
Akshaya Thrutiya : అక్షయ త్రుతీయ కు మన సనాతన ధర్మంలో ఎంతో ప్రాశస్త్యం ఉంది. వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో మూడవ తిథిని అక్షయ త్రుతీయ అంటారు. దీనికి ఎంతో పవిత్రత ఉంది. పవిత్రమైన ముహూర్తంలో దీన్ని జరుపుకుంటాం. ఈ రోజు మనకు అత్యంత పుణ్యం లభించే రోజుగా కూడా చెబుతారు. మనకు మంచి జరగాలంటే ఈ రోజు కొన్ని దానాలు చేయడం వల్ల మనకు మంచి ఫలితాలు సిద్ధించడం ఖాయం.
ఈ రోజు వస్త్రదానం చేయడం చాలా మంచిది. పేద వారికి బట్టలు దానం చేయడం ద్వారా మనకు పుణ్యం కలుగుతుంది. లక్ష్మీదేవి విష్ణువును ప్రసన్నం చేసుకునే రోజు కావడంతో ఈ రోజు చేసే దానాలకు మంచి విలువ ఉంటుంది. ఇంకా ఈ రోజు ధాన్యం దానం చేయడం వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది. ధాన్యం దానం చేయడం వల్ల మన ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
మట్టి కుండలను కూడా దానం చేయొచ్చు. దీంతో మనకు వ్యతిరేకంగా ఉన్న గ్రహాలు అనుకూలంగా మారతాయి. రాగిపాత్రలో నీరు ఉంచి తరువాత దానం చేయడం వల్ల కూడా మనకు ఎంతో పుణ్యం కలుగుతుంది. ఇలా చేయడం వల్ల మన జాతకంలో దోషాలు ఉంటే తొలగిపోతాయి. లక్ష్మీదేవి దయ మన మీద ఉంటుంది. అందుకే ఈ దానాలు చేయడం వల్ల మనకు ఎంతో పుణ్యం వస్తుందని నమ్మకం.
ఆహార పదార్థాలైన బెల్లం, శనగలు, ఉప్పు, నువ్వులు, దోసకాయ, బియ్యం, పిండి వంటివి దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. పుస్తకాలు లేదా విద్యా సామగ్రిని కూడా దానం చేయాలి. పంచాంగం దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇలా ఈ రోజు చేసే దానాలలో మనకు ఎన్నో లాభాలు ఉంటాయని పురాణాలు ఘోషిస్తున్నాయి.