Chanakya Niti: ఆచార్య చాణక్యుడు మనకు ఎన్నో విషయాలు తెలియజేశాడు. మన జీవితంలో ఎదురయ్యే బాధలకు మన ప్రవర్తనే కారణమని చెబుతాడు. మనం మన జీవన మార్గంలో ఎవరిని నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ఏ గుణాలు ఉన్నవారు మంచివారు అనేదానిపై ఎన్నో విషయాలు వివరించాడు. ఆనాడు చాణక్యుడు చెప్పిన సత్యాలే నేటికి మనక ఆచరణీయంగా ఉంటున్నాయి. మనిషి స్వభావం గురించి చాణక్యుడు ఎన్నో విధాలుగా మనకు తెలియజేశాడు. ఒకరిని ఎలా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? అనే విషయాల్లో స్పష్టంగా చెప్పాడు. మనషి నడవడికలో దాగి ఉన్న రహస్యాలు బట్టబయలు చేశాడు. మనిషిలో లోపల దాగి ఉన్న గుణాల రహస్యాలను చేధించాడు. అతడు చూపిన మార్గాల ప్రకారమే మన నడవడిక ఉంటే మనకు జీవితంలో కష్టాలు ఎదురు కావు.

అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఒక మెతుకు పిసికితే చాలు తెలుస్తుంది. అలాగే మనిషి స్వభావాన్ని అంచనా వేయడంలో కూడా అతడి గుణాన్ని అంచనా వేస్తే సరిపోతుంది. అతడు ఎంత సమర్థుడో ఎంత మంచివాడో తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు పెట్టాల్సిందే. ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తిని నమ్మాలంటే కొన్ని విషయాలు తప్పనిసరిగా పరీక్షించాలని భావించాడు. వారి స్వభావం, లక్షణాలను సులభంగా అర్థం చేసుకోవడం ద్వారా అతడి గురించి మనకు తెలుస్తుంది. దీంతో మనం మోసపోకుండా ఉండొచ్చని వివరించాడు.
ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే త్యాగం, అందులో అతడి పాత్ర, లక్షణాలు, కర్మలు వీటిని గురించి తెలుసుకుంటే అతడి గురించి మనకు విశదంగా తెలుస్తుంది. ప్రతి వ్యక్తిలో మంచి, చెడు లక్షణాలు ఉంటాయి. సోమరితనం, గర్వం లేదా తరచుగా అబద్ధం చెప్పే అలవాటు ఉన్న వ్యక్తులను ఎట్టిపరిస్థితుల్లో కూడా నమ్మొద్దు. ప్రశాంతంగా, గంభీరంగా, వాస్తవాలను మాట్లాడే వారిని మాత్రమే నమ్మాలి. వారే మనకు హితులుగా ఉంటారు. అంతే కాని ఎవరిని పడితే వారిని నమ్మితే మనకే నష్టం వస్తుంది.
ఎవరైతే ఇతరులకు సంతోషం కలిగేందుకు తమ ఆనందాలను త్యాగం చేస్తారో అలాంటి వారిని నమ్మొచ్చు. అంతేకాని స్వార్థం కోసం తన సుఖం కోసమే పరితపించే వారిని నమ్మకండి. అలాంటి వారితో జాగ్రత్తగా ఉంటేనే మంచిది. వారితో స్నేహం చేస్తే మనకే నష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో మనుషులకంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. మనం ఎవరినైనా పరీక్షించాలనుకుంటే వారికి కొంత డబ్బు అప్పుగా ఇస్తే సరైన సమయంలో తిరిగి ఇస్తే మంచి వారు లేదంటే కాదని నిర్ధారించుకోండి.

ఇలా ఆచార్య చాణక్యుడు మనిషిలోని మంచి లక్షణాలను బేరీజు వేశాడు. మానవత్వం ఉన్న వారితో స్నేహం చేయాలని సూచించాడు. స్వార్థపూరిత ఆలోచనలతో ఇతరులను మోసం చేసే వారిని అసలు నమ్మొద్దు. మంచి గుణాలు ఉన్న వారితోనే స్నేహం చేస్తే మనకు కూడా మంచిపేరు వస్తుంది. అంతేకాని దుర్బుద్ధి ఉన్న వారిని చేరదీస్తే మనకు కూడా చెడ్డపేరు రావడం ఖాయం. అందుకే దుష్టులకు దూరంగా ఉండమని చెబుతుంటారు. ఆచార్య చాణక్యుడి సూచనల మేరకు మంచివారితో స్నేహమే మనకు పరమ ఔషధం లాంటిది.