Dasara 2023: పాలపిట్ట.. తెలంగాణ రాష్ట్ర పక్షి. దసరా పండుగ రోజున పాలపిట్టను చూడటం తెలంగాణ ప్రజల ఆచారం. పాలపిట్టను శుభ సూచకంగా భావిస్తారు. దీని వెనుక ఓ ఆసక్తికర కారణం ఉంది. అంతేకాదు.. విజయదశమి రోజు పాలపిట్ట కచ్చితంగా కనిపిస్తుంది. దసరా రోజున పాలపిట్టను చూడటాన్ని ప్రజలు ఎంతో అదృష్టంగా, శుభ సూచకంగా భావిస్తారు. ఈ సంప్రదాయం వెనుక ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.
విజయాలకు చిహ్నంగా..
తెలంగాణలో పాలపిట్టకు అత్యంత ప్రాధాన్యం ఉంది. దసరా రోజున పాలపిట్టను చూడటం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ అరుదైన పక్షి.. విజయ దశమి నాడు కచ్చితంగా దర్శనమివ్వడం మరో ప్రత్యేకత. ఈ పర్వదినం రోజున ఊరు శివార్లలోని పంట పొలాల్లో తళుక్కున మెరిసి జనాలకు ఆహ్లాదాన్ని పంచుతుంది. తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టను శుభాలకు, విజయాలకు చిహ్నంగా భావిస్తారు. దసరా రోజున పాలపిట్టను చూడటాన్ని ప్రజలు ఎంతో అదృష్టంగా, శుభ సూచకంగా భావిస్తారు.
పాలపిట్ట ప్రాముఖ్యత వెనుక ఓ కథ..
పూర్వం పాండవులు అరణ్య వాసాన్ని ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా.. పాలపిట్ట కనపడిందట. ఆరోజు కూడా విజయదశమి కావడం గమనార్హం. నాటి నుంచి పాండవులకు అన్నీ విజయాలే సిద్ధించాయని చెబుతారు. ఆ తర్వాత విజయదశమి రోజున మగవాళ్లు అడవికి వెళ్లి పాలపిట్టను చూడటం అలవాటుగా చేసుకున్నారట. అలా ఈ సంప్రదాయం వచ్చిందని పెద్దలు చెబుతారు. విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని.. చేపట్టిన ప్రతీ పనిలో విజయం చేకూరుతుందని ప్రజల నమ్మకం. అందుకే దసరా రోజున పాలపిట్టను చూడటానికి అంత ప్రాధాన్యం ఏర్పడింది.
పాలపిట్టను గుర్తించడం ఎలా..
నీలం, పసుపు రంగుల కలబోతలో పాలపిట్ట చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. సాంస్కృతికంగా, పురాణాల పరంగా ఇంతటి ప్రాధాన్యం ఉన్న పాలపిట్టకు మన రాష్ట్ర పక్షిగా గౌరవం ఇచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, బిహార్ రాష్ట్రాల అధికార పక్షి కూడా పాలపిట్టే కావడం విశేషం.
కనుమరుగవుతున్న అరుదైన పక్షి..
అడవులతో పాటు ఇప్పుడు పాలపిట్ట జాడ కూడా కనుమరుగవుతోంది. ఊళ్ల్లలో అక్కడక్కడా ఓ మెరుపు మెరుస్తున్నట్టు కనిపిస్తున్నా.. నగర శివార్లలో మాత్రం పూర్తిగా కనుమరుగైపోయాయి. మరోవైపు.. దసరా రోజున పాలపిట్టను తప్పనిసరిగా చూడాలనే ప్రజల విశ్వాసాన్ని కొంత మంది సొమ్ము చేసుకోవడానికి చూస్తున్నారు. పాలపిట్టను పంజరాల్లో బంధించి తీసుకొచ్చి.. శుభాలు కలుగుతాయంటూ ప్రజలకు చూయించి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. మరికొంత మంది దసరా పండుగ రోజున పాలపిట్టలను కొని.. వాటిని ఊరి చివరన పొలాల మధ్య విడిచి పెడుతుంటారు. అలా చేస్తే తమకు అంతా శుభమే కలుగుతుందని వారి నమ్మకం.