇప్పటికే ఉన్న వాహనాల వెనుక వాహనదారులు వాటిని అంటించుకోవాలని తెలుపుతున్నారు.