Flax Seeds: కాలం మారింది. మనం తీసుకునే ఆహారం కూడా మారింది. ఫలితంగా సగటు ఆయుర్దాయం తగ్గిపోతుంది. దీనికి తోడు ముమ్మరిస్తున్న వ్యాధులు మనిషి జీవనాన్ని సవాల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగానే పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే జీర్ణ క్రియ మెరుగుపడుతుందని.. రక్త ప్రసరణ వ్యవస్థ బాగుంటుందని.. ఇతర రుగ్మతలు కూడా తగ్గు ముఖం పడతాయని అంటున్నారు.. అయితే ఈ పీచు పదార్థం అవిసె గింజల్లో ఎక్కువగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
అయితే వెనుకటి రోజుల్లో అవిసె గింజలను ప్రధాన ఆహారంగా తీసుకునేవారు. దీనివల్ల అప్పటి మనుషులు ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పటిలాగా దీర్ఘకాలిక రుగ్మతలకు గురయ్యేవారు కాదు. కాలక్రమంలో అవిసె పంటను సాగు చేయడం తగ్గిపోయింది. దీంతో వాటిని తినడం కూడా తగ్గిపోయింది. ఉత్తరాది రాష్ట్రాలలో ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తారు కాబట్టి.. ఆ రాష్ట్రాల నుంచి అవిసె గింజలు దిగుమతి అవుతున్నాయి. వైద్యులు కూడా సూచిస్తుండడంతో వీటిని తినే వారి సంఖ్య పెరిగిపోయింది. ఇంతకీ అవిసె గింజలు తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
అవిసె గింజలు వాత, పిత్త, కఫ దోషాలను నివారిస్తాయని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. ఆయుర్వేద గ్రంథాల ప్రకారం అవిసె గింజలను త్రి దోష నివారిణిలుగా పేర్కొంటారు. ముందుగానే చెప్పినట్టు ఈ గింజలలో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. ఇది పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. దీనివల్ల మలబద్ధకం అనే సమస్య ఉండదు. అంతేకాదు తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణమయ్యేలాగా చేస్తుంది. పేగులలో అకస్మాత్తుగా కలిగే వాపును నిరోధిస్తుంది. ఈ గింజలలో ఒమేగా_3 ఫాటీ యాసిడ్స్ ఉండటంవల్ల శరీరంలో అకస్మాత్తుగా కలిగే మంటలను తగ్గిస్తాయి. ఆర్థరైటిస్ వంటి వ్యాధులను తగ్గిస్తాయి. అవిసె గింజలు రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధీకరిస్తాయి. మధుమేహంతో బాధపడే రోగులు అవిసె గింజలను ఆహారంగా తీసుకుంటే గ్లూకోజ్ క్రమబద్ధీకరణకు గురవుతుంది. దీనివల్ల మధుమేహం వ్యాధి బాధించదు.
అవిసె గింజలు లినో లెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ ఉంటుంది. గుండెపోటును నివారిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, ఇతర చెడు కొలెస్ట్రాళ్ళను తగ్గిస్తుంది. ధమనులలో రక్తం గడ్డ కట్టడాన్ని నివారిస్తుంది. అవిసె గింజలను తినడం ద్వారా శరీరానికి రోగనిరోధక శక్తి సమకూరుతుంది. విటమిన్లు శరీర వృద్ధికి సహాయపడతాయి. జుట్టు రాలడాన్ని ఇవి నిరోధిస్తాయి. చర్మం ముడతలు పడకుండా కాపాడతాయి. చర్మంలో తేమను నిత్యం సంరక్షిస్తూ ఉంటాయి.