Chanakya niti: నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. మన నోటితోనే మనం శత్రువులను తయారు చేసుకుంటాం. మిత్రులను కాపాడుకుంటాం. మనం మాట్లాడే మాటే మనకు అనుకూల, ప్రతికూలతలు తీసుకొస్తుంది. మాట తూటాకంటే బలమైనది. ఆచార్య చాణక్యుడు మనం శరీరంలోని భాగాలతో పాటు నోరును కూడా అదుపులో ఉంచుకోవాలి. లేదంటే మనకు ఇబ్బందులు తప్పవు.
అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు అనేది ఓ హీరో చెప్పిన మాట అక్షరాలా నిజమే. మనం మాట్లాడే మాటతోనే మనల్ని ఇష్టపడుతుంటారు. మనం మంచి మాటలు మాట్లాడితే గౌరవిస్తారు. చెడు మాటలు మాట్లాడితే అసహ్యించుకుంటారు. ఏదైనా మన నోటితోనే జరుగుతుంది. అందుకే నోరు పరిమితిలో లేకపోతే ప్రమాదమే.
స్నేహితులు, బంధువులు మనల్ని బాగా చూసుకుంటున్నారంటే అది మన మాట వల్లే. మనం పరుష పదజాలాన్ని వాడితే అంతేసంగతి. మన ఉనికి ప్రమాదంలో పడినట్లే. దీంతో మనం మాట్లాడే మాట పదునుగా ఉండకూడదు. ఎందుకంటే మనం మాట్లాడే మాట ఎదుటి వారిని ఇబ్బందులకు గురిచేయడం మంచిది కాదు. దీని వల్ల ముప్పు ఏర్పడటం ఖాయం.
మన మాట మనకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. అన్నా అంటే అన్నం దొరుకుతుంది. అరేయ్ అంటే తన్నులు తప్పవు. రెండింటికి తేడా అదే. అమ్మా అంటే బిడ్డా అంటారు. నీ అమ్మ అంటే వీపు పగులగొడతారు. అందుకే మనం మాట్లాడే భాష సరళంగా ఉండాలి. ఎవరిని బాధలకు గురిచేయకుండా ఉండాలి. చాణక్యుడు అదే చెబుతుంటాడు. మన మాటే మనకు రక్షణగా ఉంటుందని సూచిస్తాడు.