Kisan Credit Card: దేశానికి వెన్నెముక రైతు. ఈ రైతు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి. రైతు శ్రేయస్సు కోసం.. వారికి అవసరాల కోసం ఆర్థిక సాయం చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం PM KISAN SAMMAN YOJANA పథకం ద్వారా ప్రతీ ఏటా రైతులకు రూ.6,000 సాయం చేస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరిట రూ.12,000 అందిస్తోంది. అయితే రైతులు అదనపు ఆదాయం పొందేందుకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పేందుకు పంట రుణంతో పాటు ఇతర రుణాలను అందిస్తోంది. ఇవే కాకుండా అత్వవసర సమయంలో డబ్బు పొందేందుకు Kisan Credit Card ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అసలు ఈ కిసాన్ క్రెడిట్ కార్డు అంటే ఏమిటి? దీనిని ఎవరు పొందవచ్చు? దీనిని ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం.. 2024 డిసెంబర్ నెల వరకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.10.05 లక్షల కోట్ల రుణాలను అందించారు. దేశ వ్యాప్తంగా 7.72 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు. రైతులు వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు. పంట కోసం దీని నుంచి రుణం తీసుకోవడంతో పాటు గృహ అవసరాల కోసం కూడా నగదును ముందస్తుగా తీసుకోవచ్చు. అయితే ఈ కార్డులో ఉన్న లిమిట్ తో పాటు నిబంధనల ప్రకారం మాత్రమే వాడుకోవాలి.
కిసాన్ క్రెడిట్ కార్డులు సొంతంగా భూమి ఉన్న వారితో పాటు కౌలు రైతులు, పంట వాటాదారులు కూడా పొందవచ్చు. స్వయం సహాయక బృందాలు లేదా ఉమ్మడి బాధ్యత బృందాలకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తారు. కిసాన్ క్రెడిట్ కార్డును పొందాలంటే సమీపంలోని బ్యాంకును సంప్రదించాలి. లేదా ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ ఉన్న వారు ఆయా బ్యాంకు మేనేజర్ ను సంప్రదించాలి. కిసాన్ క్రెడిట్ కార్డు పొందాలంటే రెండు పాస్ ఫోర్ట్ సైజ్ ఫొటోలు, ఓటరు లేదా ఆధార్ గుర్తింపు కార్డు, భూమి పత్రాలు, పండించిన పంటలకు సంబంధించిన వివరాలను అందించాల్సి ఉంటుంది.
కిసాన్ క్రెడిట్ కార్డు పొందేవారు 18 నుంచి 75 సంవత్సరాల వయసు ఉండాలి. 12.5 ఎకరాల భూమి ఉన్న వారందరూ అర్హులే. ఈ కార్డు ద్వారా రుణం తీసుకుంటే 7 శాతం వడ్డీ రేటు విధిస్తారు. ఈ కార్డు ఉన్న వారు మరణించినట్లయితే రూ.50,000 వరకు బీమా కవరేజీని కల్పిస్తారు. అయితే ఈ కార్డుపై రుణం తీసుకున్న వారు ప్రతీ ఆరు నెలలకు ఒకసారి తిరిగి చెల్లించాలి. లేకుంటే దీనిపై వడ్డీ భారం అధికంగా ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డు విషయంలో సందేహాలుంటే 155261ఉ1800115526 అనే నెంబర్ కు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఆన్ లైన్ గురించి అవగాహన ఉన్న వారు ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత బ్యాంకు యాప్ లోకి వెళ్లి కిసాన్ క్రెడిట్ కార్డు అనే ఆప్షన్ ఉంటే దానిపై క్లిక్ చేయాలి. ఆ తరువాత ఓ ఫాం వస్తుంది. దానిని నింపి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.