Nagulaguddam Bharti: పేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడదు. కానీ చదువుకోవాలనే ఆశ. నలుగురికి ఆదర్శంగా ఉండాలనే తపన. ఆర్థిక పరిస్థితి తలుచుకుంటే గుండెల నిండా బాధ. చదువుకుంటున్న వాళ్ళని చూస్తే కంటి నిండా నీరు.. ఇన్నేసి కష్టాల మధ్య ఆమె చదువుకుంది. కొలిమిలో మండిన కొరకాసు లాగా వెలిగింది. విద్వత్తు ఉంటే విద్య అదే వస్తుంది. సాధించాలనే తపన ఉంటే ఎంతటి కష్టమైనా తలవంచుతుంది. ఈ మాటలను నిజం చేసి చూపించింది. చదువుకోవడం అంటే చదువు ” కొనడం” కాదని చాటి చెప్పింది.. సందర్భంగా పీహెచ్డీ పట్టా అందుకుంది. ఇంతటి సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో కష్టాలు పడింది. మరెన్నో బాధలు అనుభవించింది. కన్నీటిని దిగమింగుకుంది. చదువుల తల్లిగా ఎదిగింది. దీప శిఖలాగా ప్రజ్వరిల్లింది. ఇంతకీ ఎవరు ఆ మహిళ? చదువుకునేందుకు ఆమె పడిన తపన ఎంత? పీహెచ్డీ పట్టా అందుకుంటున్నప్పుడు ఆమె కళ్ళు పొందిన ఆనందం ఎంత? మీరూ చదివేయండి ఈ అద్భుత విజయ గాధ.
సింగనమల ప్రాంతంలో పుట్టి..
అది రాయలసీమ. అనంతపురం జిల్లాలోని సింగనమల మండలం నాగులగుడ్డం అనే గ్రామం. అరచేతిలో ప్రపంచం కనిపిస్తున్న ఈ రోజుల్లో ఆ గ్రామం కనీస సౌకర్యాలకు దూరంగానే ఉంది. ఆ ఊరి చివర విసిరి వేసినట్టు ఒక రేకుల షెడ్డు. మామూలు రోజుల్లో అయితే ఆ ఇంటి ముందు పెద్ద సందడి ఉండదు. కానీ ఆరోజు ఎందుకో ఆ ఇంటి ముందు భారీ ఎత్తున జనం గుమి గూడారు. అందరూ కూడా దినసరి కూలీలే. అందరి ముఖాల్లోనూ ఆశ్చర్యం. ఒక రకమైన ఆసక్తి. ” ఏం అక్క ఇది వినింటివా.. మంతోపాటే కూలి పనులకొచ్చే భారతి డాక్టర్ అయిందంటనే” అని అమ్మలక్కలు చెప్పుకుంటూ ఆశ్చర్యం చెందుతున్నారు.. మరి కొంతమంది ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పొలిటికల్ లీడర్లైతే శాలువాలు, పుష్పగుచ్చాలు ఇచ్చి నీకు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ ఆమెలో అదే స్థితప్రజ్ఞత. ఆ చదువుల తల్లి “భారతి”లో నిండుకుండ లాగా నిలకడ.
స్థితప్రజ్ఞత
ఇది భారతి డాక్టర్ అయ్యే కంటే ముందు రోజు.. అది అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ ప్రాంగణం. స్నాతకోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయి. పీహెచ్డీ పట్టా అందుకునేందుకు వేదిక మీదకు భర్త, కూతురు తో కలిసి వచ్చింది భారతి. కాళ్లకు పారగాన్ చెప్పులు, మామూలు చీర కట్టుకొని వచ్చింది. ఆమె ఆహార్యాన్ని చూసి వేదిక మీద పెద్దలు, అతిథుల కల్లో ఒకటే ఆశ్చర్యం. పేదరికం లక్ష్యసాధనకు అడ్డంకి కాదని రుజువు చేస్తూ నడిచి వస్తున్న ఆ చదువుల సరస్వతిని చూసి అందరూ అబ్బుర పడిపోయారు. అయినప్పటికీ ఆమెలో కొంచెం కూడా గర్వం లేదు. పీహెచ్డీ పట్టా అందుకుంటున్నాను అనే దర్పం కూడా లేదు.
రాయలసీమ ఆణిముత్యం
సింగనమల ప్రాంతానికి చెందిన భారతికి చిన్నప్పటినుంచి బాగా చదువుకోవాలని కోరిక ఉండేది. పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నది. ఇంటర్మీడియట్ పామిడి జూనియర్ కాలేజీలో పూర్తి చేస్తుంది.. తల్లిదండ్రులకు ముగ్గురు అమ్మాయిలు సంతానం. వారిలో భారతి పెద్ద కుమార్తె. వారందరి బాధ్యతల భారం, కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక మేనమామ శివ ప్రసాద్ తో ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేశారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు ఉన్నప్పటికీ ఆ విషయం తన భర్తకు చెప్పలేకపోయింది. కానీ అతడు ఆమె కోరికను అర్థం చేసుకున్నాడు. పై చదువులు చదివించేందుకు ప్రోత్సాహం అందించాడు. భారతి కూడా తమ జీవితాలు బాగు చేసుకునేందుకు ఇదొక అవకాశం అనుకుంది. భర్త ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అయినప్పటికీ కొన్ని రోజులు కాలేజీకి వెళ్లేది. కొన్ని రోజులు కూలి పనులకు వెళ్ళేది.. ఇలా అనంతపురం ఎస్ఎస్ బీఎన్ కాలేజీలో డిగ్రీ, పీజీ పూర్తి చేసింది. అప్పటికే తన ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ పేరు గాయత్రి. ఆ బిడ్డ బాగోగులు చూసుకుంటూనే చదువు, ఇంటి పనులు చేసేది.. రాత్రి పొద్దుపోయేంతవరకు, ఉదయం కోడి కూయకముందుకే లేచి పుస్తకాలతో కుస్తీ పట్టేది. కాలేజీకి వెళ్లాలంటే ఊరు నుంచి కనీసం 28 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఆ స్థాయిలో రవాణా ఖర్చులు భరించాలంటే అతని భర్తకు ఇబ్బందికరంగా ఉండేది. అందుకే రోజు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని గార్లదిన్నె వరకు నడిచి వెళ్ళేది. అక్కడి నుంచి బస్సు ఎక్కి కాలేజీకి వెళ్లేది. ఎన్ని కష్టాలు పడ్డప్పటికీ ఆ ప్రభావం చదువు మీద ఉండకుండా చూసుకుంది. మంచి మార్కులతో డిగ్రీ, పీజీ పాస్ అయింది. ఇది చూసిన ఆమె భర్త, ఆమెకు చదువు చెప్పిన అధ్యాపకులు పీహెచ్డీ వైపు వెళ్లాలని సూచించారు.. దీంతో ఆమె కూడా ఆ దిశగా అడుగులు వేసింది.
భర్త, అధ్యాపకుల సూచనతో..
పిహెచ్డివైపు ఆమె ప్రయత్నిస్తే ప్రొఫెసర్ డాక్టర్ ఎంసీఏ శుభ దగ్గర బైనరీ మిక్సర్స్ అనే అంశంపై పరిశోధనకు అవకాశం లభించింది. దీనికోసం ప్రభుత్వం మంజూరు చేసిన ఉపకార వేతనం ఆమెకు ఉపకరించింది.. అయినప్పటికీ తను కూలి పనులు మానలేదు.”డాక్టరేట్ చేస్తే వర్సిటీ స్థాయిలో ఉద్యోగం అందుకోవచ్చు. అది మా జీవితాల్ని బాగు చేస్తుంది. కానీ నేను నేర్చుకున్న జ్ఞానాన్ని మరింత మందికి పంచవచ్చు. నేను సాధిస్తే అది ఎంతోమందికి ప్రేరణ కూడా కలిగిస్తుంది. ఇవన్నీ నన్ను నడిపించాయి.. కష్టాలే నన్ను ఈ విధంగా రాటు తేల్చాయి. నా మనసులో మరొక తండ్రి నా భర్త అర్థం చేసుకున్నాడు. నా పేరు ముందు ఇవాళ డాక్టర్ అని ఉందంటే దానికి కారణం అతడే.” అంటూ భారతి రెండు ముక్కల్లో చెప్పేసింది. ఈ మాటల్లో కూడా స్థితప్రజ్ఞత. కించిత్ కూడా గర్వం కనిపించనితనం. ఇలాంటి వారే మట్టిలో మాణిక్యాలు అనే నానుడికి నిలువెత్తు నిదర్శనం..