Yoga: యోగా.. పేరుకు రెండు అక్షరాలు మాత్రమే కానీ.. దీనిని రోజూ సాధన చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. రక్త ప్రసరణ వ్యవస్థ నుంచి మొదలుపెడితే జీర్ణ క్రియ వరకు.. ఎన్నో వాటిపై ఇది ప్రభావం చూపిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులకు పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది. అందుకే యోగాను చేయాలని వైద్యులు చెబుతుంటారు.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి సిఫారసు కూడా చేస్తుంటారు. ఎన్నో ప్రయోజనాలు చేకూర్చే యోగా.. రాలిన జుట్టును తిరిగి పెరగడంలో సహాయపడుతుంది. ఇలా జరగాలంటే ఐదు యోగాసనాలు కచ్చితంగా వేయాల్సి ఉంటుంది.
అధో ముఖ ఆసనం
నడుమును వంచాలి. తలభాగాన్ని కిందికి ఆనించి.. చేతులను నేలతో తాకాలి. అలా అలా చేయడం వల్ల తలకు రక్తప్రసరణ సరిగ్గా అవుతుంది. దీనికి తోడు అది తలలోని కురులను ప్రేరేపిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. ఇలా చేయడం వల్ల తలభాగం రిలాక్స్ మోడ్ లోకి వెళ్తుంది.
ఉత్తనాసనం
ఈ ఆసనంలో రెండు పాదాల బొటన వేళ్లను రెండు చేతుల మణి బంధాలకు ఆనించాలి. రెండు అరచేతులను సమాంతరంగా నేలను తాకనివ్వాలి. ఇలా చేస్తే జుట్టు కుదుళ్లకు సరైన పాళ్ళల్లో ఆక్సిజన్ అందుతుంది. ఫలితంగా అది జుట్టు పెరగడానికి దోహదపడుతుంది. ఈ ఆసనం వల్ల కుదుళ్లు కూడా బలంగా మారతాయి.
సర్వాంగన ఆసనం
ఈ ఆసనంలో రెండు చేతులతో నడుము భాగాన్ని పట్టుకోవాలి. తల భాగాన్ని కింద ఆనించాలి. రెండు కాళ్ళను 90 డిగ్రీల కోణంలో వంచాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు రక్తప్రసరణ సక్రమంగా అవుతుంది. జుట్టు ఆకృతి కూడా మెరుగుపడుతుంది. శిరోభారం కూడా తగ్గుతుంది.
సేతు బంధనం
ఇందులో భుజాలను, తలను ఒకే దిశలో ఉంచాలి. రెండు కాళ్ళను సమాంతరంగా ఉంచుతూ నడుము భాగాన్ని పైకి లేపాలి. అటు కాళ్లు, ఇటు భుజాల సపోర్టుతో నడుము భాగాన్ని పైకి లేపడం వల్ల జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను పనితీరును మెరుగుపరచవచ్చు. అంతేకాదు ఈ ఆసనం వల్ల చెమట రూపంలో మలినాలు బయటికి వెళ్తాయి.
శీర్షాసనం
ఈ ఆసనంలో తలను కిందపెట్టి.. రెండు చేతులను ఊర్ధ్వముఖంలో తిప్పి రెండు కాళ్ళను పైకి లేపుతారు. దీనివల్ల తలకు మెరుగ్గా రక్తప్రసరణ అవుతుంది.. జుట్టు కుదుళ్ళు కూడా కొత్త బలాన్ని సంతరించుకుంటాయి. దీనివల్ల జుట్టు రాలడం చాలావరకు తగ్గిపోతుంది.
(మాకు అందిన సమాచారం మేరకే ఈ కథనాన్ని మీకు అందించాం. జుట్టు రాలే సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదిస్తే మంచిది. ఈ ఆసనాలు వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు)