Homeక్రీడలుBCCI- Women Cricketers: పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజు.. కానీ కాంట్రాక్టుల్లో కాదు.. మహిళ క్రికెటర్లకు...

BCCI- Women Cricketers: పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజు.. కానీ కాంట్రాక్టుల్లో కాదు.. మహిళ క్రికెటర్లకు ట్విస్ట్ ఇచ్చిన బీసీసీఐ

BCCI- Women Cricketers: ఆట ఒకటే. బోర్డు కూడా ఒకటే. వచ్చే ఆదాయం కూడా ఒకటే. కానీ పంపకంలోనే తేడా. అందుకే ఇన్నాళ్లు వారు ఆడుతున్నా విలువ లేకుండా పోయింది. లింగ బేధం కొట్టొచ్చినట్టు కనిపించడంతో చెమటోడ్చి ఆడినా ఫలితం లేకుండా పోయింది. వారంతే మారరు అంతే అనుకొని ఈ క్రికెట్ ఇంతులు నైరాశ్యంలో కూరుకు పోయారు. కానీ వారి కలను సాకారం చేసేందుకు ఆలస్యం అయినప్పటికీ భారత క్రికెట్ బోర్డు ముందుకొచ్చింది. ఆకాశంలో సగం, ఆటలో సగం, ఫీజులోనూ సమన్యాయం అనే తీరుగా కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో మహిళ క్రికెటర్లలో హర్షం వ్యక్తమవుతోంది. కానీ మ్యాచ్ ఫీజు సమానంగా ఇచ్చిన బీసీసీఐ పురుష క్రికెటర్లతో సమానంగా కోట్లలో కాంట్రాక్టులు ఇవ్వకుండా ట్విస్ట్ ఇచ్చింది. అది కూడా ఇస్తే వాళ్లకు సమాన న్యాయం చేసినట్టు అవుతుంది.

BCCI- Women Cricketers
BCCI- Women Cricketers

-పురుషులతో సమానంగా వేతనాలు

దేశ క్రికెట్లో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే దిశగా భారత క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఉన్న మహిళ క్రికెటర్లకు పురుషులతో సమానంగా మ్యాచ్ రుసుములు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కొత్తగా ప్రవేశపెట్టే విధానంలో మహిళా క్రికెటర్లు పురుష ఆటగాళ్లతో సమానంగా ఒక్కో టెస్ట్ మ్యాచ్ కు 15 లక్షలు, వన్డేకు ఆరు లక్షలు, టి20 మ్యాచ్ కు మూడు లక్షల చొప్పున రుసుము అందుకుంటారు. గతంలో ఒక్కో వన్డే, టి20 మ్యాచ్ కి లక్ష, టెస్ట్ మ్యాచ్ కి నాలుగు లక్షల చొప్పున వేతనం లభించేది.

-అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం

గురువారం బిసిసిఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది.. అనంతరం కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ విలేకరులతో మాట్లాడారు. బీసీసీఐ తాజా నిర్ణయం దేశ మహిళా క్రికెట్ కు, క్రికెట్ అభివృద్ధికి మరింత బాటలు వేస్తుందని ప్రకటించారు. భారత క్రికెట్ కొత్త శకంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం గొప్పదిగా అభివర్ణించారు. పురుషులతో సమానంగా మహిళలకు మ్యాచ్ ఫీజులు అనే విధానం లో వివక్షను రూపుమాపేందుకు తమ చర్యలు తీసుకున్నామని వివరించారు. ” ఇది సమిష్టిగా తీసుకున్న నిర్ణయం. అన్ని రంగాల్లో పోటీపడుతున్న ఆడవాళ్లు.. క్రికెట్ ఆడేందుకు కూడా ముందుకు రావాలి. అలా వారు రావాలంటే మెరుగైన పారితోషకాలు ఉండాలి. కేవలం పురుషులు మాత్రమే కాదు.. మహిళలు కూడా వారి కంటే మెరుగ్గా రాణించగలరు. వారిని గొప్పగా మనం చూడాలి అనుకుంటే అందుకు తగ్గట్టుగానే ప్రోత్సాహకాలు అందించాలని” బీసీసీఐ సెక్రటరీ జై షా అభిప్రాయపడ్డారు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం మహిళలకు క్రికెట్ పట్ల ఇష్టాన్ని పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ విధానాన్ని న్యూజిలాండ్ క్రికెట్ అమలు చేస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది మహిళా ఐపీఎల్ కూడా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన నేపథ్యంలో మ్యాచ్ ఫీజుల ప్రకటన వెలుడడం విశేషం.

-శ్రీమంతమైన బోర్డు

ప్రపంచ క్రికెట్ బోర్డులతో పోల్చుకుంటే బీసీసీఐ అత్యంత శ్రీమంతమైనది, శక్తివంతమైనది. స్పాన్సర్ రూపంలోనే ఏటా వేల కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కు వచ్చే ఆదాయంలో సింహ భాగం బీసీసీఐ ద్వారా వెళ్లేదే. అక్కడిదాకా ఎందుకు పాకిస్తాన్ కు కూడా 50% ఆదాయం బీసీసీఐ ద్వారానే వెళ్తుంది. ఈ విషయాన్ని ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్ రాజా వెల్లడించారు. ఇప్పటికే పురుష క్రికెటర్లు కోట్లకు పడగలెత్తుతున్నారు. మహిళ క్రికెటర్లు కూడా అదే స్థాయిలో ఆడుతున్నప్పటికీ.. ఆశించినంత మేర పారితోషకాలు లభించడం లేదు. ఇదే విషయాన్ని పలుమార్లు మహిళా క్రికెటర్లు బోర్డు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పెద్దగా ప్రయోజనం దక్కలేదు. అయితే తాజాగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవడంతో మహిళ క్రికెటర్లలో హర్షం వ్యక్తమవుతోంది. తాజాగా పెంచిన ఫీజుల ప్రకారం గతంలో ఒక టెస్టుకు నాలుగు లక్షలు లభిస్తే, ఇప్పుడు అది పదిహేను లక్షలకు చేరుకుంది. గతంలో ఒక వన్డే ఆడితే లక్ష రూపాయలు ఫీజుగా చెల్లించేవారు. ఇప్పుడు అది ఆరు లక్షలకు పెరిగింది. ఇక టి20 మ్యాచ్ అయితే లక్ష ఇచ్చేవారు. ఇప్పుడు దానిని మూడు లక్షలకు పెంచారు.

BCCI- Women Cricketers
BCCI- Women Cricketers

– మ్యాచ్ ఫీజు వరకే.. వార్షిక కాంట్రాక్ట్స్ లో సమానత్వం ఇంకా ఇవ్వలేదు?

అందరూ మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును సమానం చేసిన బీసీసీఐని వేయినోళ్ల పొగుడుతున్నారు కానీ.. ఇక్కడే భారీ ట్విస్ట్ ఉంది. బీసీసీఐ పురుష క్రికెటర్లకు వారి సీనియారిటీని బట్టి 12 నుంచి 15 కోట్ల వరకూ ఏడాదికి కాంట్రాక్టును ఇస్తుంది. టెస్టు సీనియర్లకు ఈ మొత్తం ఇస్తుంది. కానీ మహిళా క్రికెటర్లను ఈ కాంట్రాక్టుల్లోకి తీసుకోకుండా బీసీసీఐ ట్విస్ట్ ఇచ్చింది. ఎందుకంటే పురుషుల క్రికెట్ తో పోలిస్తే మహిళల క్రికెట్ కు ఆదరణ తక్కువ. మ్యాచ్ ఫీజును మాత్రమే సమానం చేసి కాంట్రాక్టులకు మాత్రం మహిళా మణులకు బీసీసీఐ అవకాశం ఇవ్వలేదు. ఆ ఒక్కటి కూడా అమలు చేస్తే బీసీసీఐ సమానత్వం చేసినట్టు లెక్క. కేవలం మ్యాచ్ ఫీజులను మాత్రమే సమానం చేస్తే ఆర్థికంగా కొంత లాభం అయినా.. పురుష క్రికెటర్లలాగా మహిళా క్రికెటర్లు కోట్లు సంపాదించలేరు. ఇక్కడే బీసీసీఐ షాకిచ్చింది. ఏమైనా ఇప్పటికే బీసీసీఐ కొంతవరకూ తీసుకున్న నిర్ణయం మంచి అడుగుగానే చెప్పొచ్చు..

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular