Monsoon Precautions : వర్షాకాలం వచ్చిందంటే చాలు వాతావరణ మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. ఈ వ్యాధులతో చాలా మంది బాధ పడుతుంటారు. దోమలు, కలుషిత నీరు, ఆహారం కారణంగా డెంగీ, మలేరియా వైరల్ వ్యాధులు రాజ్యమేలుతాయి. అయితే, ఈ కాలంలో కండ్లకలక కూడా ఎక్కువగా వస్తుంటుంది. కండ్లు పొడిబారి లేతగులాబీ రంగులోకి మారుతుంటాయి. దీనివల్ల నొప్పి, మంట వంటివి ఎక్కువ వస్తుంటుంది. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే ఈ కండ్ల కలక వస్తుంది అంటున్నారు నిపుణులు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
వాతావరణంలోని అధిక తేమతో పాటు క్రిములు, సూక్ష్మజీవుల ఉంటాయి. వీటి వల్ల కళ్లు ఎర్రగా మారుతాయి. పొడిబారి ఊసులతో పాటు నొప్పి, అసౌకర్యం కలుగుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు. అవేంటంటే..
చేతులు శుభ్రంగా ఉంచుకోవడం : కండ్లకలక అంటు వ్యాధిలా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కాబట్టి, ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే చేతులను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం మర్చిపోవద్దు. తరచూ చేతులను సబ్బు వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల హానికారక క్రిముల నుంచి, కంజెక్టివైటిస్ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షించుకోవచ్చు. మార్కెట్లో లభించే ప్రత్యేకమైన మాయిశ్చర్ షీల్డ్ హ్యాండ్‌వాష్‌లను వాడితే చేతులు మృదువుగా ఉంటాయి. అంతేకాదు క్రిములు నశించిపోతాయి. ఇలా కండ్లకలక వ్యాప్తి నుంచి మనతో పాటు మన ఫ్యామిలీని కూడా దూరంగా ఉంచవచ్చు.
కళ్లను తాకకపోవడం : చేతులను పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాతనే కళ్లను తాకాలి. అపరిశుభ్ర చేతులతో కళ్లను తాకకూడదు. లేదంటే చేతివేళ్లపై ఉండే వైరస్, బ్యాక్టీరియాలు నేరుగా కంటిలోకి వెళ్లి కండ్లకలకకు వచ్చేలా చేస్తాయి. ముఖ్యంగా పిల్లలకు ఈ వ్యాధి సోకే ఛాన్స్ ఎక్కువ కాబట్టి పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు పిల్లల చేతులను పరిశుభ్రంగా ఉంచేలా జాగ్రత్త తీసుకోవాల్సిందే మీరే. ముఖ్యంగా బాత్‌రూంకి వెళ్లొచ్చాక తప్పక శుభ్రం చేసుకోమని చెప్పండి.
కొన్ని షేర్ చేసుకోవద్దు : మాన్సూన్ సీజన్‌లో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఒకే వస్తువును ఎక్కువ మంది వాడవద్దు. ఇలా వాడటం వల్ల కండ్లకలక వ్యాపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా, టవల్, బెడ్, పిల్లో, దుస్తులను వేరే వారితో షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు ఎంత పరిశుభ్రంగా ఉన్నా అవతలి వ్యక్తి అపరిశుభ్రత పాటిస్తే మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
వైద్య సలహా : కండ్లకలక లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఎలాంటి లక్షణాలు కనిపించినా సరే వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేదంటే సమస్య మరింత ముదిరే అవకాశం ఉంది. కాబట్టి, ముందుగానే వ్యాధిని గుర్తించి వైద్యుడిని కలవడం ఉత్తమం. కళ్లు పొడిబారి అదేపనిగా నీరు కారుతున్నా, నొప్పిగా అనిపిస్తున్నా,వైద్యుల సలహా తీసుకోవాలి.
ఐ డ్రాప్స్ : ఐ డ్రాప్స్ విషయంలోనూ జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. ఫ్యామిలీలో ఎవరికైనా కండ్లకలక వస్తే, వారు ఒక్కరే సొంతంగా ఐ డ్రాప్స్ ను ఉపయోగించాలి. ఒకరికి వాడిన డ్రాప్స్ బాటిల్‌ని మరొకరు తాకకూడదు. ఉపయోగించకూడదు. లేదంటే ఈ వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మీరు కండ్ల కలక నుంచి రక్షించుకోవచ్చు.