Turmeric Benefits: ఇప్పటి జనరేషన్ వాళ్లు తమ అనారోగ్యకరమైన ఆహారపు తలవాట్లు మరియు హడావిడి జీవనశైలి కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒకప్పుడు మనం తీసుకునే ఆహారమే మనకు సర్వరోగ నివారిణిగా పనిచేసేది. కానీ ఇప్పుడు చాలామంది వంట ఇంటిలో దొరికేటటువంటి ఔషధాలను విస్మరిస్తున్నారు. అలా అందరూ వాడడం మరచిపోతున్న ఒక దివ్య ఔషధం పసుపు. పసుపు చెట్టుని ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ గా కూడా మనం ఇంటి ముందు లేక టెర్రస్ పైన పెంచవచ్చు. ఈ చెట్టు వల్ల ఎటువంటి క్రిములు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి.
చాలామంది దృష్టిలో పసుపు అనేది కేవలం కూరల్లో రంగు ఇవ్వడం కోసం వాడేది. కానీ పసుపులో పలు రకాల వ్యాధులతో పోరాడే సుగుణాలతో పాటు శరీరాన్ని దృఢంగా చేసే తత్వాలు ఉన్నాయి అని తెలియదు. పసుపులో ఉన్నటువంటి యాంటీబయోటిక్ లక్షణాలు కారణంగా శ్వాసకోశ సమస్యలు తలెత్తే ఆస్కారం ఉండదు. రెగ్యులర్గా పసుపును తీసుకునే వారికి శరీరంలో పలు రకాల క్యాన్సర్లు వచ్చే ఆస్కారం తగ్గుతుంది.
తలనొప్పి దగ్గర నుంచి కీళ్లనొప్పి వరకు పలు రకాల సమస్యలకు ఇంటి చిట్కాగా పసుపుని వాడేవారు. నల్ల మిరియాలు పసుపు కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో వాపు ,మంట ,దురదలు వంటివి క్రమంగా తగ్గుతాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు పాలలో చిటికెడు పసుపు కలిపి ఇవ్వడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు తలెత్తవు. డయాబెటిస్తో బాధపడే వారికి కూడా పసుపు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. క్యాన్సర్ లేఖ ట్యూమర్ సెల్స్ పెరగకుండా నిరోధించడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది.
పసుపు కేవలం ఆరోగ్యానికే కాదు సౌందర్యానికి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కూరలో ఎక్కువ పసుపు వేసుకోవడం కుదరదు కాబట్టి.. మీరు తీసుకునే గ్రీన్ టీ, జీలకర్ర వాటర్, పాలు లాంటి పదార్థాలలో కాస్త పసుపు కలిపి సేవిస్తూ ఉంటే చర్మం లోని మృత కణాలు తొలగి కాంతివంతంగా మారుతుంది. సున్ను పిండిలో కాస్త పసుపు కలిపి వాడడం వల్ల చర్మం మీద అవాంఛిత రోమాలు సులభంగా తొలగిపోతాయి.శరీరానికి దృఢత్వంతో పాటు అందాన్ని కూడా ఇచ్చే పసుపును తప్పనిసరిగా మీ డైట్ లో భాగంగా చేసుకోండి.