Fake Relationships: నేటి యువతే రేపటి తరానికి మార్గదర్శకులు అని కొందరు అంటూ ఉంటారు. అంటే యవ్వనంలో చేసే కొన్ని పనులు తమ జీవితాలను మార్చడమే కాకుండా మరికొందరికి ఆదర్శంగా ఉండగలుగుతాయి. అందుకే చాలామంది యువత తమ కెరీర్ ప్లానింగ్ లో సక్సెస్ ను సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని చూస్తారు. అయితే నేటి కాలంలో యువత సక్సెస్ వైపు వెళ్తూనే మరోవైపు సంబంధాల విషయంలో భయాందోళనలతో ఉన్నట్లు కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్నారు. వీరికి ప్రేమ, ఆప్యాయత అనేవి బంధాలను పెంచకుండా దూరం చేస్తున్నాయి. అందుకు కారణం సోషల్ మీడియా అని తెలుస్తుంది. అది ఎలా అంటే?
రాము అనే ఒక వ్యక్తి ఒక అమ్మాయితో స్నేహం చేశాడు. కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయి చీట్ చేసి మరొక వ్యక్తిని ప్రేమించింది. దీంతో ఇంతకాలం ఆ అమ్మాయిపై ఎంతో ప్రేమను పంచుకున్న రాము ఆమె దూరం కావడంతో తీవ్ర మానసిక వేదనకు గురైయ్యాడు. ఇదే సమయంలో అతడు సోషల్ మీడియాలో వచ్చే బ్రేకప్ లవ్స్ వీడియోలు, సినిమాలు చూశాడు. దీంతో అతని మనసులో ప్రేమించడం అనేది పెద్ద తప్పు అనే ముద్ర పడిపోతుంది. ఫలితంగా అతడు ఎవరిపై ప్రేమ చూపకుండా.. ఎవరితో మాట్లాడకుండా ఉండగలుగుతాడు. చివరికి పెళ్లి చేసుకోవడానికి కూడా అతడికి మనసు ఒప్పదు. అయితే చాలామంది పర్సనల్ లైఫ్ లో ఇలాంటివి జరగకపోవచ్చు. కానీ సోషల్ మీడియాలో వచ్చే బ్రేకప్ లవ్ స్టోరీస్.. ఫేక్ రిలేషన్ షిప్ వీడియోలు మాత్రం యువత మనసును అల్లకల్లోలం చేస్తున్నాయి. సమాజంలో చాలామంది ప్రేమను పంచలేరు అని.. స్వార్థం కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారని ప్రచారం చేయడంతో యువత దీనిని ఎక్కువగా నమ్ముతున్నారు. ఫలితంగా వారు ఒక భాగస్వామిని ఎంచుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఎవరిని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదు? అరే భావనతో ఉండి పెళ్లికి దూరం అవుతున్నారు.
అయితే సోషల్ మీడియాలో వచ్చే బ్రేకప్ లవ్ స్టోరీస్.. ఫేక్ రిలేషన్షిప్ వీడియోలు ఒకరకంగా మంచివే అని కొందరు అంటున్నారు. ఎందుకంటే యువత ముందు జాగ్రత్తగా ఎదుటి వ్యక్తి గురించి అంచనా వేసుకుంటాడని అంటున్నారు. అంతేకాకుండా ఎవరిని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదు? అనే విషయంపై అవగాహన ఏర్పడుతుందని చెబుతున్నారు. అయితే అందరూ మాత్రం ఇలా అర్థం చేసుకోలేకపోతున్నారు. కొందరు తప్పుగా అర్థం చేసుకొని ప్రేమ, ఆప్యాయత అనేది శుద్ధ అబద్ధం అని భావిస్తున్నారు.
రిలేషన్షిప్ విషయంలోనే కాకుండా కెరీర్ విషయంలో కూడా సోషల్ మీడియాలో వచ్చే వీడియోలను చూసి తమ సొంత అంచనాలను వేసుకోలేకపోతున్నారు. మార్కెట్లో ఉండే పరిస్థితులను ముందే సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. వాస్తవానికి సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు.. వాస్తవానికి భిన్నంగా ఉంటాయి. వీటిని చూసి అంచనా వేసుకోకపోవడమే మంచిది అని కొందరు మానసిక నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా చాలామంది ఫేక్ అకౌంట్ లను ఏర్పాటు చేసి అబద్ధపు ప్రచారం చేస్తారని అంటున్నారు.