Mosquito Repellents: వాతావరణ కాలుష్యం పెరిగిపోవడంతో పాటు.. అపరిశుభ్రత ఎక్కువగా ఉండటం వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో దోమల సమస్య అధికంగా ఉంటుంది. అయితే ఈ సమస్య పరిష్కారానికి కొంతమంది ఆల్ అవుట్, గుడ్ నైట్ వంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇటీవల మార్కెట్లోకి దోమల నివారణ కోసం అగరుబత్తులు వస్తున్నాయి. వీటి ధర తక్కువగా ఉండడంతో చాలామంది వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా ఇవి అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించుకునేందుకు వీలు ఉండడంతో చాలామంది వీటిని కొనుగోలు చేసి స్టోర్ చేసుకుంటున్నారు. కానీ ఇవి ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రమాదమో తెలిస్తే షాక్ అవుతారు. మరి వాటి వల్ల ఎలాంటి నష్టాలో ఇప్పుడు చూద్దాం..
కాలం మారుతున్న కొద్ది కొన్ని అవసరాలు సులువుగా లభ్యమవుతున్నాయి. ఒకప్పుడు దోమల నివారణకు మున్సిపాలిటీ, కార్పొరేషన్ వాళ్లు వేసే పాగింగ్ మాత్రమే ఉండేది. ఆ తర్వాత మస్కిటో కాయిల్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటివల్ల శ్వాసకోశ ఇబ్బందులు ఎదురయ్యాయని కొందరు ఆరోగ్య నిపుణులు తెలిపారు. అంతేకాకుండా వీటివల్ల ఆర్థికంగా కూడా నష్టం ఉన్నదని భావించారు. దీంతో ఇటీవల దోమల నివారణ కోసం అగరబత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే ఈ అగరబత్తులు చాలావరకు నాణ్యమైనవి లేకుండా ఉన్నాయని కొందరు తెలుపుతున్నారు. ఇందులో వారు సిట్రోనిల్లా, యూకలిస్ట్ వంటివి వాడుతున్నామని చెబుతున్నారు. కానీ అందుకు సంబంధించిన విషయం వాటి ప్యాకెట్ పైన ఎక్కడా లేదు. అంతేకాకుండా స్లీప్ వెల్, టైగర్ వంటి అగరబత్తుల ప్యాకెట్ల అడ్రస్లు ఫేక్ అని తేలినట్లు సమాచారం. అయితే వీరు అగర్ బత్తులను ఎలా తయారు చేస్తున్నారో.. ఎవరికీ తెలియదు. అందువల్ల వీటిని కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు తెలుపుతున్నారు.
ప్రభుత్వం ఆమోదించిన వాటిని మాత్రమే కొనుగోలు చేయాలని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఆమోదించిన వాటి వెనకాల CIR నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ ఆధారంగా ఆ ప్రోడక్ట్ గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ తక్కువ ధరలో లభించే దోమల అగరబత్తుల ప్యాకెట్లపై ఇలాంటి విషయాలు ఉండవు. అంతేకాకుండా దోమల అగర్బత్తులను వాడడం వల్ల శ్వాస కోస ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు గుర్తించారు. ఇవే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అందువల్ల తక్కువ ధరకు లభిస్తున్నాయని దోమల అగర్బత్తుల జోలికి వెళ్లకూడదని చెబుతున్నారు.