children : ఈమధ్య కాలంలో అమ్మాయిలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ మహిళలు భయంతో బతుకుతున్నారు. ఒంటరిగా ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. తాజాగా ఓ ట్రైనీ డాక్టర్‌ను అత్యాచారం చేసి చంపేసిన ఘటన తెలిసిందే. కేవలం బయట మాత్రమే కాకుండా సొంత ఇంట్లో కూడా ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. అక్కా, చెల్లి, అమ్మ అనే తేడా లేకుండా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. అయితే మన పిల్లలను మనం చిన్నప్పటి నుంచే జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్లకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పాలి. ఎవరూ ఎక్కడ ఎలా ప్రవర్తిస్తారో.. ఎలా జాగ్రత్తపడాలో కూడా మీ పిల్లలకు మీరే బోధించాలి. అప్పుడే వాళ్లు గుడ్ టచ్ ఏదో, బ్యాడ్ టచ్ ఏంటో తెలుస్తుంది.
సాధారణంగా పిల్లలు ఐదు నుంచి ఆరేళ్లకు వస్తే కొన్ని విషయాలు అర్థం అవుతాయి. కాబట్టి ఆ వయస్సు నుంచే పిల్లలకు గుడ్ టచ్ ఏంటి? బ్యాడ్ టచ్ ఏంటి? చెప్పాలి. ఛాతీ, పెదాలు, తొడలు, జననేంద్రియాలను ఎవరూ టచ్ చేసిన అది బ్యాడ్ టచ్ అని చెప్పండి. ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే ఇంట్లో అమ్మకి లేదా నాన్నకి తెలియజేయాలని చెప్పాలి. ఎవరైనా చనువుగా ప్రవర్తించినా ఒప్పుకోవద్దని చెప్పండి. వాళ్ల టచ్‌లో ఏమైనా తేడా అనిపిస్తే ముట్టుకోవద్దని చెప్పండి. ఆరోగ్య సమస్యల రీత్యా వైద్యుడు టచ్ చేస్తే పర్లేదు. అయితే ఇలాంటి సందర్భాల్లో కూడా కొందరు దుండగులు ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలని పిల్లలకు చెప్పండి. కొంతమంది ప్రేమతో బుగ్గలు గిల్లుతుంటారు. మరికొందరు కామంతో గిల్లుతుంటారు. ఇలా ఎవరైనా చేస్తే వెంటనే వాళ్లకు బుద్ధి చెప్పమని చెప్పండి.
పిల్లలను ఎవరైనా ముట్టుకుంటే అసౌకర్యంగా అనిపిస్తే తల్లిదండ్రులకు చెప్పమని చెప్పండి. అలాగే బయట వాళ్లు పిల్లలకు ఎవరైనా చాక్లెట్, బిస్కెట్ ఇస్తే వద్దని చెప్పమని చెప్పండి. కచ్చితంగా మీ పిల్లలకు నో చెప్పడం నేర్పించండి. ఎందుకంటే కొందరు మత్తు పదార్థాలను ఇవ్వచ్చు. కాబట్టి ఏం ఇచ్చిన తీసుకోవద్దని చిన్నప్పటి నుంచే నేర్పించాలి. బలవంతంగా ఎవరైనా ముట్టుకోవడానికి ప్రయత్నించిన, ఏదైనా తప్పు జరిగినా వెంటనే తల్లిదండ్రులకు చెప్పేలా నేర్పించండి. పిల్లలతో కోపంగా, భయపెడుతూ ఉండకుండా ఫ్రెండ్లీగా ఉండండి. ఇలా ఉండటం వల్ల వాళ్లు ఏ విషయం చెప్పడానికి అయిన వెనుకాడరు. రోజూ ఒక పది నిమిషాలు వాళ్ల పక్కన కూర్చోని మాట్లాడండి. అన్ని విషయాలు అడిగి తెలుసుకోండి. ఇలా మాట్లాడటం వల్ల వాళ్లు మిమ్మల్ని నమ్ముతారు. దీంతో రోజులో జరిగినా లేకపోతే ఎవరైనా ఇబ్బంది పెట్టిన మీతో షేర్ చేసుకోగలరు. అలాగే మీ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి లైంగిక వేధింపులకు గురవుతుందో లేదో కూడా ఒక తల్లిగా మీరే తెలుసుకోవాలి. కాబట్టి పిల్లలను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకోండి.