Extramarital Affairs: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు పెట్టుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. ఈ అనైతిక సంబంధాల వల్ల దారుణాలు పెరిగిపోతున్నాయి. భర్తను భార్య అంతం చేయడం.. భార్యను భర్త అంతం చేయడం వంటి ఘటనలు ప్రతిరోజు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి దారుణాలు పెరిగిపోతున్నప్పటికీ చాలామంది తమ ప్రవర్తన తీరు మార్చుకోవడం లేదు. పైగా అనైతిక సంబంధాలను ఏర్పరచుకోవడంలో ఎక్కడా లేని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ తరహా బంధాల వల్ల కుటుంబాలు కూలిపోతున్నాయి. సంసారాలు సర్వనాశనమవుతున్నాయి. పిల్లలు అనాధలుగా మారిపోతున్నారు.
వాస్తవానికి వివాహేతర సంబంధాలు పెరిగిపోవడానికి ప్రధాన కారణం క్షణిక సుఖం కోసం పరాయి పురుషుడి వైపు ఆడవాళ్లు చూడడం, పరాయి మహిళలపై మగవాళ్ళు చూడడమేనట. భావోద్వేగ అసంతృప్తి, వ్యక్తిగత అవసరాలు తీరకపోవడం, శారీరకంగా, మానసికంగా సాన్నిహిత్యం లేకపోవడం, ఏకాంతంగా మాట్లాడే అవకాశాన్ని దంపతులు సృష్టించుకోలేకపోవడం.. వంటివి వివాహేతర సంబంధాలకు దారితీస్తున్నాయని గ్లీడెన్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.. క్షణకాల ఆనందం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు కుటుంబ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేస్తున్నాయని ఆ సంస్థ అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది.
వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాలు మొత్తం సర్వనాశనం అవుతున్నాయి.. ముఖ్యంగా దంపతులు పరాయి వారి మోజులో పడి సొంత వారిని అంతం చేస్తున్నారు. వివాహేతర సంబంధం మొదట్లో బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఏదో ఒక రోజు అది బయటపడుతుంది. ఆ బయటపడిన క్రమంలో ఇంట్లో గొడవలు జరుగుతుంటాయి. ఆ గొడవలు తారస్థాయికి చేరి దారుణమైన ఘటనలకు కారణమవుతున్నాయి.
కట్టుకున్న వాళ్లను కడ తేర్చడానికి కూడా వెనకాడడం లేదంటే వివాహేతర సంబంధాలకు మనుషులు ఎంతటి బానిసలుగా మారుతున్నారో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి వివాహ బంధం అనేది అత్యంత దృఢమైనది. వివాహేతర బంధం ఎప్పటికీ నిలబడదు. పైగా సమాజంలో దానికి నైతికత కూడా ఉండదు. ఇది తెలిసినప్పటికీ కూడా మోజు అనే మోహం మనుషుల్లో నిలువెల్లా నిండిపోవడంతో ఇటువంటి అనైతిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. చివరికి చేయకూడని దారుణాలు చేస్తున్నారు. అయితే ఇటువంటి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మార్చేలా చేయవచ్చని సైకాలజిస్టులు చెబుతున్నారు.