Husband and wife relationship : తెంచుకుంటె తెగిపోతుందా దేవుడు వేసిన బంధం అన్నారో సినీకవి. భార్యాభర్తల మధ్య అనుబంధం అలాంటిదే మరి. జీవితాంతం తోడు నీడలో ఉండే భార్యాభర్తల్లో ఎలాంటి అపార్థాలు, అపోహలు ఉండకూడదు. ఇద్దరు సమానమనే భావం ఉండాలి. భర్త కోరికలను భార్య గౌరవించాలి. భార్య ఆలోచనలను భర్త పాటించాలి. అప్పుడే వారి సంసారం మూడు ముద్దులు ఆరు కౌగిళ్లలా సాఫీగా సాగుతుందనడంలో సందేహం లేదు. అంతేకాని ఇద్దరి మధ్య ఏవో అసూయలు పొడచూపితే సంసారమే నాశనం అవుతుంది. నేను ఎక్కువ అనే అహం వద్దు. దాంతో చాలా వరకు నష్టాలే కలుగుతాయి. ఆలుమగల మధ్య అరమరికలకు తావు ఉండకూడదు. అపార్థాలకు నెలవుండకూడదు. అప్పుడే వారి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంసారం చురుగ్గా ముందుకు పోతుంది.

కొందరు భార్యలు భర్తలకంటే తామే ఎక్కువ అనే ఫీలింగ్ లో ఉంటారు. అది తప్పు. సంసారమనే కావడిలో భార్యాభర్తలు రెండు కావడి కుండలు. ఇద్దరు సమానమే. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే వాదన వస్తే అంతేసంగతి. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఇద్దరు చెరో దారికి చేరడం సహజమే. సంసారాన్ని ఓర్పుగా చేయాలి. ఆడవారికి భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుంది అంటారు. అందుకే భర్తను సంతోషపెట్టేందుకే భార్య ఎప్పుడు సిద్ధంగా ఉండాలి కానీ ఏవో సూటిపోటి మాటలతో వేధిస్తే భర్త మనసు చివుక్కుమంటుంది. ఫలితంగా సంసారం కుక్కలు చింపిన విస్తరి కావడం సహజం.
ఎప్పుడైనా భర్త తినేటప్పుడు ఇంటి సమస్యలు చెప్పకూడదు. అలా చేస్తే భర్త భోజనం సగంలోనే ఆపేస్తాడు. దీంతో అర్దాకలితో ఏం తోచదు. తినేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి. భర్తకు ఏది ఇష్టమో దాన్ని వండి పెట్టి భర్త సంతృప్తిగా భోజనం చేసేలా చూడాలి. తనకిష్టమైనవేవో వండి పెడితే బాగా భోజనం చేసి మంచి ఉద్దేశంతో భార్యను దగ్గరకు తీసుకుంటాడు. అంతేకాని చిన్న చిన్న విషయాలకు చిర్రుబుర్రులాడితే మొదటికే మోసం వస్తుంది. సంసారం చేయడం కూడా ఓ కళ. అది అందరికి సాధ్యం కాదు. దానికి మనసుండాలి. సహనం కావాలి.
భార్య ఎప్పుడైనా భర్త అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. కానీ నేనే ఎక్కువ అనే అహంకారంతో ఉంటే నష్టమే. భర్త ఏదైనా తప్పు చేసినా అది తప్పు అని చెప్పకుండా దాని వైపు పోకుండా చూసుకోవాలి. అంతేకాని భర్త ఏదో చేస్తున్నాడు నేను కూడా చేస్తానంటే నీ ఇల్లే గుల్ల అవుతుంది. జాగ్రత్తగా మసలుకుంటేనే సంసారం నూరేళ్లపాటు హాయిగా ఉంటుంది. లేదంటే నిన్ను నీ కుటుంబాన్ని దహిస్తుంది. అంతటి పవర్ ఉంటుంది సంసారంలో. అందుకే సంసారంలో ఎంత ఒదిగి ఉంటే అంత విలువ నీకే వస్తుంది. సో భార్యలు భర్తలకు అనుగుణంగా మసలుకుని సంసారాన్ని చల్లగా చేసుకునేందుకు ప్రయత్నించండి. భర్తలు భార్యల అభిప్రాయాలు గౌరవించండి. ఇద్దరు అన్యోన్యంగా కలకాలం జీవించి ఆదర్శమూర్తులకు పేరుతెచ్చుకోండి.