Buying New Car: కారు.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నిత్యావసరంగా మారుతోంది. దీంతో అప్పో సప్పో చేసి కారు కొనుగోలుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. దీంతో నాలుగేళ్లుగా కార్ల కొనుగోళ్లు పుంజుకున్నాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్లలో ఏది కొనుగోలు చేయాలి, ఏ వేరియంట్ ఎంచుకోవాలి.. వంటి ఆలోచనలు కొంత ఒత్తిడికి గురిచేస్తున్నాయి. దీని కోసం చాలా మంది నిపుణులను లేదా కార్ల యాజమానులను సంప్రదిస్తున్నారు. అయినా ఒక్కోసారి సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. కొనుగోలు చేశాక తప్పుడు నిర్ణయం తీసుకున్నామా అని బాధపడుతున్నారు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లేదా మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్లలో చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
నిపుణులు ఏమంటున్నారంటే..
ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ విషయంలో నిపుణులు కూడా వివిధ అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్లు రెండింటిలో కొన్ని లాభాలు, నష్టాలు ఉన్నాయి. రెండింటి గురించి పూర్తి అవగాహన ఉంటే ఎంపిక చేసుకోవడం సులభం అవుతుంది.
తక్కువ ధరలో..
ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగిన కార్ల కంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ కలిగిన కార్ల ధర కాస్త తక్కువగా ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ కార్ల నిర్వహణ కూడా చౌకగా ఉంటుంది. ఫలితంగా మాన్యువల్ కార్లుతో డబ్బు కొద్దిగా ఆదా అవుతుంది. సుమారు 15 శాతం ఇంధనం ఆదా అవుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న అధునాత ఆటోమేటిక్ గేర్బాక్స్ కలిగిన కార్లు.. మాన్యువల్ గేర్బాక్స్ వేరియంట్ తరహాలోనే సుమారుగా మైలేజ్ ఇస్తున్నాయి.
మైలేజీ, మెయింటనెన్స్ ముఖ్యం..
మధ్య తరగతి కుటుంబాలు ప్రస్తుతం కార్లు ఎక్కువగా కొంటున్నాయి. ఒకప్పుడు సంపన్నుల ఇళ్లకే పరిమితమైన కారు.. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఇళ్ల ముందు కూడా పార్క్ చేసి ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కారు ఎంపికలో రెండు అంశాలకే వీరు ప్రాధాన్యం ఇస్తున్నారు. మైలేజ్, మెయింటనెన్స్ విషయంలో ఎక్కువ దృష్టిపెడుతున్నారు. కొంతమంది కంఫర్ట్, ఇంకొంతమంది ఎక్కువ మంది ఉండే వాహనం కోసం చూస్తున్నారు. ఆదాయం, ఖర్చు బేరీజు వేసుకుని తుది నిర్ణయం తీసుకుంటున్నారు.