Smartphone Addiction: సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో స్మార్ట్ ప్రపంచం వైపు ప్రజలు అడుగులు వేస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్, టీవీలు ఇలా చాలానే ఉన్నాయి..వీటిలో ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు..ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లేనిదే రోజు గడవదనే చెప్పుకోవచ్చు. లేచింది మొదలు నిద్ర పోయేంతవరకు చేతిలో తప్పనిసరిగా ఫోన్ ఉండాల్సిందే. స్మార్ట్ ఫోన్లతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అంతకు మించి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్లతో పాటు టీవీల ప్రభావం చిన్నారులపై అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.
మనలో చాలా మంది పని చేసుకోవడానికి లేదా.. చిన్నారులు అల్లరి చేయకుండా ఉండాలని, పిల్లలు అన్నం తినడం లేదని ఇలా పలు కారణాలతో వారి దృష్టిని మరల్చడానికి టీవీ లేదా ఫోన్ ను చూపిస్తుంటారు. అయితే అవి చిన్నారులపై ముఖ్యంగా రెండు సంవత్సరాల లోపు పిల్లల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని తెలుస్తోంది.
చిన్నారులకు పదే పదే స్మార్ట్ ఫోన్లు లేదా టీవీలను చూపించడం వలన వారి మానసిక సామర్థ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా ఫోన్లకు బాగా అలవాటుపడిన రెండేళ్ల లోపు పిల్లల్లో ఎటిపికల్ సెన్సరీ బిహేవియర్ మొదలు అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
నార్మల్ గా సెన్సేషన్ సీకింగ్ అంటే వస్తువులను పదే పదే తాకటం, వాసన చూడటంతో పాటు నిరాశకు గురి కావడం, చిన్న చిన్న సౌండ్స్ కే చిరాకు పడటం మరియు వెలుతురును చూడలేకపోవడం వంటి ప్రభావాలు కనిపిస్తాయి. కొందరు చిన్నారులు పళ్లు తోముకోవడానికి కూడా నిరాకరించడం వంటి సమస్యల బారిన పడుతుంటారని వైద్యులు చెబుతున్నారు.
అంతేకాదు టీవీలు, ఫోన్లను తరచూ చూపించడం వలన పిల్లలకు మాటలు ఆలస్యంగా వస్తాయని తెలుస్తోంది. ఏకాగ్రతలోపం, నిద్రలేమి, ఏ విషయంపై అయినా నెమ్మదిగా స్పందించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
పిల్లలపై చెడు ప్రభావం ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో పసి పిల్లలను టీవీలు, ఫోన్లకు దూరంగా ఉంచాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. కనీసం పిల్లలకు మూడేళ్ల వయసు వచ్చే వరకు ఫోన్లు, టీవీలను చూపించవద్దని చెబుతున్నారు. ఇలా చేస్తే వారి బంగారు భవిష్యత్ కు మనం బాటలు వేసిన వాళ్లం అవుతాం.