New Car: కొత్త కారు కొంటున్నారా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

మీరు ఏ కారు కొనాలో నిర్ణయించుకున్న తరువాత.. సాధ్యమైనంత వరకు మీకు అందుబాటులో ఉన్న అందరు కారు డీలర్లను సంప్రదించండి. వాళ్లలో మీకు మంచి డీల్‌ ఇచ్చే వాళ్లను ఎంచుకోండి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి.

Written By: Sekhar Katiki, Updated On : October 19, 2023 3:29 pm

New Car

Follow us on

New Car: దసరా పండుగ సమీపిస్తోంది. వాహనాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఎవరి అవసరం మేరకు ఆరు వాహనాల కొనుగోళ్లు జరుపుతున్నారు. ఆర్థిక స్థితి, రుణ సదుపాయం తదితర అంశాలు కూడా వాహనం కొనుగోలును ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు చాలా మంది కారుపై దృష్టి పెడుతున్నారు. మీరు కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? హాయిగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్యామిలీతో కలిసి విహరించాలని కోరుకుంటున్నారా? అయితే కొత్తగా కారు కొనే ముందు కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోవాలి.

కారు కొనుగోలుకు ప్రత్యేక ప్రాసెస్‌..
కొత్త కారు కొనుక్కోవాలని మనలో చాలా మందికి ఉంటుంది. అందుకోసం ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును వెచ్చిస్తూ ఉంటారు. అయితే ఇంత భారీ మొత్తంలో ఖర్చుపెట్టి కారు కొనేటప్పుడు కొన్ని కీలకమైన విషయాలు తెలుసుకోవాలి. భారతదేశంలో కొత్త కారు కొనుగోలు చేసేందుకు ఒక ప్రత్యేకమైన ప్రాసెస్‌ ఉంటుంది. దీనికి ఎంతో సమయం, శ్రమ, డబ్బు ఖర్చు అవుతుంది. అంతే కాదు కొత్త కారు కొనే ప్రక్రియలో అనేక దశలు కూడా ఉంటాయి. వీటి గురించి చాలా మందికి సరైన అవగాహన కూడా ఉండదు. అలాంటి వారు తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవీ..

ఎలాంటి కారు అవసరం?
కొత్త కారు కొనేముందు కచ్చితంగా మీకు ఎలాంటి కారు అవసరముందో చూసుకోవాలి. మీ బడ్జెట్, కుటుంబసభ్యుల సంఖ్య, డ్రైవింగ్‌ అలవాట్లు మొదలైన అంశాల ఆధారంగా ఎలాంటి కారు తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. అదే విధంగా మీకు హ్యాచ్బ్యాక్‌/ సెడాన్‌/ఎస్‌యూవీ/ ఎంవీపీ కార్లలో ఏది కావాలో నిర్ణయించుకోవాలి.

హ్యాచ్బ్యాక్‌ కార్లు..
– వ్యాగన్‌ఆర్, టియాగో, గ్రాండ్‌ ఐ10 నియోస్, స్విఫ్ట్, ఆల్ట్రోజ్, ఐ20, బాలినో మొదలైన కార్లు.
సెడాన్‌ కార్లు..
– డిజైర్, ఆరా, అమేజ్, సిటీ, వెర్నా, సియాజ్‌ మొదలైనవి.

ఎస్‌యూవీ..
– పంచ్, ఎక్స్టర్, బ్రెజ్జా, నెక్సన్, వెన్యూ, క్రెటా, సెల్టోస్, గ్రాండ్‌ విటారా, సఫారీ, ఎక్సూ్యవీ700, ఫార్చ్యూనర్‌ మొదలైన కార్లు.

ఎంవీపీ…
– ట్రైబర్, ఎర్టిగా, ఎక్స్‌ఎల్‌6, కారెన్స్, ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్‌ మొదలైనవి.

మంచి డీల్‌ కుదుర్చుకోవాలి..
మీరు ఏ కారు కొనాలో నిర్ణయించుకున్న తరువాత.. సాధ్యమైనంత వరకు మీకు అందుబాటులో ఉన్న అందరు కారు డీలర్లను సంప్రదించండి. వాళ్లలో మీకు మంచి డీల్‌ ఇచ్చే వాళ్లను ఎంచుకోండి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రతీ డీలర్‌షి వాళ్లు కొన్ని రకాల అదనపు ఆఫర్లు ఇస్తుంటారు. మీరు కూడా బెస్ట్‌ ఆఫర్స్, అదరపు డిస్కౌంట్ల కోసం అడగండి. ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలు పడకండి. కారు కొనేముందు ఎక్స్‌ షోరూం ధర మాత్రమే కాదు. ఆన్‌ రోడ్‌ ప్రైస్‌ (ఓటీఆర్‌) కూడా తెలుసుకోండి. ఓటీఆర్లో కారు ధర, రిజిస్ట్రేషన్‌ ఫీజు, రోడ్‌ ట్యాక్స్, ఇన్సూరెన్స్, ఫాస్టా్టగ్, ఇతర ఛార్జీలు అన్నీ కలిసి ఉంటాయి. డీలర్లు వీటితోపాటు అదనపు ఉపకరణాల ధరలను కూడా ఓటీఆర్లో చేరుస్తారు. ఒక వేళ మీకు అవసరం లేకపోతే.. కారు కొనే సమయంలోనే వాటిని వద్దని చెప్పవచ్చు.

కారు బుకింగ్‌ సమయంలో..
కారును బుక్‌ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. డీలర్లు కారుతోపాటు ఇస్తామన్న కాంప్లిమెంటరీని కచ్చితంగా బుకింగ్‌ రిసిప్ట్‌లో నమోదు చేయించాలి. ఒక వేళ బుకింగ్‌ రిసిప్ట్‌లో ఆ కాంప్లిమెంటరీ ఐటెమ్స్‌ గురించి రాయకపోతే.. కారు డెలివరీ టైంలో వాటిని ఇన్‌స్టాల్‌ చేయకుండానే.. మీకు కారు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీని వల్ల చాలా నష్టపోతారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కారు బుకింగ్‌ రిసిప్ట్‌లో కచ్చితంగా ‘బుకింగ్‌ క్యాన్సిలేషన్‌ అమౌంట్‌’ను కూడా నమోదు చేయించాలి. ఒక వేళ మీరు కారు బుకింగ్‌ రద్దు చేయాలని అనుకుంటే.. అప్పుడు డీలర్‌ మీకు ఎంత మేరకు రిటన్‌ ఇస్తాడో దీని ద్వారా ముందుగానే మీకు తెలుస్తుంది.

ముందుగానే అన్ని సరిచూసుకోవాలి..
కారు అంతా చక్కగా ఇన్‌స్టాల్‌ అయి డీలర్‌ వద్దకు రాగానే.. మీరు కచ్చితంగా ప్రీ–డెలివరీ ఇన్‌స్పెక్షన్‌ చేయండి. కారులో ఏదైనా సమస్యలు ఉంటే కచ్చితంగా డీలర్‌ ద్వారా వాటిని సరిచేయించుకోండి. ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి. డీలర్‌ దగ్గరకు కారు వచ్చినప్పటికీ.. అది మీ పేరు మీద ఇంకా రిజిస్టర్‌ కాలేదని గుర్తుంచుకోండి. కనుక ఈ స్టేజ్లోనే మీరు కారు కొనాలా? వద్దా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేవా? అనేది తేల్చుకోవాలి. ఇప్పుడు గానీ మీరు నిర్లక్ష్యం చేస్తే.. మీ పేరున కారు రిజిస్ట్రేషన్‌ అయిన తరువాత మరేమీ చేయలేరు. ప్రీ డెలివరీ ఇన్‌స్పెక్షన్‌ సమయంలోనే.. మీకు కారు బుకింగ్‌ రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. డీలర్‌ కూడా మీకు కచ్చితంగా రిఫండ్‌ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ మీకు ఇప్పటికే తీసుకున్న కారు ఇన్సూరెన్స్‌ నచ్చకపోతే, దానిని మార్చమని పాలసీ ప్రొవైడర్ను కోరవచ్చు. అంతేకాదు మీకు నచ్చిన వేరే ఇన్సూరెన్స్‌ పాలసీ కూడా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.

డెలివరీ సమయంలో..
సాధారణంగా కారు డెలివరీ తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. డీలర్‌ వద్ద ఉన్న రద్దీ ఆధారంగా కనీసం 3 గంటల సమయమైనా పడుతూ ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో తాత్కాలిక నంబర్తో కారు నడపడం చట్టవిరుద్ధం. కాబట్టి ఆయా ప్రాంతాల్లోని కారు నిబంధనలు గురించి తప్పక తెలుసుకోవాలి. అలాగే కారు డెలివరీ తీసుకున్నప్పుడే.. కారుకు సంబంధించిన అన్ని పేమెంట్స్‌ రిసిప్ట్‌లు, ఇతర ఒరిజినల్‌ పత్రాలు కచ్చితంగా తీసుకోండి. కొన్ని సార్లు కార్ల తయారీ కంపెనీ.. కారు టూల్‌కిట్‌తోపాటు ‘స్పేర్‌ టైర్‌’ను కూడా అందిస్తుంది. కానీ మీ కారు రన్‌–ఫ్లాట్‌ టైర్స్‌ నడుస్తూ ఉంటే మాత్రం ఇలా ‘స్పేర్‌ టైర్‌’ ఇవ్వకపోవచ్చు. కానీ స్పేస్‌ సేవర్‌ వీల్‌ ఇచ్చే అవకాశం ఉంటుంది. వీటిని కూడా చెక్‌ చేసుకోవడం అవసరం. ముఖ్యంగా కారు కొనేటప్పుడు డీలర్లు.. కొన్ని ఉచిత పరికరాలు కూడా ఇన్‌స్టాల్‌ చేసి ఇస్తామని ప్రామిస్‌ చేస్తూ ఉంటారు. కానీ కారు డెలివరీ సమయంలో అవి అందుబాటులో ఉండి ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో వాటి గురించి లిఖితపూర్వకంగా పత్రం రాయించుకోండి. ఈ విధంగా కొత్త కారు కొనేముందు అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.